నదిలాంటి మనిషొకడు.....;-కిలపర్తి దాలినాయుడు

 నదిలాంటి మనిషొకడు ప్రవహిస్తూ నన్ను కలిసాడు!
కొండలపై నుండి దూకి నప్పటి
గాయాలను పరిచయం చేసాడు!
అడవులు వధించబడుతున్న
కడిగిన కథలను వివరించడం
మొదలుపెట్టాడు!
రాళ్ళను కరిగించి కొండచరియలతో జరిపిన
సంభాషణా రహస్యాలను
పంచుకున్నాడు!
ఔషధాల వ్రేళ్ళ చివరి
ధన్వంతరి దాచిన వైద్యగ్రంథాలను చదివినట్టు
ఒకింత పొంగిపోయాడు!
ఊరి చివరికి చేరినననాటికి
చిక్కి శల్యమైన తన దేహాన్ని
కాపాడమని అర్ధించాడు!
పరిశ్రమలు విసిరిన మలమూత్రాలు తన చర్మంపై
ఆసిడ్ దాడులు చేసాయని
వాపోయాడు!
నదిలాంటి మనిషొకడు
నన్ను హరితవనమై రక్షించాలని సందేశమిచ్చి
మాయమైనాడు!
----------------------------------------

కామెంట్‌లు