నటనకు వ్యాకరణం బందా గారు (27);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 చివరకు మిగిలేది నవల ద్వారా సాహితీ ప్రియులకు పరిచయమైన బుచ్చిబాబు గారి పేరు విననివారు లేరు. తెలుగులో వారు రాసిన అద్భుతమైన నాటిక  గాజు మేడ  దానిలో నటించడం నా అదృష్టం. బందా గారు కూడా ఒక మంచి పాత్ర ధరించారు.  బుచ్చిబాబు గారిలో ప్రత్యేకత  ఆ పాత్ర చదువుతున్నప్పుడు తప్పులు వస్తే ఇది తప్పు ఇలా చదవాలి అని చెప్పేవారు కాదు. అబ్బాయి బండి గాడి తప్పుతుంది పట్టాల మీద పెట్టు అనేవారు దాంతో కళాకారుడే ఆ వేషాన్ని ఎలా మార్చాలి, చెప్పిన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించి  తరువాత  చదవడంతో  దానికి జీవము వచ్చేది ఆ పద్ధతి మొదటిసారిగా బుచ్చి బాబు గారిలోనే చూశాను.  తర్వాత సినీ దర్శకత్వంలో అతి ముఖ్యులు బి. యన్ రెడ్డి గారు కేవీ రెడ్డి గారు  నిర్వహించే కార్యక్రమాలను చూసినప్పుడు నాకు బుచ్చిబాబు గారే జ్ఞాపకం వచ్చేవారు. నండూరి సుబ్బారావు గారు రాసేవి  నూటికి నూరుపాళ్ళు  హాస్యనాటికలే  ఎక్కువగా పావుగంట అరగంట నాటకాలను రాస్తూ ఉంటారు  వారు రాసిన నాటకాలు అన్నిటిని నిలయ విద్వాంసులతోనే  ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.  వారు రాసిన నాటకాలు చాలావరకు ఇద్దరు, ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలను తీసుకొని  దానిని నాటకీయంగా మలిచి  జీవాన్ని తీసుకొస్తూ  చివరి వరకు ఉత్కంఠ  భరితంగా ఉన్న వాటినే ఎన్నిక చేస్తారు.  భాష కూడా చాలా సరళంగా నిత్యం మనం  మాట్లాడుకునే మాటలనే ఏర్పాటు చేస్తారు. ఎక్కువగా వారితో పాటు నేను వి.బి కనకదుర్గ, నాగరత్నమ్మ సి రామ్మోహన్ రావు పాల్గొంటూ ఉంటాం. అందరూ  అతి సన్నిహితంగా ఉండే వారే కనుక  వారి సాన్నిహిత్యం ఆ పాత్రలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకే వారు రచించిన ప్రతి నాటిక కూడా శ్రోతలను అలరిస్తూ ఉంటుంది.
అలా నాటకాలు వేస్తున్న సమయంలో  నాకు మార్గదర్శకమైన నండూరి సుబ్బారావు గారిని  ఏకవచన ప్రయోగం చేయాలంటే  మనసు  ఒప్పేది కాదు  అందువల్ల ఆ పాత్ర పేరుతో సంబోదిస్తూ చెప్పేవాడిని  గురువుగారు దానిని  గమనించలేదని నేననుకుంటాను  మిగిలిన వారి ముందు నన్ను సరిదిద్దటం బాగుండదన్న అభిప్రాయంతో కూడా దానిని అంగీకరించి ఉండేవారేమో  అలా జరుగుతున్న సమయంలో ఒక నాటకంలో బందాగారు, నేను, సుబ్బారావు గారు  రామ్మోహన్ రావు గారు నటించవలసి వచ్చింది.  అక్కడ కూడా ఈ పద్ధతిని అవలంబిస్తే  బందా గారు కలగజేసుకొని  సుబ్బన్న వ్రాసిన దానిని ఎందుకు మార్చావయ్యా  తను రాసిన దాంట్లో చక్కటి సెంటిమెంట్ ఉంటుంది  అరె ఒరే అని ఎంతో చొరవ ఉన్నవాళ్ళతో కదా మాట్లాడటం  నీవు అరే అంటే  బందానో సుబ్బన్న నో కాదుగా  ఆ పాత్రను అంటున్నవ్  ఆ పాత్ర నేను కాదు కదా  రికార్డింగ్ అయిపోయిన తర్వాత దాని పాత్ర దానిదే నా పాత్ర నాదే  అని చెప్పిన తర్వాత నేను అలవాటు పడడానికి చాలా కష్టపడవలసి వచ్చేది  వారిద్దరిని ఏక వచన ప్రయోగం చేయడానికి  మనసు ఎంతో పీకులాడుతూ ఉండేది  కానీ తప్పదు కదా.

కామెంట్‌లు