బంజారా కుంభమేళాకు తండోపతండాలుగా సేవాలాల్ భక్తులు-- రాథోడ్ శ్రావణ్ రచయిత, ఉపన్యాసకులు, సోనాపూర్ నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా
  సేవాలాల్ దీక్షలు చేపట్టిన బంజారా భక్తులు దీక్షభూమి కొత్తపల్లి నుండి  మహా కుంభమేళ పౌరాదేవికి దాదాపు రెండు వందల పైచిలుకు కిలోమీటర్లు కాలినడకన బయలు దేరారు. జగజ్జనని పిలువబడే అమ్మ  జగదాంబదేవి  ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క దర్శనం కోసం భక్తులు మహా పాదయాత్ర ప్రారంభించారు. 22 మార్చి 2023 న బయలు దేరి 30మార్చి2023న  అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన బంజారాల కాశీ పౌరాగడ్ కు చేరుకుంటారు. శ్రీరామనవమి రోజున మహా పూజ భోగ్ భండారో కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంజారా కుంభమేళాగా‌ అభివర్ణించే పౌరాదేవి జాతర   తొమ్మిది రోజులు వరకు ఘనంగా జరుగనుంది.
ఉగాది రోజున సేవాలాల్ భక్తుల సమ్మేళనం:
ఆసిఫాబాద్ జిల్లా కెరామెరి మండలంలోని శంకరలోద్దిలో  శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా సేవాలాల్ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్  శంకర్ లోద్ది  అనే పవిత్ర స్థలంలో  శివుని ప్రత్యేక పూజ చేసి బంజారా సాంప్రదాయం ప్రకారం మాత జగదాంబ దేవి సంత్ సేవాలాల్, రామారావు మహారాజ్  పూజలు
భోగ భండారో  కార్యక్రమం నిర్వహించారు. సేవాలాల్ నామస్మరణ చేస్తూ హారతి పాటలు, గాయకులు భజన పాటలు పాడుతు సేవాలాల్ భక్తులు ఉత్తేజాన్ని ఇచ్చారు. ఆనార్ పల్లి తాండ భజన మండలి తమ తమ భజన పాటలతో సభికులను అలరించారు. సేవాలాల్ భక్తులు భారీ సంఖ్యలో వివిధ తాండల నుండి హాజరైయ్యారు. నాయక్ కారోభారిలు, సమాజ పెద్దలు, తాండ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఉపాధ్యాయులు, యువకులు సాంప్రదాయబద్ధంగా మహారాజ్ ఆశీర్వాదం తీసుకుని తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పూర్వ చరిత్ర:
తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా నార్నూరు మండలంలోని  కొత్తపల్లి( హెచ్) దీక్ష భూమి  బంజారాల అత్యంత ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దీక్షభూమి పీఠాధిపతి అయిన సంత్ దీక్షగురు శ్రీ   ప్రేమ్ సింగ్ మహారాజ్  జగజ్జనని జగదాంబ దేవి భక్తుడు. ఇతని గురువు నిర్గుణ నిరంకారి బాల బ్రహ్మచారి,రాజగురు,   రాష్ట్రీయ సంత్ మహాన్ తపస్వి డా. రామారావు మహారాజ్ .1978 లో ప్రేమ్ సింగ్ మహారాజ్ కెరామెరి మండలంలోని  శంకర్ లొద్ది అనే పవిత్రమైన స్థలంలో ఒక సంవత్సరం కాలం పాటు భగవాన్ శంకరుని అనుగ్రహముతో తపస్సు చేసెను. శంకర్ లొద్దిలో  ఆధ్యాత్మిక భక్తి మార్గంలో నిమగ్నమై గురువు సంత్ రామారావు మహారాజ్, జగదాంబ దేవికి ధూపదీపం పెట్టి అన్నపానీయాలు విడిచి రావి చెట్టు నీడలో దట్టమైన అరణ్యంలో నది ఒడ్డున సంవత్సరం కాలం పాటు ఆధ్యాత్మికంగా  తపస్సు చేసి దైవ సౌక్షాత్కారాన్ని పొందినారు. మాత జగదాంబ దేవి, రామారావు మహారాజ్  కలలో ప్రత్యక్షమై ప్రేమ్ సింగ్ మహారాజ్ గురించి చెప్పడంతో  పౌరాఘడ్  పీఠాధిపతి అయిన సంత్ శ్రీ రామారావు మహారాజ్  మహారాష్ట్రలోని వాసీం జిల్లా మనోర తాలుకా పౌరాదేవి ఆలయం నుండి తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా కెరామెరి మండలంలోని అనార్ పల్లి మీదుగా భక్తులతో  శంకర్ లొద్దికి చేరుకున్నారు.అక్కడ మహారాజ్ ని కలిసి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని  తపస్సు నుంచి నిష్క్రమించాలని  చెప్పడంతో,
 ఆ అంతర్యామీ తపస్సు ద్వారా శ్రీ,రామారావు మహారాజ్  ఆజ్ఞతో వరాలను పొందినారు.తపస్సు, ఆజ్ఞ వలన మహారాజ్ కు దివ్యమైన తేజస్సు ఉత్పన్నమైందని భక్తులు అంటారు.
సేవాలాల్ దీక్షలు:-
సేవాలాల్ దీక్షలు శ్రీ సంత్ దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ తొలి సారిగా  మహాశివరాత్రి రోజున శివుని పూజ చేసి 1992‌లో ప్రారంభించారు.  దీక్షభూమి కొత్తపల్లి నుండి పౌరాఘడ్ కు "సేవాదళ్ " పేరుతో  సుమారు యాభైవేల పైగా భక్తులను కాలినడకన గురు శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్  పౌరాదేవికి తీసుకొని వెళ్ళటం గొప్ప  విషయం.అప్పటి నుండి ప్రతి సంవత్సరం భక్తులు దీక్ష భూమిలో దీక్ష తీసుకొని పౌరాదేవికి వెళ్తుతుంటారు.బంజారాల కాశీ మహారాష్ట్రలోని పౌరాఘడ్ లో కొలువైవున్న బంజారాల ఆరాధ్యదైవం శ్రీ  సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి కాకుండా  ఇతర దేశాల నుంచి గోర్ బంజారా భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తారు.
దీక్షలు మహా శివరాత్రి నుండి శ్రీ రామ నవమి వరకు:
 సేవాలాల్ దీక్షలు నలభై ఒక్క  రోజులు  మహాశివరాత్రి పర్వదినం మొదలు శ్రీరామ నవమి వరకు ఎటు చూసినా తాండలో సేవాలాల్ దీక్షలు జై సేవాలాల్ నామస్మరణలు వీనులవిందు చేస్తాయి.చల్లటి నీటితో స్నానం, నేలమీద శయనం నిరాడంబర జీవనం గులాబీ వస్త్రధారణ, శాంతి స్వరూపాన్ని సేవాలాల్ దీక్షా పరులు పాటిస్తారు.
భక్తులు స్త్రీ, పురుషులు 41రోజులు దీక్ష  ప్రారంభించేటప్పుడు  తెల్లని ధోవతిలు, లుంగీలు, ప్యాంటు,  గులాబీ రంగు చొక్కలు,కమీజులు, చీరలు ధరించి నియమ నిష్ఠలతో కఠిన దీక్షకు పూనుకుంటారు. చన్నీటిస్నానం, పాదరక్షలు వదిలేయడం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం లాంటి నియమాలతో ఆధ్యాత్మిక చింతనను కలిగివుంటారు.
 తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయటంవలన రక్తప్రసరణ మెరుగుపడి మనోచైతన్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. మంచి మార్గానికి మళ్ళించే జీవనం మొదలై ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయి. చెడు వ్యసనాలకు దూరమై రెండు పూటలా స్నానం చేసి దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రత అలవడుతుంది. సాముహికంగా పూజలు భక్తి శ్రద్ధలతో భజన, కీర్తనలు చేస్తూ ఉదయం,సాయంత్రం హారతి ఇవ్వడం పూజ కార్యక్రమాలు చేస్తూ దైవ చింతనలో ఉండటం జరుగుతుంది.
నియమాలు:-
సేవాలాల్ దీక్ష సమయంలో భక్తులు మాదకద్రవ్యాలు సేవించడం గాని అబద్ధాలు మాట్లాడడం గాని, అపకారాలు తలపెట్టే విధంగా కుట్రలు పన్నడం, దూషించడం, చెడు ఆలోచనలు పెట్టుకోవడం గాని ‌చేయరు.భక్తులు తాము స్వయంగా తయారు చేసిన వంటకాలు మాత్రమే భుజిస్తారు. అంటు ముట్టు ఐనా పానీయాలు సేవించరు. ఈ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినాన మొదలుకోని  శ్రీ రామనవమి వరకు కొనసాగుతుంది. శ్రీరామనవమి రోజున భక్తులు పౌరాదేవికి వెళ్ళి జగదాంబ మాతకు కానుకలు సమర్పించి మొక్కుచెల్లించి సేవాలాల్ దీక్షలు విరమిస్తారు. ఈ విధంగా భక్తి మార్గంలో  మహారాజ్   ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడం గమనార్హం.
ప్రారంభమైన మహా పాదయాత్ర:
కెరామెరి మండలంలోని  శంకర్ లోద్దిలో పూజల అనంతరం  మహారాజ్  గారి ఆదేశానుసారంగా సేవాలాల్ భక్తులు సాయింత్రం  దీక్ష భూమి కొత్తపల్లి చేరుకుని భోగ్ భండారో ,భజన, కీర్తనలు కార్యక్రమం నిర్వహించి బస చేశారు. ఉదయం కాలకృత్యాలు స్నానాలు ముగించి 
అచ్చటి నుండి  సేవాలాల్ దీక్ష విరమణ కోసం 23 మార్చి 2023 న  ఉదయం  బంజారాల కాశీ గా పిలువబడే పౌరాదేవికి కాలినడకన బయలు దేరారు.
కార్యక్రమాల వివరాలు:
🔹23మార్చి2023 గురువారం రోజున  ఉట్నూరు మండలంలోని లింగొజీ తాండలో  ఫలహారాలు స్వీకరించి పులిమడుగు నందు సాయంత్రం బస చేస్తారు.
🔹24మార్చి2023 శుక్రవారం రోజున ఇంద్రవెల్లికి చేరుకోని శ్రీ కృష్ణా మందిరం యందు ఫలహారాలు కొద్ది సేపు విస్రాంతి తీసుకుని గుడిహత్నూర్ మండలంలోని తోషం కి చేరుకుని భోజన కార్యక్రమం ముగించుకుని పడుకుంటారు.
🔹25 మార్చి 2023 శనివారం రోజున ఆదిలాబాదు మీదుగా భీంపూర్ మండల కేంద్రానికి చేరుకోని భోజనాలు స్వీకరించి అచటనే బస చేస్తారు.
🔹26 మార్చి 2023 ఆదివారం రోజున బోథ్ చౌరస్తా వద్ద ఫలహారాలు తీసుకుని మహారాష్ట్ర లోని సార్ఖాని చేరుకుంటారు. అచట ఠాక్రునాయక్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది.
🔹27 మార్చి 2023 సోమవారం రోజున ఆశోలా చేరుకుని ఫలహారాలు స్వీకరించి  అచట నుండి బయలు దేరి మహోర్ తాలుకా లోని పెన్ గంగ నది పరివాహక ప్రాంతంలో ఉన్న దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆశ్రమంలో బస చేస్తారు.
🔹28 మార్చి 2023 మంగళవారం రోజున  చీచ్  పాడీ పరిసర ప్రాంతాల్లో బస చేస్తారు.
🔹29 మార్చి 2023 బుధవారం రోజున మహారాష్ట్ర లోని "విఠాళా"తాండ నాయక్  ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం ఉంటుంది.
🔹30 మార్చి 2023 గురువారం శ్రీరామనవమి రోజున  మహా కుంభమేళ పౌరాఘడ్ కు చేరుకుని అమ్మ జగదాంబ దేవి దర్శనం ప్రత్యేక పూజలు సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామారావు మహారాజ్  దర్శనం చేసుకుంటారు. 
నవమి రోజున మహాపూజ:-
పౌరాదేవిలో  శ్రీరామనవమి రోజున జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామారావు మహారాజ్  దేవస్థానంలో  ఆలయ కమిటీ చైర్మన్ ముఖ్యులు సంత్ బాబు సింగ్ మహారాజ్, సంత్ శేకర్ మహారాజ్  ఆధ్వర్యంలో మహా ప్రసాదం భోగ్ భండారో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.జై సేవాలాల్  జై జై సేవాలాల్ ధ్వనులతో పౌరాదేవి దద్దరిల్లుతుంది.
తొమ్మిది రోజులు జాతర:
పౌరాదేవి మహా జాతరలో శ్రీరామనవమి రోజే  అంత్యంత కీలకం  సంత్ సేవాలాల్ జగదాంబ దేవి, సంత్ రామారావు మహారాజ్ కు ఈ రోజే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు, పూజారులు దేవి దేవతలను పూజించడంతో మహాజాతర పరిపూర్ణం అవుతుంది.సేవాలాల్  భక్తులతో  కిటకిటలాడిన ఆలయ ప్రాంగణాలు.
భక్తులు అమ్మవారిని దర్శించి కానుకలు, మొక్కులు సమర్పించి పూజిస్తారు. దర్శనానికి వచ్చిన లక్షలాది మందితో  ఆలయ ప్రాంగణాలు జన సముద్రం మవుతాయి. కుల,మత  భేదాలు లేకుండా అన్ని వర్గాల భక్తులు దర్శించుకుంటారు. ఈ జాతర బంజారాల హృదయావిష్కరణ. దేశంలో ఉన్న ప్రతి బంజారా బిడ్డలు అమ్మ ఒడిని చేరిన ఆనందం
(వ్యాసకర్త ఉపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ)
రాథోడ్ శ్రావణ్
9491467715


కామెంట్‌లు