సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-85
తులా యష్టి న్యాయము
*****
తులా  అంటే త్రాసు,తరాజు, పోలిక, సామ్యము అనే అర్థాలు ఉన్నాయి.యష్టి అంటే కర్ర,ఊత కర్ర, స్తంభము, దండము అనే అర్థాలు ఉన్నాయి.'తులా యష్టి' అంటే త్రాసుకు ఉన్న కర్ర లేదా దండము.
 
త్రాసు యొక్క దండము బరువు యొక్క తేడాలను బట్టి క్రిందు మీదు అగునట్లే అల్పుడు తనకు సంభవించెడు,బాధ నష్టములను బట్టి సుఖ దుఃఖాలను అనుభవించడాన్ని తులా యష్టి న్యాయము అంటారు.
 త్రాసులో ఏదైనా చిన్న వస్తువు వేసినా మరొక వైపు పైకి పోతుంది. తూకం సరిగా వేయనంత వరకు అది అటూ ఇటూ ఊగిసలాడుతూనే ఉంటుంది. అంటే బరువు యొక్క తేడాలను బట్టి క్రిందు మీదు అవడం సహజం.
మనసును త్రాసుగా భావిస్తే సంభవించే రకరకాల అనుభవాలు మన దైనందిన జీవితాన్ని క్రిందు మీదు చేస్తూ ఉంటాయి.
అవి సహజమే అని భావించే వారు వాటిని ఒకే విధంగా స్వీకరిస్తారు.కానీ చిన్న దానికే కృంగి,పొంగి పోయేవారు ప్రశాంతంగా ఉండలేరు.అలా భావించే వారు  అల్పులు అంటారు.అల్పం అంటే కొంచెం, తక్కువ.అల్పుడు అంటే కొంచెం ,తక్కువ ఆలోచనలు చేసేవాడు.
తక్కువ అంటే ఇతడిలో  తన వరకే ఆలోచించే గుణం ఉంటుంది.ఏదైనా తనకు మంచి జరిగితే చాలు అనుకునే వాడు.మొత్తంగా విశాల హృదయం లేని వాడు అని చెప్పవచ్చు.
దీనికి నారాయణ పండితుడు  రచించిన హితోపదేశం గ్రంథంలోని శ్లోకాన్ని చూద్దాం."అయం నిజః పరో వేతి గణనా లఘు చేతసాం/ ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం!" 
అంటే వీడు నా వాడు వాడు పరాయి వాడు... అని అనుకునే వాడు లఘు  చేతనుడు అంటే అల్పుడు.స్వపర భేదం లేకుండా సమస్త లోకం తనదిగా భావించి ధర్మ బుద్ధితో నడిచే వాడు ఉదారుడు.
కవి గంగుల శాయిరెడ్డి గారు రాసిన 'కాపు బిడ్డ' పద్య  కావ్యంలో ఇలా అంటారు.
'కష్ట సుఖముల నొక రీతి గడుపు వారు/ శత్రు మిత్రుల సమముగా సైచు వారు/ సైరికులుదప్ప నంతటి శాంతులెవరు? కాన చేమోడ్చి వారి నే గౌరవింతు".... అంటే రైతుకు తన వ్యవసాయంలో ఎన్నో రకాల ఒడుదుడుకులు వస్తూ  ఉన్నా వాటన్నింటినీ సమముగా శాంతమైన మనసుతో భరిస్తూ ఉంటాడని అర్థం.
తులా యష్టి న్యాయము వలె కృంగి పోవడం, పొంగి పోవడం కాకుండా ,తన వరకే పరిమితంగా ఆలోచించకుండా ఉదారుడుగా ఆలోచిస్తూ అన్నింటినీ సమముగా స్వీకరించాలనే సత్యాన్ని గ్రహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు