కావాలని ఉంది! - -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
నీడనిచ్చు,ఫలములిచ్చు ,
స్వచ్ఛమైన గాలినిచ్చు
పదిమందికి సాయపడే
తరువు కావాలని ఉంది!

కరిగి కరిగి కాంతినిచ్చు
అందరికీ స్ఫూర్తినిచ్చు
చీకటిని తరిమికొట్టు
క్రొవ్వొత్తి కావాలని ఉంది!

అహర్నిశలు శ్రమించే
ఆహారమందించే
అవనిలోన అన్నదాత
రీతి కావాలని ఉంది!

కన్న వారికి దూరంగా
దేశ రక్షణ ధ్యేయంగా
పోరాడే సరిహద్దు
జవాన్ కావాలని ఉంది!

విజ్ఞానం పంచిపెట్టు
అజ్ఞానం తరిమికొట్టు
జీవితాలు సరిదిద్దే
గురువు కావాలని ఉంది!

ఆపదలో ఆదరించు
కష్టాలను స్వీకరించు
బ్రతుకంతా సహకరించు
మిత్రుని కావాలని ఉంది!


కామెంట్‌లు