ఏం మొక్కలో...ఏం మనుషులో...;- - జగదీశ్ యామిజాల
 మేముండేది మౌలాలీలో. 
ఓ అపార్ట్ మెంట్. పేరు ఐశ్వర్య ఎన్ క్లేవ్. 
నాలుగంతస్తుల భవనం.
ఎనిమిది వాటాల సముదాయం.
అంటే ఒక్కో ఫ్లోరుకీ రెండేసి వాటాలు.
మా సముదాయంలో ఓ అరటి చెట్టు ఓ గెల వేసింది. ఓ వంద కాయలుపైనే ఉన్నాయి. ఈ చెట్టు కాయలు పండైతే అదొక భిన్నమైన తీయనైన రుచి. దీనిని తమిళంలో "కర్పూర వాయయ్" అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. 
ఈ చెట్టు మీద సర్వహక్కులను ఒకరు తమంతట తామే చేసుకున్నారు. అంటే వారు నాటిన చెట్టనుకునేరు. కాదు. వారు నాటిన చెట్టు కాదు. కానీ ఈ చెట్టుమీద వారికున్న అధికారమేమిటంటే, వారు ఒక హిందీ కుటుంబాన్ని ఓ వాటలో దింపారు. నిజానికి వారిది డిల్లి. అయితే ఉద్యోగరీత్యా ఆ హిందీ కుటుంబ యజమాని మౌలాలీలో ఇంటి కోసం వెతుకుతుండగా మా ఆపార్టుమెంటులో ఖాళీగా ఉన్న వాటా చూపించారు. అసలీ వాట సొంతదారు అమెరికాలో ఉంటారు. వారు మా పక్కవాటా ఆవిడకు ఇంట్లో అద్దెకిచ్చే బాధ్యత అప్పగించింది. దాంతో వారి మాటతో హిందీ కుటుంబం అద్దెకు దిగిందా వాటాలో. తీరా కొంతకాలమే వారిక్కడ ఉండి విజయవాడకు బదిలీ అయి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతున్న రోజుల్లో వారు రెండు అరటి పిలకలు నాటారు. ఆవి పెరిగి పెద్దవయ్యాయి. వాటిలో ఒకటి గెల వేసింది. ఇంకొక చెట్టుకి ఇప్పుడే అరటి పువ్వు మొదలైంది. 
ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన హిందీ కుటుంబాన్ని తామే అద్దెకు దించాం కనుక వారేసిన అరటి చెట్లమీద తమకే సర్వహక్కులూ ఉంటాయనే ధోరణిలో వ్యవహరించారు మా పక్క వాటా ఆవిడ.
ఓరోజు రాత్రి ఎవరికీ తెలీకుండా వాచ్ మాన్ తో గెల కోయించేసిన ఆవిడ దానిని తీసుకుపోయి దాచుకుంది. అవి పండాక మేము పక్కనే ఉండటం వల్ల మాకు పన్నెండు పళ్ళు ఇచ్చారు. మిగిలిన వాటాలవాళ్ళకు ఓ ఆరేసి పళ్ళిచ్చారు. వాచ్ మాన్ కి పాడైపోయిన ఓ ఆరు పళ్ళిచ్చారు. 
వాచ్ మాన్ కీ, మరొక వాటా వారికీ ఆవిడంతట ఇవ్వకుండా నా చేతికిచ్చి మీరే ఇచ్చేయ్యండి అన్నారు. వాచ్ మాన్ కి ఇవ్వమన్న ఆరు పళ్ళలో నాలుగు అసలు తినేటట్లుగా లేవు. వాటిని పక్కన పడేసి మాకిచ్చిన డజన్ పళ్ళలో ఓ నాలుగు కలిపి పాడైపోయినవి పక్కన పడేశాను. ఇంకొక వాటా వారు గోదావరి ప్రాంతంవారని మాట్లాడరావిడ. అందుకోసం మమ్మల్ని ఇవ్వమని వారి వాటా నాకిచ్చారు. ఇవికూడా ఓ మోస్తరుగానే ఉన్నాయి. 
ఇక్కడో విషయం చెప్పాలి.ఈ గెల తాలూకు పువ్వని ఓ వృద్ధ దంపతులు కోసుకుని వండుకున్నారు. వారలా కోసిన విషయంలో తమ అనుమతి తుసుకోలేదని ఈవిడ అన్న మాటలతో వెగటు పుట్టింది. మా పర్మిషన్ తీసుకోకుండా ఎలా అరటి పువ్వు కోస్తొరు...అది మాది...మాకు తప్ప ఎవరికీ అరటి చెట్లమీద హక్కు లేదని మా ఆవిడతో ఏవేవో మాటలందావిడ. పైగా తానన్న మాటలన్నీ ఆ వృద్ధ దంపతులకు చెప్పమంది.
అసలెక్కడా పెద్దరికమనేదే లేదావిడ తీరులో. 
ఓ తమలపాకు తీగను ఆవిడే నాటింది.అదిప్పుడు ఎంత అందంగా పాకిందో పెరట్లో. చూడ్డానికి బలే ఉంటాయి తమలపాకు ఆకులు. ఈ తీగను చూడాలి తప్ప ఎవరూ కోయడానికి వీల్లేదని ఆంక్షలు విధించిందావిడ. 
అలాగే ఎవరో నాటిన గన్నేరు చెట్టు పువ్వులూ తమవేనని, ఎందుకంటే ఈ అపార్టుమెంటులోకి తామే మొదటగా దిగామని చెప్తుంటుంది. 
ఇలా ఆవరణలో ఉండే రకరకాల మొక్కలన్నింటిమీదా తమకే హక్కులుంటాయని అప్పుడప్పుడూ గుర్తు చేసే విధంగా మాటలు అంటూ ఉంటారావిడ. 
ఇదిలా ఉంటే మా పక్కనే ఉన్న ఓ ఇంటి యజమాని మా ఆవరణలోని సీతాఫల మొక్కనీ వేపచెట్టునీ అరటి మొక్కల్నీ తీసేయమని, వాటి వల్ల తమ ప్రహరీ గోడ బీటలు వారుతుందని గోల పెడుతుంటారు. అలాగే మరొక వైపున్న ఇంకొక ఇంటి యజమాని తమ ఆవరణలోకి వాలిన మీ ఇంటి జామచెట్టు కొమ్మలు ఇతరత్రా మొక్కల వల్ల పావురాలు ఎక్కువగా వాలుతున్నాయని, కనుక మొక్కలన్నింటినీ తీసెయ్యమని గోల. లేదా ఇల్లంతా వల వేయమని హెచ్చరిక. ఇటువంటి మాటలన్నీ వింటుంటే బలే ఉంటుంది నాకు.
ఏం మొక్కలో...ఏం మనుషులో...

కామెంట్‌లు