సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలతో 💐
++++++++++++++++++++++++++++++++
న్యాయాలు -80
తాల సర్ప న్యాయము
******
తాలము అంటే తాడి చెట్టు. సర్పము అంటే పాము.
తాడి చెట్టు పైకి పాకే పామును ఇతరులు చంపవలసిన అవసరం లేకుండానే ఒళ్ళంతా చీరుకుని పోయి తనంత తానే చనిపోతుంది. 
 దీనినే మనుషులకు వర్తింప చేసి చూద్దాం.కొందరు ఇతరులకు హానీ చేయాలని చేసే ప్రయత్నంలో తమకే హాని చేసుకుంటారు.అంటే స్వయంకృతాపరాధం అన్న మాట. దీనినే తెలుగులో  తాము తీసిన గోతిలో తామే పడటం ' అంటాం.
ఓ కాకి ఎక్కడ గూడు కట్టుకుని గుడ్లను పెట్టినా ఆ పరిసరాల్లో ఉన్న ఓ పాము కాకి మేతకు వెళ్ళగానే పాక్కుంటూ వెళ్ళి గుడ్లను తినేస్తూ ఉంది.
పాము నుంచి తన గుడ్లను కాపాడుకునేందుకు అది తాడిచెట్టు కొమ్మల మధ్య గూడు కట్టుకుని అక్కడ గుడ్లను పెడుతుంది.
అది చూసిన పాము  ఆ గుడ్లను తినడం కోసం  తాటి చెట్టుపై పాకుతూ వెళుతోంది. తాటి చెట్టు కాండం కొంచెం గరకు గరకుగా  ఉంటుంది. పాము మెత్తని శరీరమంతా ఆ గరకుకు గీరుకు పోయి అది కాకి గూటికి చేరకుండానే  చనిపోయింది.
అంటే ఇతరులకు హానీ చేయాలని చూస్తే తనకే హానీ కలుగుతుంది అనే అర్థంతో ఈ  తాల సర్ప న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ న్యాయమునకు దగ్గరగా  మహాభారతంలో కౌరవుల పతనం స్వయంకృతాపరాధం వల్లే   జరిగిందని భారతం చదివిన విన్న ప్రతి వారికీ అర్థం అవుతుంది.
వాళ్ళు ఎప్పుడూ పాండవులను తమకు ఆగర్భ శత్రువులుగా భావించి నిరంతరం వాళ్ళను పతనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. బాల్యంలోనే ఎప్పుడైతే పాండవులు అందరి అభిమానాన్ని చూరగొనడం మొదలైందో అప్పటి నుండి వారిపై కక్ష పెంచుకున్నారు.అప్పటి నుండి శకుని సాయంతో రకరకాల కుయుక్తులు పన్నారు.
మోసంతో కూడిన జూదం, వనవాసం, అజ్ఞాత వాసం, కురుక్షేత్ర సంగ్రామం.. ఇవన్నీ నిరంతరం పాండవుల పతనానికి ప్రయత్నించి చివరికి నామ రూపాలు లేకుండా పోయారు.
ఇలా అన్యాయంగా అపకారం తలపెట్టే వారు ఏనాటికైనా తాము తీసుకున్న గోతిలో తాము పడి దారుణమైన శిక్షకు గురి కాక తప్పదు.
కాబట్టి తాల సర్ప న్యాయమును గమనంలో పెట్టుకుని అపకారికైనా ఉపకారం చేయాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు