*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0247)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
దేవతలు శివుని స్తుతి చేయడం - శివుడూ త్రిపుర దగ్ధానికి సిద్ధం కాకపోవడం - దేవతలు విష్ణువు ద్వారా శివ మంత్ర ఉపదేశము - శివుని కొరకు, విశ్వకర్మ సర్వదేవమయ రథమును నిర్మించడం......
*నారదా! దేవతలు అందరూ, దేవదేవుడు అయిన, శంభుని స్థుతి చేసాక, ఎంతో దీనంగా పరమేశ్వర అనుగ్రహం కోసం అంజలి ఘటిస్తూ నిలబడి ఉన్నారు. అప్పుడు, విష్ణు దేవుడు, ఈశాన సంబంధ మంత్రము జపించారు. ఈ ప్రార్ధనులు విన్న, దుఃఖాలను దూరం చేసే శంకరుడు ప్రసన్నుడై, వారి ఎదుట అంబా సహితంగా ప్రత్యక్షమయ్యారు. ఆ స్వామి వృషభారూఢుడై ఉన్నారు. వామ భాగంలో ప్రసన్నమైన చిరునవ్వులు చిందిస్తూ, ఉమ కూడా ఉన్నారు. తన వాహనము నుండి దిగిన ఈశానుడు, అనురాగంతో విష్ణుమూర్తి ని ఆలింగనం చేసుకుని, వృషభం మీద చేయి ఆన్చి ఠీవిగా నిలుచున్నారు. దేవతలను, శ్రీహరిని కరుణ కురుస్తున్న తన చూపులతో చూస్తూ, ఇలా చెప్పారు.*
*"విష్ణు దేవా, సకల దేవతలారా! త్రిపురాసురులు, మనసులో ఎప్పుడూ నా గురించిన ఆలోచన చేస్తూ, నాభజన చేస్తూ, ఎల్లప్పుడూ నా భక్తులుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు వారు విష్ణు మాయలో పడి నా భక్తి ని మరచి, ధర్మ మార్గాన్ని వదలి జీవనం చేస్తున్నారు. ఇది మంచిది కాదు నిజమే. వారు వధింప తగిన వారే. వారిని నేను యుద్ధంలో జయించి వధిస్తాను. కానీ, దేవతలైన మీరు అందరూ, యుద్ద శాస్త్రం లో ఆరి తేరిన వారు, అరివీర భయంకరులు, కూడా. మరి మీలో ఎవరైనా ఆ త్రిపురాసురులను సంహరింపవచ్చు కదా! అలా ఎందుకు చేయలేదు. " అని శంభుడు పలికిని మాటలు విన్న దేవతలు, విష్ణుమూర్తి కూడా దీనతతో, భయంతో కూడుకున్న ముఖాలతో, దీనంగా నిలబడ్డారు. అలా నిలబడిన దేవతలను చూచి, బ్రహ్మ నైన నేను, పరమేశ్వరుని తో ఇలా చెప్పాను.*
*"లోకబాంధవా! ఆదిభిక్షూ! నీవే మాకు దిక్కు. నీవే పరబ్రహ్మ, పరమేశ్వర, పరాత్పరునివి కదా! ముందునుండీ దేవతలను అనేక మార్లు మీరే రక్షించారు. మీరు, దేవతలను, మునులను, ఋషులను కాపాడే ప్రతిన తీసుకుని ఉన్నారు. కాబట్టి, త్రిపురాసురులను చంపిన పాపము, మీకు తగులదు. తారకాసురుని కుమారులు, మాయా మోహితులు అవడం కూడా, మీరు చెప్పబట్టే జరిగింది. వారు ధర్మభ్రష్టులై ఉన్నారు. మీరు రాజులు. రాజు, ధర్మం తప్పిన వారిని దండించితే, తన ప్రజలకు మేలు చేసిన వాడు అవుతాడు. అందువలన, మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దేవగణరక్షణ కోసం బయలుదేరండి. దేవ దేవా! మేము అందరమూ, విష్ణు దేవునితో సహా, మీ బంటులము. మీ ఆజ్ఞ ప్రకారం పని చేస్తూ ఉంటాము. త్రిపుర సంహారానికి ఉద్యమించండి, మహానుభావా!"*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు