సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -119
నీర క్షీర న్యాయము
   *****
నీరము అంటే నీరు, జలము,ఉదకము అని అర్థము.
క్షీరము అంటే పాలు.
నీటిని కలిపిన పాలు.పాలరంగులో ఉంటాయి.అందులో పాలను గుర్తించగలము కానీ నీటిని ప్రత్యేకంగా గుర్తించలేము అనే అర్థంతో ఈ నీర క్షీర న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 పాల చిక్కదనం వేలు పెట్టి చూస్తే తెలుస్తుంది. చిక్కని పాలలో చింతగింజ వేస్తే మునగదు అంటుంటారు.
అలాంటి పాలకు కొన్ని నీళ్ళు కలిపినా, కొన్ని నీళ్ళకు అలాంటి పాలు కలిపినా  నీళ్ళు చక్కని పాలరంగులో ఉంటాయి. వాటిలో నీళ్ళను విడదీసి చూడలేము.
మనకు పాలే కావాలి, నీళ్ళు వద్దు అనుకుంటే నీళ్ళు కలిపిన పాలను బాగా మరిగిస్తే కలిపిన నీళ్ళు ఆవిరైపోయి, చిక్కని పాలు మాత్రమే మిగులుతాయి.
కొన్ని నీళ్ళనైనా వేరు చేయలేమా అని కొద్ది ప్రయత్నం చేస్తే మరిగే పాలను లోతైన గిన్నెలో పోసి మరిగిస్తూ పైన మూత పెట్టాలి.నీరు ఆవిరై మూత లోపలి భాగానికి  బిందువులుగా అతుక్కు పోతాయి. ఆ మూతను జాగ్రత్తగా తీసి వేరే గిన్నెలోకి ఒంపితే ఆ నీటి బిందువులు నీరుగా గిన్నెలో పడతాయి.అలా కొంత వరకు సాధ్యం.
పాల పొడి తయారీ విధానంలో నీటిని పూర్తిగా వేరు చేసి పాల పొడిని అమ్మడం చూస్తూ ఉంటాం.మళ్లీ నీళ్ళు కలుపుకొని సహజంగా దొరికే పాలకు బదులుగా వాడుకోవచ్చు.
 ఇదంతా సైన్స్ కు సంబంధించిన సమాచారం.
దీనినే మనుషులకు వర్తింప చేస్తే  నీళ్ళ వంటి వ్యక్తులు పాలవంటి సజ్జనులతో కలిసి సజ్జనులుగా సమాజంలో గౌరవం పొందుతారని చెప్పవచ్చు.
వారిలోని మంచి చెడూ గుణాలను ప్రత్యేకంగా విడదీసి చూడలేము.
నీళ్ళు  గుణాలు కూడా సామాన్యమైనది ఏం కావు.నీళ్ళు మనకు ప్రాణాధారమే.నిత్యం ఉపయోగమే.కానీ నీళ్ళ వంటి వారు ఎక్కువ మందితో పాల వంటి  వ్యక్తి కలిస్తే  పాలకున్న  ఔన్నత్యం పలుచబడి పోతుంది. అతడి యొక్క మంచి గుణం అంతగా వెలుగులోకి రాలేదు.
దీనినే సుమతీ శతక కర్త ఏమన్నాడో చూద్దాం.
పాలను కలిసిన జలమును/ పాల విధంబుననె యుండు బరికింపంగా/ బాల చవి జెఱచు గావున/ బాలసుడగు వాని పొందు వలదుర సుమతీ!"
పాలలో కలిసిన నీళ్ళు చూడటానికి పాలలా తెల్లగానే ఉంటాయి కానీ నీటి వల్ల పాలకుండే సహజమైన రుచి పోతుంది. మంచి గుణం చెడగొట్టే వాడు చెడ్డవాడే కదా! కాబట్టి అలాంటి చెడ్డ వానితో స్నేహం తగదు అని అర్థం.
కానీ నీళ్ళతో, పవిత్ర గుణాలను సంతరించుకున్న పాల వంటి వ్యక్తులు ఎక్కువ మంది కలిసి పోతే ... వారిని విడదీయాలనే ప్రయాస పడక్కర్లేదు. ఇలాంటి వారి వల్ల  సమాజానికి అంతో ఇంతో మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఇదండీ నీర క్షీర న్యాయము యొక్క లోలోపలి అంతరార్థం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు