సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -120
నీలేందీవర న్యాయము
   *****
ఇందీవరము అనగా నల్ల కలువ అని అర్థం.  కలువ పువ్వుకు చాలా పేర్లు ఉన్నాయి.ఉత్పలము,కజ్జలము,కలుహారము,కల్వ,కువము,కువలము,కువలయము,డోలాబ్జము,నిశాపుష్పము,పున్నాగము,రాత్రి పుష్పము మొదలైన పేర్లతో పిలుస్తారు.
  
నల్ల కలువను నీలేందీవరం అంటూ ఉంటారు.అంటే ఒకే అర్థం వచ్చే పదాన్ని రెండు సార్లు కలిపి చెప్పడం అన్నమాట.
ఇలా తమకు తెలియకుండానే కొన్ని పదాలను ఇలా పలకడాన్ని నీలేందీవర న్యాయము అంటారు. 
ఈ ఇందీవరము యొక్క పుట్టు పూర్వోత్తరాలను కొంచెం తెలుసుకుందాం.
కవుల వర్ణనలో ఈ  కలువ పువ్వు గురించి చెప్పేటప్పుడు సూర్యకాంతిలో  కమలం వికసిస్తుందనీ, చంద్ర కాంతిలో కలువ వికసిస్తుందనీ అంటారు. మన చిన్నప్పుడు తెలుగు పుస్తకాల్లో "వెన్నెలలో వికసించే పువ్వు - కలువ పువ్వు " అని కూడా చదువుకున్నాం కదా!
వీటి మీద ఓ చక్కని పాట కూడా ఉంది. 'కలువకు చంద్రుడు ఎంతో దూరం - కమలానికి సూర్యుడు మరీ దూరం/ దూరమైన కొలదీ పెరుగును అనురాగం ' అని.
ఇక ఈ కలువ పువ్వు  విశేషాలు తెలుసుకుందాం.కలువ పువ్వు యొక్క శాస్త్రీయ నామము 'నింఫియేసి'.కలువ పువ్వును ఇంగ్లీషులో 'వాటర్ లిల్లీ' అంటారు. ఈ కలువ పువ్వును ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా గుర్తించింది.
ఈ పువ్వులు అనేక మెత్తని మృదువైన రేకులు కలిగి ఉంటాయి.ఇవి చెరువుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నీటిలోని భూభాగంలోకి పొడవాటి కాడ ఉంటుంది.నీటిపై తేలుతూ పువ్వు ఉంటుంది.ఈ కలువలు తెలుపు, గులాబీ,నీలం రంగుల్లో ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 
కలువ పువ్వులు తామర పువ్వులు ఒక కుటుంబంలోనివేనట. రెండూ నీళ్ళలోనే పెరుగుతాయి.కలువ మొక్కలు చెరువులు,దొరువులు కుంటలు మొదలైన వాటిల్లో ఎక్కడైనా చక్కగా పెరుగుతాయి.కానీ తామర మొక్కలు అలా పెరగలేవట.తామర పూలు ఎక్కువగా మంచినీటి చెరువుల్లోనే పెరుగుతాయట. అలాగే కలువ పువ్వులో అనేక గదులు గదులుగా ఉన్నా ఒకే ఒక్క కాయను  కాస్తుందట. తామర పువ్వు మాత్రం గదులన్నింటిలో అనేక కాయలు కాస్తుందట. కలువకు,తామరకు ఉన్న ముఖ్యమైన భేదాల్లో మొదటిది,రెండో భేదం ఏమిటంటే కలువ పువ్వు ఆకులు నీటిలో తడుస్తాయి.తామరాకులు నీటిలో తడవవు. అదండీ విషయం.
మనందరికీ తెలిసిందే.  తామర పువ్వు మన జాతీయ పుష్పమని. కలువలు,తామర పూలు రెండూ తెలుపు,ఎరుపు,నలుపు రంగులలో పూస్తాయి. అయితే నల్ల కలువను నీలేందీవరం అనడమే మన వాళ్ళ ప్రత్యేకత కదా! ఓకే అర్థాన్ని రెండు సార్లు పలకడం . అలాంటివి మరికొన్ని చూద్దామా! .
"దారి మార్గము, పేపర్ కాగితము,నడి మధ్యన, చివరాఖరికి,సందుగల్లీ,సల్ల మజ్జిగ ,పక్క సైడు లాంటి మాటలు నిత్య జీవితంలో చాలా వింటూ ఉంటాం.ఇవి వింటుంటే భలేగా అనిపిస్తోంది కదండీ!.
 'ఇందీవర న్యాయము' పుణ్యమాని కొన్ని ఒకే అర్థమున్న పదాలతో పాటు, కలువ బాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు