మేలు మరవరాదు;-- యామిజాల జగదీశ్
 ఇంటింటికి వెళ్ళి వస్తువులను పంపిణీ చేసే ఆ కుర్రాడికి ఆరోజు బాగా ఆకలేసింది. ఏదైనా తిందామనుకుంటే అతని దగ్గర డబ్బులు లేవు. 
దగ్గర్లో కనిపించిన ఇంట్లోకి వెళ్ళి ఆకలిగా ఉందని అడిగి ఏదైనా పెడితే తిందామనుకున్నాడు. తలుపు తట్టాడు. 
ఒక మహిళ తలుపు తెరిచింది. అతనికి అన్నం పెట్టమని అడగడానికి సిగ్గేసింది.
 "కాస్త నీళ్ళిస్తారా?" అని నెమ్మదైన స్వరంతో అడిగాడు.
ఆ కుర్రాడి కళ్ళల్లోని ఆకలిని కనిపెట్టిందా ఇంటి ఇల్లాలు.
లోపలకు వెళ్ళి ఓ కప్ పాలు తీసుకొచ్చి ఇచ్చిందామె.
ఆ పాలు తాగిన కుర్రాడు "నేనెంత రుణపడ్డాను?" అని అడిగాడు.
"ఆప్పా? అలాంటిదేమీ లేదు.ప్రియమైన మనస్సుతో చేసే పనికి ఖరీదు కట్టలేం అని మా అమ్మ అంటుండేది" అని ఆమె చెప్పి ఓ చిన్న నవ్వు నవ్వింది.
"చాలా చాలా కృతజ్ఞతలమ్మా" అని ఆ కుర్రాడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు.
ఏళ్ళు గడిచాయి. ఆ కుర్రాడు నగరంలో పెద్ద డాక్టరయ్యాడు. ఆమె అనారోగ్యంపాలైంది. ఆమె అనుకోకుండా అతను పని చేస్తున్న ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది. 
ఆమెను పరీక్షించాడతను. మెడికల్ రిపోర్టులో ఆమె పేరు ఊరి పేరు చదివిన అతనిలో ఓ మెరుపు మెరిసింది. వెంటనే వార్డులో ఉన్న ఆమెను చూశాడు. ఆమె మరెవరో కాదు. నీరడిగితే తనకు పాలు ఇచ్చి ఆకలి తీర్చిన ఆమె. తాను పరీక్షిస్తున్నప్పుడు అంతగా గుర్తు పట్టలేకపోయాడు. కానీ ఊరు పేరు చదవడంతోనే దగ్గరకెళ్ళి చూసి గుర్తించాడు. 
ఆ క్షణం నుంచి ఆమెకు మెరుగైన చికిత్స అందించాడు. క్రమంగా ఆమె ఆరోగ్యం కోలుకుంది. ఆమెకు చేసిన చికిత్సకు చాలానే ఖర్చయింది. ఆస్పత్రివారు ఆమెకు ఓ పెద్ద బిల్లు ఇచ్చారు. అందులోని మొత్తాన్ని చూసి ఎలా కట్టాలా అని ఆలోచనలో పడింది. ఆ బిల్లు చివర్లో ఇలా రాసి ఉంది "ఓ గ్లాసెడు పాలతో మీ బాకీ అంతా తీరిపోయింది. ఇది నేను కృతజ్ఞతలు చెప్పుకునే వేళ. రుణం తీర్చుకునే అవకాశం కలిగింది" అని. 
ఆ మాటలు చదవడంతోనే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.

కామెంట్‌లు