సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -72
జలతుంబికా న్యాయము
*****
జలము అంటే నీరు.తుంబికముఅంటే గుజ్జు తీసి ఎండబెట్టిన సొరకాయ బుర్ర.దీనికి ఒక తంత్రి జోడించి తంబురగా,వాయిద్యాలలో ఒకటిగా ఉపయోగించడం చూస్తుంటాం. 
 ఆ ఖాళీగా ఉన్న సొరకాయ బుర్రను మట్టితో నింపి నీళ్ళలో వదిలితే మునిగి పోతుంది. అందులోని మట్టి అంతా నీటిలో కరిగిపోయిన తరవాత ఆ సొరకాయ బుర్ర పైకి తేలుతుంది.
దీనిని మనిషికి వర్తింప జేసి చెప్పడం విశేషం. ప్రాణం ఉన్నప్పుడు నీళ్ళలో పడితే ఈత రాక  మునిగి మనిషి పోతాడు.అదే మనిషి  మరణించిన తరువాత పైకి తేలుతాడు. 
ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే ఈ జల తుంబికా న్యాయము మార్మికతతో చెప్పిన సత్యం.
ఏ వ్యక్తి అయినా దేహ సంబంధం ఉన్నంత వరకు అంటే దేహంలో ప్రాణం ఉన్నంత కాలం  అనేకానేక  ఐహిక సమస్యల్లో మునిగి పోతాడనీ.దేహ బంధం నశించిన అంటే  ప్రాణం అనంత వాయువుల్లో కలిసిన తర్వాత ఇంకా ఆరాట పోరాటాలు ఏమీ ఉండవని, భవ బంధాలు తెంచుకుని ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా సొరకాయ బుర్రలా  పైకి తేలిపోతాడనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ ప్రపంచంలో జీవించే వ్యక్తుల మనసుల్లో అరిషడ్వర్గాలు, వ్యామోహాలు, తాపత్రయాలు అనేవి   నిండిపోయి  అనేక రకాల ప్రవర్తనలు గల వ్యక్తులుగా రూపొందడానికి దోహదమవుతున్నాయి.
ఈ విధంగా మనుషులు మాయా మోహాల్లో చిక్కుకుని పోతున్నారు.కానీ జీవితంలో ఏది శాశ్వతం,ఏది అశాశ్వతమో  గ్రహించడం లేదు.అది గ్రహించేలా  సహజ కవి పోతన భాగవతంలో బలి చక్రవర్తి నోట పలికించిన ఈ పద్యాన్ని చూద్దాం.
 కారే రాజులురాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిన్ బొందరే?వా/రేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై/ ఈరే కోర్కెలు? వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా!'
'  ఎందరో రాజులయ్యారు.వాళ్ళకు రాజ్యాలు కలిగాయి.అందువల్ల వారికి గర్వం పెరిగింది కానీ ఏరీ వారు? ఆ తర్వాత ఏం జరిగింది.వారెవరూ  సంపదలో సూది మొనంత   కూడా మోసుకు పోలేదు కదా! కనీసానికి వాళ్ళ పేర్లు భూమ్మీద నిలిచాయా? లేదు కదా! మరి శిబి చక్రవర్తి లాంటి  దాతలు  ఎంతో ఇష్టంగా కీర్తి కోసం కోర్కెలు తీర్చారు. అలా చేయడం వల్ల వారి పేర్లు నేటికీ నిలిచాయి.వారిని మరిచి పోకుండా నేటికీ తలుచుకుంటున్నాం  కదా! అని భావం.
కాబట్టి వ్యక్తులుగా స్వార్థంతో  బతికినా, నిస్వార్థంగా సమాజ హితైషిగా జీవించినా  ఈ దేహం ఉన్నంత వరకే. అందరి ప్రాణాలు పంచభూతాల్లో కలవాల్సిందే అన్న సత్యాన్ని  గ్రహించాలి.
మరణించాక సొరకాయ బుర్రలా తేలిపోయి నీటి ప్రవాహంలో ఎటో కొట్టుకుపోయినా మన ఆనవాళ్లతో, మనదైన ఔన్నత్యంతో ఈ భూమ్మీద శాశ్వతంగా ఉండాలంటే మంచి పనులు చేయాలి.మానవీయులుగా ప్రవర్తించాలి.
ఈ  జల తుంబికా న్యాయము యొక్క పరమార్థం, అంతరార్థం ఇదే.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు