ఢిల్లీ కేంద్రం నుంచి మెల్వెల్ డి మెల్లో విజయవాడ కేంద్రానికి వచ్చి నాగార్జునసాగర్ డ్యాం గురించిన డాక్యుమెంటరీ రికార్డు చేశారు. దానిలో నెహ్రు గారి మాటలను మిగిలిన ముఖ్యమైన వారి విషయాలను దానికి కారణభూతులైన వారి పేర్లను కూడా జోడించి వారు ఆంగ్లంలో తయారుచేసిన రూపకాన్ని విజయవాడ కేంద్రం తెలుగులో అనువదించి ప్రసారం చేసింది. భారతదేశంలో ఉన్న నదులను, నదములను కొండ నుంచి కడలిదాకా అన్న శీర్షికతో గంగా నది నుంచి కృష్ణా నది వరకు ప్రతి నది పుట్టుక నుంచి ఏ ఏ ప్రాంతాల ద్వారా సముద్రంలో కలిసిపోతుందో అంతవరకు ఉన్న దేవాలయాలను ప్రముఖ నగరాలను ఆ నీరు ఆ ప్రాంత రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అన్న సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందించడం దాని ముఖ్య ఉద్దేశం. తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి తూర్పుకు ప్రవహించే వాటిని నదీ నదములు అంటారు.
శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథలు అన్న శీర్షికలో ప్రతి కథను రూపకంగా మార్చి వారు రాసిన 100 కథలను వంద రూపకాలుగా శ్రోతలకు అందించాం. అలాగే మొక్కపాటి వారి సాక్షి ప్రసంగాలను దానిలో ఉన్న హాస్య రసాన్ని తగ్గించకుండా ఒక్కొక్క వ్యాసాన్ని ఒక్కొక్క రూపకంగా తయారు చేసి ప్రసారం చేశాం. అలాగే రమణ మహర్షి జీవితాన్ని శ్రీ భగవాన్ అనే పేరుతో రూపక ప్రక్రియ గా ప్రత్యేకించి రమణ మహర్షి ప్రథమ శిష్యులు కృష్ణ బిక్షు గారు చెప్పిన వివరాలను చలం గారి అమ్మాయి సౌరిస్ రమణ మహర్షి శిష్యురాలుగా రావడానికి కారణాలను ఆమె ద్వారా చెప్పించి దానికి మా వ్యాఖ్యానం జత చేసి రమణ మహర్షి వారి జీవిత చరిత్ర పూర్తి పాఠాన్ని ప్రత్యేకించి రమణ మహర్షి తిరువణ్ణామలై వచ్చినప్పుడు వారిని లోపలకు పిలిచి భోజనం పెట్టి ఆదరించిన మిస్సెస్ తల్యార్ఖాన్ అభిప్రాయాన్ని కూడా దానిలో పొందుపరచడం విశేషం.
యోగివేమన జీవితాన్ని ఆధారం చేసుకొని గంట నాటకంగా ప్రసారం చేసిన తర్వాత వారి పూర్తి చరిత్ర దానిలో ఇమడకపోవడంతో రూపక ప్రక్రియలో ధారావాహికగా ప్రసారం చేసాం. అలాగే దేశ నాయకుల గురించి వారి జయంతి, వర్ధంతి సమయాలలో వారి జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టాలను ఎంచి దానిని సంభాషణగా పద్య గద్యాత్మకంగా ప్రసారం చేస్తాం. ఈ రూపక ప్రక్రియకు నాటకానికి ఉన్న ప్రత్యేక భేదం ఒక విషయాన్ని నాటకీయతతో చెప్పితే శ్రోతల మనసుకు అది నాటుతుంది జ్ఞాపకం ఉంటుంది కానీ ఈ రూపకాలలో ఆ నాటకీయతకు అవకాశం ఉండదు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తూ.చా. తప్పకుండా చెప్పడం వరకే దాని బాధ్యత. రూపక ప్రక్రియలో మనం సేకరించిన ప్రతి విషయాన్ని శ్రోతలకు అందించడానికి అవకాశం ఉంటుంది కానీ నాటక ప్రక్రియలో అది కుదరదు అందులో ఇమడదు ఇలా ప్రతి నెల రెండు రూపకాలను ప్రసారం చేస్తుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం మనం ప్రసారం చేసిన ప్రతిరూపకం శ్రోతల మన్ననలను పొందినదే ఈ అవకాశం ఆకాశవాణిలో ప్రారంభించిన వారు బందా కనక లింగేశ్వర రావు గారి ద్వారానే జరిగింది. దాదాపు 600 రూపకాల పైనే ఆకాశవాణి విజయవాడ కేంద్రం
ప్రసారం చేసింది.
నటనకు వ్యాకరణం బందా గారు (42) ;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి