దేశ భక్తి;- సి.హెచ్.ప్రతాప్
 " లేదురా ఇటువంటి భూదేవి ఇంకెందు
లేరురా నీవంటి పౌరులింకెందు
అవమానమేలరా, అనుమానమేలరా
భారతీయుడనంచు భక్తితో పలుక’’
అన్న రాయప్రోలు మాటల్ని నిరంతరం స్మరిస్తూ వుంటే అది దేశభక్తి అవుతుంది. భారతదేసమనే ఈ పవిత్ర పుణ్య, కర్మ, యోగభూమిలో పుట్టడం ఒక యోగం. ఈ నేలపై నడవటం ఒక భాగ్యం! ఈ దేశంలో పుట్టాను కాబట్టే నాకింత గుర్తింపు, పేరువచ్చింది- అనుకొన్నవాడు మాత్రమే దేశభక్తుడవుతాడు. భారతమాత్ర చిత్రపటాన్ని, రెపరెపలాడే మన జాతీయ జండాను చూసినంతనే చ్శ్తీ ఉప్పొంగేవారు నిజమైన దేశభక్తులు. విదేశాలలో ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ నేలనే నమ్ముకొని, ఇక్కడే వుంటానని, ఈ దేశానికే సేవ చేస్తానని అనుకునేవారు స్వచ్చమైన  దేశభక్తులని రాయప్రోలు వారు ఎన్నడో చాటి చెప్పారు.
 
అమెరికాలో చాలామంది మీరెవరు? అంటే ‘‘అమెరికన్’’ అంటారు, అదీ దేశభక్తి! మన దేశంలో నేను తమిళుడ్ని- నేను కన్నడిగున్ని- నేను తెలుగువాడ్ని- నేను బెంగాలీ....’’ అంటాడు తప్ప భారతీయుడినని  అనరని ఒక విదేశీ బృందంవారి పరిశీలన! ఈ పద్ధతి మార్చాలన్న ధృఢ సంకల్పం అందరం చేసుకోవాలి.
అమ్మకి నమస్కారం పెట్టనివాడు, అమ్మని దేవతగా భావించనివాడు, ‘‘మనిషి’’గా చెప్పలేం. అమ్మలేనిదే నువ్వు నీ ఉనికే లేదని  అంటోంది వైద్యశాస్త్రం. అటువంటి దేశమాతకి ‘‘జై’’అనకపోవడం అంటే మాతృ ద్రోహమే అవుతుందన్నది చరిత్రకారుల ఉవాచ.
దేశభక్తి అనేది నిరంతర ప్రక్రియ. జీవనది లాంటిది. ఇంతకీ దేశభక్తి అంటే ఏమిటి ?
ఒక జాతియొక్క ఆత్మగౌరవానికి, ఔన్నత్యానికి అనుకూలంగా ఉండటం. భారత జాతి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం.
‘‘అంతా ఒక్కటే- మనమంతా ఒక్కటే
రేకులు వేరైనగాని- పూవు ఒక్కటే’’
అని చెప్పడం. తను పుట్టిన నేలను, సంప్రదాయాలను, చారిత్రకతను అభిమానించడం. తన మతాన్ని అనుసరిస్తూనే దేశభక్తిని కలిగి వుండటమే జాతీయత లేదా దేశభక్తి.
ప్రతీ ఒక్కరం జీవనది వంటి దేశభక్తిని కలిగి వుందాం.

కామెంట్‌లు