కోతి దొంగోడు (సరదా జానపద కథ) -డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212
 ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆమె చానా బీదది. ఆమెకు పిల్లల్లేరు. దాంతో ఒక కోతిపిల్లను తెచ్చుకోని ప్రేమగా పెంచుకోనింది. అది చూసి వూర్లో వాళ్ళందరూ ''ఒసే ముసల్దానా...నీకే తినడానికి తిండి లేదు. మళ్ళా ఆ కోతెందుకే'' అని ఎగతాళి చేసేటోళ్ళు. ఎవరేమన్నా ఏమీ పట్టించుకోకుండా ఆ ముసల్ది కోతిని బాగా ప్రేమగా చూసుకొనేది. రోజూ పొద్దున్నే దానికి స్నానం చేపిచ్చి, చక్కగా తల దువ్వి, వుతికిన బట్టలేసేది. తాను తిన్నా తినకపోయినా దానికి మాత్రం కడుపు నిండా పెట్టేది.
ఒకరోజు ఆ కోతి అవ్వ దగ్గరకొచ్చి ''అవ్వ...అవ్వా...నేను అడవికి పోయి పండ్లు ఏరుకోనొస్తా...'' అని చెప్పి గంప నెత్తిన పెట్టుకోని పండ్ల కోసం వెదుకుతా... అడవి లోనికి పోయింది. అట్లా పోతా వుంటే ఒకచోట ఒక పెద్ద మామిడిచెట్టు కనబడింది. వెంటనే అది దాని పైకెక్కి పండ్లు కోసుకుంటా వుంటే కాసేపటికి ఎవరో వస్తున్న అలికిడి అయింది.
''ఎవరబ్బా'' అని పైనుండి చూస్తే ఇంగేముంది... ఒక దొంగోడు గుర్రం మీద తాను దొంగిలించుకోనొచ్చిన బంగారమంతా వేస్కోని వస్తా కనబన్నాడు. వాడెక్కడికి పోతున్నాడబ్బా అని ఆ కోతి వాని వెనుకెనుకే...వెనుకెనుకే... దాచిపెట్టుకుంటా ...దాచిపెట్టుకుంటా... పోయింది. వాడు అట్లా కొంచం దూరం పోయినాక ఒక గుహలోనికి దూరి బంగారమంతా ఆడ దాచిపెట్టి, గుహ ఎవరికీ కనబడకుండా చెట్టుకొమ్మలు అడ్డుపెట్టి వెళ్ళిపోయినాడు.
వాడట్లా పోయినాడో...లేదో...అందుకోసమే కాసుకోనున్న కోతి బెరబెరా లోపలికి పోయింది. పోయి చూస్తే ఇంగేముంది. రత్నాలు, వజ్రాలు, హారాలు, వడ్డాణాలు, ముక్కుపుడకలు, చేతిగాజులు, చెవి కమ్మలు...బంగారువి ధగధగా మెరిసిపోతా కుప్పలు కుప్పలు కనబన్నాయి. వెంటనే కోతి సంబరంగా గంప తీసుకోని దాన్నిండా అన్నీ నింపుకోనింది. మళ్ళా వున్నది వున్నట్లుగా గుహకు చెట్ల కొమ్మలు అడ్డం పెట్టేసి, గంపనెత్తికెత్తుకోని బెరబెరా ఇంటికొచ్చి, ''అవ్వా... అవ్వా... కాస్త ఈ గంప దించుదురా'' అనింది. ''ఎన్ని పండ్లు ఏరుకొచ్చినావే.... అంత గస పెడ్తా వున్నావ్‌'' అంటూ అవ్వ గంప దించి చూస్తే ఇంగేముంది... వజ్రాలు, రత్నాలు... బంగారం ..ధగధగా మెరిసిపోతా కనబన్నాయి. అవ్వ అవన్నీ దాచిపెట్టి అవసరమైనప్పుడల్లా ఒకొక్కటి అమ్ముకోని హాయిగా బతకసాగింది.
ఇంట్లో డబ్బులు అయిపోయినప్పుడల్లా ఆ కోతి గంప తీస్కోనిపోయి బంగారం తేవడం మొదలుపెట్టింది. అట్లా కోతి గంపలు గంపలు ఎత్తుకోనొస్తావుంది గదా...దాంతో దొంగోనికి అనుమానమొచ్చింది. ''ఇదేందబ్బా...నేను రోజూ ఎక్కడెక్కడి నుంచో...ఏమేమో...ఎత్తుకోనొచ్చి దాచిపెడతా వుంటే...రోజురోజుకీ సొమ్ములు పెరగాల గానీ తగ్గిపోతా వున్నాయే'' అనుకోని యాడికీ పోకుండా ఎదురుగా వున్న ఒక పెద్ద మర్రి చెట్టెక్కి చూడడం మొదలుపెట్టినాడు.
