సుప్రభాత కవిత ; - బృంద
తొలిసంధ్య వేళలో
ఇల ఎంత అందమో!!
పచ్చని కొంగు పరచి రవిని
స్వాగతించు ఆనందం

గాలిలో రవళించు
ఉదయరాగాల గానంలో
నేలలో నినదించు 
మధుర నాదాల లాస్యం

అలుముకున్న అరుణ వర్ణపు 
అపురూప సౌందర్యం
మనసు వికసించి ప్రకృతితో 

మమేకమయే బాంధవ్యం

కణకణమూ కమనీయం
అణువణువూ అపురూపం
ప్రభవించు సూర్యబింబం
ప్రసరించు వెలుగు తేజం

నింగీ నేలా కలిసే చోట
చీకటి వెలుగులో కలిసాక
అపుడే పుట్టిన శిశువులా
అమాయకంగా తోచే వసుధ

మనసు నింపే ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸

 
కామెంట్‌లు