సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -8
అవ్యాపార వ్యాపార న్యాయము 
  ******
 అవ్యాపార వ్యాపార న్యాయములో అవ్యాపారమ అంటే ఏ పనీ లేకుండా ఉండటం.వ్యాపారం అంటే  ఏదో ఒక వ్యాపకం లేదా పని కలిగి ఉండటం.
ఏదో ఒక పనిలో నిమగ్నమైన వ్యక్తిని ఏపనీ పాట లేని వ్యక్తి వచ్చి పని చేస్తున్న వ్యక్తికి అడ్డుతగలడం లేదా చెడగొట్టడాన్ని 'అవ్యాపార వ్యాపార న్యాయము' అంటారు.
కొంత మందిని చూస్తుంటాం మంచి పనివేళ వచ్చి నింపాదిగా తిష్ట వేస్తారు.ఇక ఆపకుండా ముచ్చట్లు పెడుతూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళను ఏమీ అనలేక లోలోపల బాధ పడుతూ పైకి మొహమాటం కొద్దీ నవ్వు మొహంతో వాళ్ళ మాటలు వింటుంటారు.
వాళ్ళు వెళ్ళిన తరువాత నష్టపోయిన సమయాన్ని,పనిని తలుచుకుని బాధ పడటం  జరుగుతుంది.
అలాంటి వాళ్ళను గురించిన చెప్పుకునే న్యాయమే అవ్యాపార వ్యాపార న్యాయము.
ఈ న్యాయాన్నే "కూసే గాడిద వచ్చి మేసే గాడిదిని చెడగొట్టిందట" అనే సామెతతో ఉదహరించడం పరిపాటి.
ప్రతి వారికీ సమయం, చేసే పని ఎంతో విలువైనదని గుర్తించాలి.
కాబట్టి అలాంటి అపవాదు రాకుండా, ఇతరులకు ఇబ్బంది కలుగనీయకుండా అవ్యాపార వ్యాపార న్యాయానికి దూరంగా ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు