సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -108
దేవదత్త శౌర్య న్యాయము
******
దేవదత్త అనగా దేవదత్తుడు.  శాస్త్రములలో పండితుడిగా,శౌర్యము కలవాడిగా ఇతనిని ఉదహరిస్తుంటారు. శౌర్యము అనగా శూరత్వము, పరాక్రమము,విక్రమము అనే అర్థాలు ఉన్నాయి .
దేవదత్తము అంటే అర్జునుని శంఖమనే అర్థం ఉంది.
గౌతమబుద్ధుని కాలంలోనూ దేవదత్తుడు ఉన్నాడు కానీ అతనిపై సదభిప్రాయం లేదు.అతడికి కుట్ర కల్మషము కలిగిన వ్యక్తిగా  పేరు ఉంది.
ఇక్కడ ఉదాహరించిన న్యాయములో మాత్రం దేవదత్తుడు శౌర్యం కలవాడుగా... కాబట్టి ఆవిధమైన న్యాయమునే పరిగణనలోకి తీసుకుందాం.
దేవదత్తుడు శౌర్యము కలవాడు. ఆ విషయము తానున్న దేశంలోని అందరికీ తెలుసు.అతడు దేశాంతరం వెళ్ళినప్పుడు అతడు "అవిజ్ఞాతుడు" అవుట వలన అంటే తెలియని వాడు అగుట వలన అతని శౌర్య పరాక్రమములు అక్కడ వెల్లడి కావు.అంత మాత్రాన అతనిలోని శౌర్య పరాక్రమములు పోతాయా? పోవు కదా!"
అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తి కానీ వస్తువులు తమ సహజ ధర్మాలను, గుణాలను వీడవు అనే అర్థంతో ఈ దేవదత్త శౌర్య న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే వేమన తన పద్యంలో  ఇలా అంటాడు.
"అనువు గాని చోట అధికుల మనరాదు/ కొంచముండుటెల్ల కొదువ గాదు/ కొండ అద్దమందు కొంచమై ఉండదా/ విశ్వధాభిరామ వినురవేమ"అంటాడు.
తెలియని చోట అధికులమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు.తెలియని చోట సామాన్యులుగా ఉన్నంత మాత్రాన మనకున్న జ్ఞానం, తెలివి తేటలు ఎక్కడికీ పోవు. అద్దంలో కొండ చిన్నదిగా కనబడుతుంది కానీ అది చిన్నదేం కాదు కదా!" అని అర్థం.
కాబట్టి దేవదత్తునిలా మనం కూడా తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనలోని ఘనత,ప్రతిభ వగైరాలు గుర్తించలేదని బాధ పడవద్దు.మనలోని జ్ఞాన సంపద కానీ,సహజ గుణాలు కానీ సందర్భం వచ్చినప్పుడు వాటంతట అవే బయట పడతాయి.
కాబట్టి మంచి ప్రవర్తన, మానవీయ విలువలు, ప్రతిభా పాండిత్యాలు, ధైర్య సాహసాలు వ్యక్తుల వ్యక్తిత్వపు గీటురాళ్ళు.అవి కంటికి వెంటనే కనిపించని ఆభరణాలు. సమయం సందర్భం వచ్చినప్పుడే అవి వాటంతట అవే బయట పడతాయి.అవి బయట పడే వరకు సంయమనం పాటించడం విజ్ఞుల లక్షణం కావాలి అనే అర్థంతో ఈ "దేవదత్త శౌర్య న్యాయమును" వర్తింప చేసుకోవచ్చు.
ఎలాగైతేనేం సమాజంలో రకరకాల విలువలను పాదుకొల్పడానికి నాటి పూర్వీకులు సృష్టించిన రకరకాల న్యాయాలను చదువుకుందాం. తదనుగుణంగా మనలో మంచి మార్పుకు శ్రీకారం చుడదాం. 
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు