మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు.
భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే "భక్తవశంకర" అన్నారు.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. వెంటనే శివ గణాలు వచ్చి అతడిని శివుని ఆజ్ఞ మేరకు కైలాసానికి తీసుకువళతారు. అక్కడ పరమేశ్వరుడు గుణనిధికి శాశ్వత సివ సాయుజ్యం ప్రసాదిస్యాడు.
శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |
తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||
శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాస ముండి, ఇంద్రియ నిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించిన వారికి, సంవత్సర మంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క “శివరాత్రి” అర్చన వలన లభిస్తుందని” “శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందు రోజున,అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి.
మరునాడు “మాఘబహుళ చతుర్దశి” శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతః కాలాన్నే లేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి.
రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పని సరిగా చేయాలి.
తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి. ఇది శివరాత్రి పర్వదినాన్న మహాశివుని అర్చించే విధానం .
మహా శివరాత్రి మహత్యం;- : సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి