లక్ష్యం; - సి.హెచ్.ప్రతాప్
 అవంతి రాజ్యం లో రామాపురం అనే గ్రామం వుంది. ఆ గ్రామం చుట్టూ దట్టమైన అడవులు వున్నాయి. పట్నం వెళ్లాలంటే ఆ అడవులు దాటి వెళ్ళడం తప్పనిసరి. అంతేకాకుండా అప్పుడప్పుడు అడవిలోని క్రూర మృగాలు ఆ గ్రామం పై దాడి చేస్తుండేవి. కాబట్టి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి క్రూర మృగాలు దాడి చేసే సమయంలో తమల్ని రక్షించుకునేందుకు చెట్లు ఎక్కే విద్య నేర్చుకోవడం తప్పనిసరి అయ్యింది. ఆ గ్రామంలో వీరయ్య అనే ఒక వృద్ధుడు అందరికీ చెట్లు  ఎక్కడం నేర్పిస్తుండేవాడు.
ఎప్పట్లాగే ఇరవై మంది యువకులు వున్న ఒక బృందానికి వీరయ్య చెట్లు ఎక్కడం నేర్పిస్తున్నాడు. ఆ రోజే వారి శిక్షణకు ఆఖరు రోజు. వారికి చెట్లు ఎక్కడం ఎంతవరకు వచ్చిందనే అంశం పై పరీక్ష నిర్వహించేందుకు గ్రామం శివారు ప్రాంతాలకు వీరయ్య వారిని తీసుకు వెళ్ళాడు. అక్కడ వున్న అన్నింటికంటే పొడవైన చెట్టు చూపించి ఒక్కొక్కరినే దాని పైకి ఎక్కి చివరి కొమ్మ వరకు చేరుకొని తిరిగి కిందకు దిగ మన్నాడు.
మొదటి యువకుడు సునాయసంగా , అతి లాఘవంగా చెట్టు చివరి వరకు ఎక్కి తిరిగి కిందకు దిగసాగాడు.
మధ్య మార్గంలో వీరయ్య అతడిని చూసి" నెమ్మదిగా దిగు. ఏం తొందర లేదు. కిందకు చూసుకుంటూ ఒక్కొక్క అడుగుతోనే కిందకు దిగు" అని  బిగ్గరగా అరుస్తూ సూచనలు ఇచ్చాడు.
అప్పటి వరకు గబ గబ దిగుతున్న ఆ యువకుడు వీరయ్య సూచనలను అనుసరించి నెమ్మదిగా దిగాడు.
 
తర్వాత వీరయ్య కాళ్ళకు నమస్కరించి" అయ్యా, నాకొక విషయం అర్ధం కాలేదు.అసలు చెట్టు ఎక్కడమే చాలా కష్టం, దిగడం చాలా సులువు. అదీ కాక మేము పై కొమ్మకు చేరుకునే పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎంతో సున్నితంగా వుండే కొమ్మ విరిగితే మా ప్రాణాలకే పెను ప్రమాదం. అక్కడ ఇవ్వని సూచనలు సగం దిగాక ఎందుకు ఇచ్చారు ? దిగడంలో ప్రత్యేకంగా పాటించాల్సిన సూచనలు ఏం వున్నాయి" అని అడిగాడు. మిగతా బృందం సభ్యులందరినీ అదే సందేహం పట్టి పీడిస్తోంది కాబట్టి వీరయ్య ఏం చెబుతాడా అని ఆతృతగా ఎదురుచూడసాగారు.
అందుకు వీరయ్య చిరునవ్వు నవ్వి" మంచి ప్రశ్నే అడిగావు.ఇందులో ఎంతో వ్యక్తిత్వ వికాసం దాగి వుంది.
చెట్టు యొక్క పై భాగాన్ని అధిరోహించడం నిజంగా చాలా కష్టం మరియు ప్రాణాంతకం. అందుకే మీరు నా సూచన లేకుండా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. సాధారణంగా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అందరూ జాగ్రత్తగా వుంటారు.అయితే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే ఆఖరు మజిలీలో జాగరూకత మరియు జాగ్రత్తలు లోపిస్తాయి. పని త్వరగా పూర్తి చేసేద్దామన్న తొందరలో ఎన్నో తప్పులు చేస్తాం. పని అయిపోయిందన్న భావనలో మన దృష్టి, ఏకాగ్రతలు లోపించి అక్కడే ఎన్నో తప్పులు చేస్తాం. ఫలితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోవచ్చు. ఈ ఘటనలో 90 శాతం ప్రమాదాలు చెట్టు దిగేటప్పుడు ఆఖరి సగ భాగం లోనే జరిగాయన్నది నా స్వానుభవం.అందుకే జాగ్రత్తగా వుందమని మిమ్మల్ని హెచ్చరించవలిసి వచ్చింది. పని 99 శాతం పూర్తవడానికి, 100 శాతం పూర్తవడానికి మధ్య ఎంతో వ్యత్యాసం వుంది." అని వివరణ ఇచ్చాడు వీరయ్య. జీవితంలో పనికొచ్చే అతి విలువైన సూచనలు ఇచ్చిన వీరయ్యకు ఆ బృందం మొత్తం కృతజ్ఞతలు చెప్పుకుంది.


కామెంట్‌లు