మధుమాసమాధుర్యాలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కోకిలమ్మ కొమ్మయెక్కి
కుహూకుహూ రాగాలుతీసి
కుశలమడిగి కుతూహలపరచి
కమ్మనికవితనొకటి కూర్చమంది

మల్లెపువ్వు ముందుకొచ్చి
మధుమాసపు ముచ్చట్లుచెప్పి
మనసుదోచి మత్తెక్కించి
మంచికవితనొకటి మాలగానల్లమంది

మామిడి చిగురించి
తోరణము కట్టమనిచెప్పి
పూతపూచి పిందెలేసి
మధురకవితనొకటి మేటిగావ్రాయమంది

కొత్తగాపెళ్ళయిన పడతియొకతి
అత్తవారింటి కల్లుడొస్తున్నాడనిచెప్పి
భర్తభ్రమలలో మునిగిపోయి
భేషైనకవితనొకటి వెలువరించమంది

కాలం కళ్ళముందుకొచ్చి
శిశిరం పోతుందని చెప్పి
వసంతం వస్తుందని తెలిపి
ఋతువులవర్ణన చేయమంది

సాహితీసంస్థ ముందుకొచ్చి
ఉగాదికవితల పోటీలుపెట్టి
సన్మానసత్కారాలు చేస్తామని
చక్కనికవితను పంపమంది

ఆలోచనలను మదిలోపారించి
భావోద్వేగాలను రేకెత్తించి
కలమును చేతపట్టించి
మధుమాసం కవులకుపనిపెట్టింది
========================
అందరికీ ఉగాది శుభాకాంక్షలు


కామెంట్‌లు