కోతికి దొంగోడు ఆన్నే చెట్టుపైన దాచిపెట్టుకొన్నేది తెలీదు గదా. అందుకని ఎప్పట్లాగే ఒకరోజు గంప తీసుకోని గుహలోనికి పోయి నింపుకోవడం మొదలుపెట్టింది. ''ఓహో ఇదన్నమాట సంగతి'' అనుకోని వాడు నెమ్మదిగా చెట్టు దిగొచ్చి అడుగులో అడుగేసుకుంటా వెనుకమాటుగ వచ్చి లటుక్కున దాన్ని పట్టేసుకున్నాడు. అది ఎంత గింజుకున్నా వదల్లేదు. ఇట్లా లాభం లేదనుకున్న ఆ కోతి ఒక ఉపాయమాలోచించి ''దొంగోడా... దొంగోడా... నాకో అక్కుంది. ఆమె సక్కదనాల సుక్క. నన్ను గనక వదిలేస్తే మా అక్కనిచ్చి పెండ్లి చేస్తా... సరేనా'' అనింది. సరేనని దొంగోడు దాన్ని విడిచిపెట్టినాడు. అప్పుడాకోతి ''రేపు మా ఇంటికి రా. మా అక్కను తీసుకోని పోదువుగానీ'' అని చెప్పింది. వాడు 'సరే'నని సంబరంగా దానికి గంప నిండా బంగారమెత్తి పంపిచ్చినాడు.
కోతికి అస్సలు అక్కాచెల్లెళ్ళు ఎవరూ లేరు గదా...దాంతో ''రేపు దొంగోడొస్తే ఏం చేయాలబ్బా'' అని ఆలోచించి... ఆఖరికి ఒక బస్తా మైదాపిండి తీసుకోనొచ్చి ఒక పెద్దబొమ్మ చేసింది. దానికి చీర చుట్టి, గాజులు తొడిగి, నుదుట తిలకం దిద్ది, సవరం పెట్టి, అచ్చం అందమైన ఆడపిల్లలెక్కనే తయారుచేసి మంచమ్మీద పన్నబెట్టింది.
తర్వాత రోజు పొద్దున్నే దొంగోడు గుర్రమేస్కోని వాళ్ళింటికొచ్చినాడు. కోతి కడుక్కోడానికి కాళ్ళకునీళ్ళిచ్చి లోపల కూచోబెట్టి ''మా అక్క వ్రతం చేస్తా వుంది. ఐదు రోజుల వరకూ ఎవరితోనూ మాట్లాడదు - అన్నం తినదు. నీళ్ళు తాగదు. మంచం దిగదు. ఈ ఐదురోజులు నువ్వు ఆమెను ఏమీ అనొద్దు. వ్రతమైపోగానే హాయిగా పెండ్లి చేసుకో'' అని చెప్పి బొమ్మను కిందికి దించకుండా మంచంతో సహా ఎత్తుకోనిపోయి దొంగోనింట్లో పెట్టి వచ్చేసింది. రావడం రావడం ఇంట్లో వున్నవన్నీ మూటగట్టేసి రాత్రికి రాత్రి అవ్వను తీస్కోని వూరిడిచి ఎవ్వరూ కనుక్కోలేని చోటికి పారిపోయింది.
దొంగోనికి మంచమ్మీదున్నది బొమ్మని తెలీదు గదా. దాంతో ''అబ్బ నాక్కాబోయే పెండ్లాం ఎంత చూడముచ్చటగా వుందో'' అని మురిసిపోతా వున్నాడు. ఒకరోజు గడిచిపాయ..... రెండ్రోజులు గడిచిపాయ... మూడురోజులు గడిచిపాయ... నాలుగు రోజులు గడిచిపాయ... ఐదు రోజులు గడిచిపాయ... ఆఖరికి వారం గూడా దాటిపాయ.
''ఇదేందబ్బా..... ఇన్ని రోజులైనా లేసి రాకుంటుంది'' అని గట్టిగా పిలిచినాడు. ఆడుండేది బొమ్మ కదా. అందుకే వులకలా, పలకలా. దాంతో వానికి కోపమొచ్చి ''లెయ్యే పైకి'' అంటూ చేయి పట్టుకొని లాగితే ఇంకేముంది... చెయ్యూడొచ్చింది. కాలు పట్టుకోని లాగితే కాలూడొచ్చింది.
''అమ్మ... దొంగదానా... పిండిబొమ్మ పెట్టి నిజం మనిషని నన్నే మోసం చేస్తావా. వుండు నీ పని చెబ్తా'' అని వాడు కోపంగా కత్తి తీసుకోని వూరికి పోయినాడు. పోయి చూస్తే ఇంగేముంది అవ్వాలేదు... కోతీ లేదూ...
**********

కామెంట్‌లు