సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -104
దూరగిరి న్యాయము
******
గిరి అంటే కొండ లేదా గుట్ట,పర్వతం మొదలైన అర్థాలు ఉన్నాయి.
దూర గిరి అంటే దూరంగా ఉన్న కొండ.
దూరంగా ఉన్న కొండలు  కంటికి నునుపుగా ఉన్నట్లుగా కనిపిస్తాయి.కానీ ఆ కొండ మీద ఉన్న  చెట్లూ, చేమలూ, రాళ్ళు,రప్పలూ , ఎగుడు దిగుడులూ ఏమీ కనబడవు . "అబ్బా! భలే నున్నగా ఉందే కొండ!" అనుకుంటాం. అలా అనుకోవడాన్ని, అదంతా తప్పు భావన చెప్పడాన్నే "దూర గిరి న్యాయము" అంటారు .
దీనినే తెలుగులో "దూరపు కొండలు నునుపు" అని అంటారు.
వస్తువులు , ప్రదేశాలు కొండలను దూరం నుంచి చూసినప్పుడు కంటికి ఇంపుగా బాగున్నాయని అనిపిస్తుంది.వాటికి సంబంధించిన అసలు విషయాలు  ఏమీ తెలియవు.దగ్గరకు వెళితే మనం ఎంత పొరపాటుగా అనుకున్నామో తెలుస్తుంది.
 ఈ  విషయం అందరికి తెలిసిందే కదా! మరి ఈ న్యాయము చెప్పవలసిన అవసరం ఏమున్నది అనిపించ వచ్చు.
కానీ తరచి చూస్తే అంతర్లీనంగా ఇందులో గొప్ప సందేశం ఇమిడి ఉంది.
నిత్య జీవితాన్నే తీసుకుందాం.కొంత మంది పైకి చూడటానికి ఎలాంటి  బాధలు కష్టాలు లేకుండా సంతోషానికి మారుపేరుగా కనిపిస్తారు.
ఇక మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకంటే ఎంతో సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంటారు.
 వాళ్ళను,వీళ్ళని చూసినప్పుడల్లా మనం ఎందుకలా  లేము.ప్రపంచంలో బాధలన్నీ మనల్నే చుట్టుముట్టాయే!  "ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో".. ఇలా అనుకునేదాకా పోతాం.
 కానీ వాళ్ళ గురించి ఆరా తీసినప్పుడో, వాళ్ళు మనకు తారసపడి తమ బాధలు, కష్టాల గోడు చెప్పినప్పుడో అసలు నిజాలు తెలిసి "అమ్మో ఏం కష్టాలవి. వాళ్ళకంటే మనమే వంద పాళ్ళు నయం కదా! అనుకుంటూ ఉంటాం.
అందుకే పెద్దలు "బయటికి కనిపించేదంతా నిజం కాదురా నాయనా!" ఎవరికుండే కష్టాలు, బాధలు, సమస్యలు వారికి ఉంటాయి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని... పోల్చుకుని బాధ పడొద్దు." అని హిత బోధ చేస్తూ ఈ "దూర గిరి న్యాయమును" ఉదాహరణగా చెబుతుంటారు.
అలాగే "మనకు దగ్గరగా ఉన్న వాటిని గానీ, మనకున్న సౌకర్యాలను గానీ,ఆత్మీయత పంచే మనుషులను కానీ తక్కువ చూపు చూస్తూ, దూరంగా ఉన్న వాటిని, వారిని అతిగా ఊహించుకుని" తీరా అసలు విషయాలు, నిజాలు తెలిసి బాధ పడే సందర్భంలో కూడా ఈ న్యాయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇంతెందుకు చుట్టూ రకరకాల వృత్తుల వాళ్ళూ, ఉద్యోగాలు చేసేవారు తనకంటే ఎంతో సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉన్నారనీ.తనకా అదృష్టం లేదే అనుకుంటూ" ఏమిటో  తలరాత ఇలా ఏడ్చింది " అని వాపోయే వారిని చూస్తుంటాం.
గరిక పాటి నరసింహ రావు గారు " దూరపు కొండలు నునుపు "  సామెత గురించి ఎంతో చక్కగా వ్యాఖ్యానించారు. అదేంటో చూద్దాం.
జగన్నాథ పండితరాయలు ఈ విషయమై మంచి భావన చేశారని చెబుతూ దానికి మహీధర నళినీ మోహన్ గారు తెలుగులో చెప్పిన  పద్యం గురించి ఉటంకించారు.
నా నాథుండు పరాగమంటిన వయిన్..." అనే పద్యం యొక్క  భావము ఏమిటంటే ...ఒకానొక సరోవరంలో ఉన్న హంస జంటలో మగ హంసకు అనుకోకుండా మానస సరోవరానికి వెళ్ళే అవకాశం వచ్చిందట.
అయితే ఆడ హంస తన భర్త మగ హంస గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటూ ఉంటుంది. బంగారు తామర పూల నడుమ ఎంతో ఆనందంగా ఉంటూ తామర తూడులు తింటూ వుందని అనుకొని తోటి  వారితో చెబుతుంది. కానీ అక్కడ  మగ హంసకు మానస సరోవరంలో తినడానికి తిండి దొరక్క తామర పూల కింద ఉన్న బురదలో నాచు కోసం వెతుక్కుందనీ, ఆది ఆడ హంసకు ఏం తెలుస్తుందని మగ హంస అనుకున్న విషయాన్ని చెబుతారు.
అంటే దూరంగా ఉన్న వాళ్ళు అక్కడేదో సుఖపడి పోయారని అనుకోవడం అపోహ మాత్రమే, అమెరికా లాంటి ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వెళుతూ ఉంటారు. వారు తిరిగే కార్లు ఆ ప్రదేశాల ఫోటోలు చూసి "ఆహా! ఎంత అదృష్టం!" అనుకుంటాం కానీ వాళ్ళు అక్కడ మనం అనుకున్నంత  సుఖంగా ఏం ఉండరు. వారికుండే సాధకబాధకాలు వారికీ ఉంటాయి 
కాబట్టి అలా గొప్పగా ఊహించుకొనే  వారికి మనలాంటి స్నేహితులో, హితైషులో కూర్చోబెట్టి జ్ఞానోదయం కలిగిస్తే "దూరపు కొండలు నునుపు అన్నది" బోధపడుతుంది కదా!  మీరేమంటారు?. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు