రాతిరి ఎంత భారమైనా
తూరుపు ఎర్రబడక ఆగదు
క్షణమొక యుగంగా
గడచినా తెల్లవారక తప్పదు
వేదనలెంత వేధించినా
వేకువ కాక తప్పదు
తిమిరంతో ఎన్ని సమరాలు
చేసినా వెలుగు రాక తప్పదు
అలజడిరేపిన ఆందోళనలకు
అంతం చెప్పక తప్పదు
సహనం ఇచ్చే తీయని
ప్రతిఫలం అందక తప్పదు
అంతరంగపు ఆశల ఆరాటానికి
పోరాటంలో విజయం తప్పదు
గతులు శూన్యమైనా జీవనపథంలో
ముందుకు నడవక తప్పదు
తపించి తల్లడిల్లిన మనసుకు
ఆనందపు తడి తగలక తప్పదు
గమనంలో గమ్యం శూన్యమైనా
పయనంలో ముందడుగు తప్పదు
రేపటికై ఊపిరి బిగబెట్టి
తూరుపు చూడక తప్పదు
ప్రతి ప్రభాతమూ అందరికీ
రసవంతం కావాలని
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి