శ్రీ కృష్ణ ప్రేమతత్వం;-: సి.హెచ్.ప్రతాప్

 శ్రీ కృష్ణుడు జగద్గురువు. ఆయన వాక్కు నుండి స్రవించిన భగవద్గీత లోకానికి , సమస్త మానవాళికి బహు చక్కని శ్రేయో మార్గాన్ని చూపిస్తోంది.  కృష్ణ తత్వమే అర్ధం చేసుకోవడం కొద్దిగా కష్టం..అర్ధం అయితే..ఆ తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకోగలిగితే..జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అంతేకాదు.. జీవితంలో కష్ట సుఖాలు .. రెండిటినీ ఒకేలా చూడగలిగే స్థిత ప్రజ్ఞత వస్తుంది. మానవులు మహనీయులుగా మారుతారు. లోతైన కృష్ణ తత్త్వం అందరికీ ఒకపట్టాన అర్ధం కాదు. మహామహులకే దానిని పూర్తిగా అర్ధం చేసుకోవడం చేతకాలేదు అనేది వాస్తవం. కానీ, మన జీవితంలో మనకు అర్ధం అయిన రెండు మూడు శ్రీకృష్ణ బోధనల సారాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని ఆచరిస్తే చాలు చాలా సమస్యలను యిట్టె పరిష్కరించుకుని..విజయాల రాదారిలో ప్రయాణం చేయవచ్చు.ఇందులో ముఖ్యమైనది ప్రేమ తత్వం. నిస్వార్ధ ప్రేమ ప్రతి క్షణం ఆనందాన్ని నింపుతుంది. జంతువులు, పక్షులతో సహా మొత్తం పర్యావరణాన్ని ఆనందంగా చేస్తుంది.” దీని అర్ధం మన చుట్టూ ఉన్న ప్రతి దానినీ మనం బేషరత్తుగా ప్రేమించాలి. దానికి ప్రతిఫలం ఆశించకూడదు.అయితే, మనం ఇచ్చిన ప్రేమకు మనకు దొరికే ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. అది వ్యక్తుల పై ప్రేమ నుంచి లభించింది కావచ్చు.. ప్రకృతిని ప్రేమించడం వలన దక్కే దివ్యమైన అనుభూతి కావచ్చు. అది అలౌకికం, అనిర్వచనీయం. ఇది కాక వినయం.. నిజాయతీ.. శ్రమ.. ధర్మాన్ని అనుసరించడం.. దుర్మార్గాన్ని దూరంగా పెట్టడం.. ఇవే శ్రీకృష్ణుడు చెప్పిన విజయానికి ఐదు మంత్రాలు. వీటిని అనుసరించడం ద్వారా జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం

కామెంట్‌లు