యాచకులు కానిది ఎవరు?;- డాబెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.
 అవంతి రాజ్యంలో రాజు తనమంత్రి తో కలసి రాజథాని లో మారువేషాలలో రాత్రి వేళలో బయలుదేరి నగరం నాలుగు దారులకూడలిలోని ఆలయమంటపంలో విశ్రాంతికొరకు తనమంత్రితో కూర్చున్నాడు.
అదేమంటపంలో ఒమూలన వున్న  వృధ్ధుడు "అయ్య తమరు బాటసారుల్లా ఉన్నారు.ఎప్పుడు భోజనం చేసారో! ఇవిగో ఈపండ్లు చెరిరెండుతిని ఆమూల కుండలో మంచినీళ్ళు ఉన్నాయి మటపం శుభ్రపరచి ఉంచాను ఆమూల చాపలు ఉన్నాయి విశ్రాంతి తీసుకొండి".అన్నడు ఆవృధ్ధుడు.
"తాతా ఉన్నపండ్లను ఇతరులకు దానం ఇస్తే మరి రేపటికి నీకు ఆహారంఏది?"అన్నాడు బాటసారి వేషంలోని రాజుగారు.
"అయ్య రేపటిగురించి నాకు దిగులులేదు.పగలంతా యాచనచేస్తూ వచ్చిన  ధనంతోపండ్లుకొని  నాసాటి వారికి ఆకలితీర్చే ప్రయత్నం గా ఇలా పండ్లు పంచుతుంటాను. ఆలయంలో లభించే ప్రసాదమే నాఆహరం,అయినా నాఅనేవారు లేనివాడిని నాకు దాచుకోవలసిన అవసరంలేదు.జీవితకాలం ఉన్నంతవరకు ప్రతి ప్రాణీ జీవించవలసిందే ,పేదరికానికి,సమస్యలకు,క్షణికావేశాలకు ప్రాణాలు తీసుకునే వారు క్షణకాలం ఆలోచిస్తే ఆప్రయత్నమే చేయరు" .అన్నాడు వృధ్ధుడు.
"వందసంవత్సరాలు జీవించలేని మనిషి వేయి సంవత్సరాలకు సంపాదించి దాచుకునేవాళ్ళను చూసాను.యాచనలోవచ్చిన ధనాన్ని దానంచేసే యాచకుడిని నిన్నే చూస్తున్నా"అన్నాడు బాటసారివేషంలోని రాజుగారు.
"అయ్యా యాచకులు కానిది ఎవరు?  సదాశివుడే అన్నపూర్ణాదేవిని యాచించలేదా!సాక్షాత్తు విష్ణుమూర్తే వామనా వతారంలో బలి చక్రవర్తి మూడుఅడుగుల నేల యాచించలేదా?తనను నమ్మి తనతో వచ్చిన వారందరికి ఆహారంపెట్టడానికిధర్మరాజు సూర్యభగవానుని'అక్షయపాత్ర' యాచించలేదా? శ్రీకృష్ణపరమాత్ముడు అతటివాడే కర్ణుని కవచకుండలాలు యాచించలేదా? ఇంతఎందుకు మనదేశాన్ని పాలించే మహరాజుగారు కూడా యాచకుడేకదా!"అన్నాడు వృధ్ధుడు.
వృధ్ధుని మాటలకు ఆశ్చర్యపోయిన బాటసారి వేషంలోని రాజు" ఏమిటి మనదేశరాజు గారుకూడా యాచకులా ఎలా? వివంగాచెప్పు"అన్నాడు.
"అయ్య ప్రతిదినం దేమునిముందు తన రాజ్యప్రజలు అందరూ బాగా ఉండాలని,తనదేశం పాడి,పంటలతో సుభిక్షంగా ఉండాలని యాచన చేయడంలేదా.ఇలోకంలో తనకొరకో,తనవారికొరకో,దేవునియాచించని మనిషి ఉండడుకదా! దేవునిపై నమ్మకంలేనివాళ్ళుకూడా తమ అవసరాలకు ఎదటివారి దగ్గర యాచన చేసేవాళ్ళే,అది యాచన అనిచెప్పుకోకుండా అందమైనపేరు'కోరికలు' అనిచెప్పుకుంటారు. అనాదరులు (అనాధలు), నిరాదరణకు గురైన వృధ్ధులు, అన్నార్తులు, వ్యాధిగ్రస్తులు,అంగవైకల్యం కలిగినవారు యాచనఆధారంగానే జీవిస్తారు.ప్రతిమనిషి తను, తన కుటుంబం తోపాటు ఎదటి వారికి (ప్రాణులకు) ఆకలి ఉంటుందని మూడు పూటల మనంతింటూ,ఎదటివారికి ఒపూట తిండికైనా సహయపడిన జీవితమే సార్ధక జీవితం.ఆలోచించండి చచ్చేదాక అక్రమంగా మితిమీరిన సంపదన చేర్చిపెట్టి రేపటితరం తనవారిని సోమరులుగా చేయడం న్యాయమా? ప్రతిమనిషి నీతిమార్గాన సంపాదించి తనసంతతికి ధనంఇవ్వకుండా జ్ఞానం,విద్యా బుద్దులు నేర్పిస్తే మన లోకంతీరేమారిపోదా?"అన్నాడు వృధ్ధుడు.
"నిజమే భీతేభ్యశ్చా అభయం దేయం -వ్యాధితేభ్యస్థ దౌషధం
దేయా విద్యార్థినే విద్యా -దేయమన్నం క్షుధాతురే "
మరణభయంతో ఉన్నవారికి అభయం ఇవ్వడం,వ్యాధిగ్రస్తునికి చికిత్స చేయించడం,విద్యను ఆర్జించేవారికి విద్యాదానం చేయడం,ఆకలిగా ఉన్నవారికి అన్నదానం చేయడం మొదలగు చతుర్విధ దానాలు గొప్పవని పెద్దలు చెప్పారు. మనిషి తన సాటి ప్రాణులను నిస్వార్ధంగా ఆదుకున్ననాడు నిజంగా లోక కల్యాణమే"అన్నాడు బాటసారివేషంలోని రాజుగారు.


కామెంట్‌లు