నవ్య దివ్య ఉగాది;- గుండాల నరేంద్ర బాబు;-చర వాణి:9493235992
నవతకు నాంది
మమతకు పునాది
సమతకు సన్నిధి
మానవతకు పెన్నిధి
మార్పుకు వారధి
కూర్పుకు సారధి
అదే అదే ఉగాది
ఇదే ఇదే యుగాది

సహనానికి కాలం పెట్టిన  పరీక్షిది
కార్యదీక్షకు దక్కిన అద్భుత ఫలితమిది
శిశిర నిరీక్షణకు జరుగు సీమంతమిది 
ఓర్పు ఔన్నత్యమిది
మౌనానికి  మహోన్నత మన్ననిది
మౌన ముని మహా సత్కారమిది
ప్రకృతి సరికొత్తగ కూర్చిన చిత్రమిది 
కాలచక్రoవిచిత్రంగా గీసిన వైవిధ్య భరిత దృశ్యమిది
సృష్టి నవాకృతి దాల్చిన నవ్య భవ్య దృష్టి కోణమిది

తెలుగు భాష సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనమిది
తెనుగు శ్వాస వెలుగులీను తెలుగు సంవత్సరాదిది
తెలుగు లోగిళ్ళలో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులతో...
వెలుగు వాకిళ్లలో   కళకళ లాడే మామిడి తోరణాలతో...
పట్టు పరికిణీలతో
పుత్తడి బొమ్మలా ముస్తాబైన తెలుగింటి ముద్దుగుమ్మలతో...
బంధు మిత్ర గణాల పలకరింతల పారిజాతాలకు
శుభాకాంక్షల సుప్రభాతాలకు
పులకిస్తూ...

అవమానాల్ని,అవహేళ నల్ని నిరంతరం  నిరసిస్తూ...
నిరాశ నిస్పృహల్ని ప్రతి నిత్యం నిట్టూరుస్తూ...
ఆశల్ని ఆదర్శాల్ని అనునిత్యం ఆఘ్రాణిస్తూ... 
కష్టాల్ని సుఖాల్ని సమభావనతో...
ఆస్వాదిస్తూ...
ముందుకు సాగేదే జీవితమని 
 ప్రబోధించేదే ఉగాది పచ్చడి ఆంతర్యం

భవిష్యత్తుకు  బంగరు బాటలు వేస్తూ...
మంచి చెడులు విశదీకరిస్తూ... దిక్సూచిలా...    


ముందుకు నిను నడిపించేదే పంచాంగ శ్రవణం

మంగళ వాయిద్యాలతో...
నాదస్వర విన్యాసాలతో...సప్త స్వరాలు పలికిస్తూ...
హృదయ వీణా తంత్రుల్ని  హృద్యంగా మీటుతూ...
జయ జయ ధ్వానాలు చేస్తూ...
విజయోస్తు దిగ్విజయోస్తు అంటూ ఆశీర్వదించడమే శుభ సూచకం

జనచైతన్యాన్ని రగిలిస్తూ...
సభ్య సమాజాన్ని నిత్యం వెలిగిస్తూ..
. కమ్మగ సాగే కవికోకిలల కవితా గానాలతో ...
. కొమ్మలదాగిన కోకిలలు రా రమ్మని
 ఇమ్ముగ  స్వాగత గీతికలు ఆలపించగా... 
పచ్చని పట్టు చీర చుట్టుకుని
నుదుటను ఎర్రని సూర్యుని దిద్దుకుని
ఆనందంగా అరుదెంచె 
అందాల ఆమని
సుగంధాల భామిని
సౌందర్యాల చైత్రలక్ష్మి
మాధుర్యాల మహాలక్ష్మి
 మధుమాసపు మాలక్ష్మి
శోభ కృతు నామ  చైతన్యలక్ష్మియై 
శుభమంటూ...మనల దీవించ! 


కామెంట్‌లు