సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -5
అపరాహ్ణ ఛాయా న్యాయము
*****
అపరాహ్ణము అంటే మిట్ట మధ్యాహ్నము. ఛాయ అంటే నీడ.
పన్నెండు గంటలు దాటినప్పటి నుండి సూర్యుని యెండకు  నీడ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది.
అలా పెరిగే నీడను  మంచి స్నేహానికి ప్రతీకగా చెబుతారు.
చెడు స్నేహం ఉదయకాలపు నీడ వలె మొదట పొడవుగా పెద్దదిగా వుండి రాన్రాను  తగ్గి కురచగా అవుతుంది.అంటే అలాంటి వారిది అవకాశవాద స్నేహమన్నమాట.అవసరం తీరగానే   తగ్గిపోతుంది.
కానీ మంచివారితో స్నేహం అలా కాదు. మొదట మిట్ట మధ్యాహ్నం నీడలా చిన్నదిగా మొదలై క్రమక్రమంగా పెరుగుతూ,ప్రాణ స్నేహంగా మారుతుంది.
ఇలా చెడ్డ వారి,మంచి వారితో స్నేహానికి ప్రతీకగా ఈ అపరాహ్ణ ఛాయా న్యాయమును ఉదహరిస్తూ ఉంటారు.
అలాగే దీనిని  చేసే పనులకు కూడా అన్వయించుకోవచ్చు.కొందరు అట్టహాసంగా ప్రారంభించిన పనిని చివరి దాకా కొనసాగించకుండా మధ్యలోనే వదిలేస్తారు.
చూసేవారికి మొదట ఆశ్చర్యం ,ఆ తర్వాత అసంతృప్తి కలుగుతుంది.
మరి కొందరు నిదానంగా ఓ చిన్న మంచి పనితో మొదలు పెట్టి క్రమంగా  విస్తరింప చేస్తూ ఉంటారు. 
అది మధ్యాహ్నం నీడలా చిన్నదిగా మొదలై క్రమక్రమంగా పెరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించి ఆదరాభిమానాలు పొందుతుంది.కాబట్టి చేసే స్నేహమైనా, పనైనా మంచిదిగా అపరాహ్ణ ఛాయా న్యాయములా ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు