సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -107
ద్రవిడ ప్రాణాయామ న్యాయము
******
ద్రవిడులు లేదా ద్రావిడులు అనగా ద్రావిడ భాష మాతృ భాషగా కలవారు.
ప్రాణాయామం అంటే   ప్రాణము మరియు ఆయామము.ప్రాణము అంటే జీవనము.ఆయామము అంటే పొడిగించుట లేదా పెంచుట అనే అర్థాలు ఉన్నాయి.
ప్రాణాయామము అంటే ప్రాణశక్తిని వ్యాపింప జేసి అదుపులో ఉంచడం.
ద్రావిడ ప్రాణాయామము అంటే ద్రవిడులు చేసే ప్రాణాయామము.
 ద్రావిడులు దక్షిణ భారత దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఉన్నారు.
ఉంటే ఉండొచ్చు గాక కానీ వారినీ వదలకుండా, వారు చేసే పనులను గమనించి వారి పేరుతో  కూడా ఓ న్యాయాన్ని సృష్టించడం విశేషం. మన పూర్వీకుల సునిశిత పరిశీలనకు జయహో అనాల్సిందే మరి.
ప్రాణాయామము అనేది ముక్కు మూసుకుని చేసే యోగ క్రియ.ఇది మనసును ఏకాగ్రం చేయడానికి,శరీరాంతర్గత నాడీ శుద్ధి కోసం చేస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపులో ఉంచడమే ప్రాణాయామం అని పతంజలి మహర్షి నిర్వచించారు.
ముక్కు రంధ్రాలను చేతి వేళ్ళతో నొక్కి పట్టి చేసే ఈ ప్రాణాయామములో పూరకం,కుంభకం,రేచకం అనే మూడు దశలు ఉంటాయి.
 
అయితే ద్రవిడులు ప్రాణాయామము చేసేటప్పుడు ముక్కును నేరుగా పట్టుకోకుండా  కుడిచేతిని తలచుట్టూ తిప్పి ఆ తర్వాత ముక్కు పట్టుకొంటారట.
నేరుగా ముక్కు పట్టుకొని చేయకుండా అలా తిప్పి పట్టుకొని చేయడం వారి ప్రాణాయామ సాధనలో ఒకటైతే కావచ్చు.కానీ చూసే వారికి మాత్రం ఇదేంటీ? నేరుగా చేయొచ్చు కదా! తేలిక పనిని ఇంత కష్టతరం చేసుకుంటున్నారేమిటీ ?అనే అర్థంతో ఈ "ద్రవిడ ప్రాణాయామ న్యాయమును" ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ విధంగా ప్రాణాయామమునకు ఉన్న అసలు అర్థం మారి పోయింది.
ఇలాంటి డొంక తిరుగుడు వ్యవహారాలను అంటే సులభంగా చేసే పనిని  కష్టం చేసుకోవడాన్ని నేరుగా చెప్పే విషయాన్ని సాగతీసి చెప్పడాన్ని ఇలా  "ద్రవిడ ప్రాణాయామమనీ"  మన పెద్దవాళ్ళు అంటుంటారు.
కొన్ని మాటలు, విషయాలు అంతే... అసలు అర్థాలు మరుగున పడి, కొత్త అర్థంగా రూపాంతరం చెంది ప్రజల నోళ్లలో '"జాతీయంగానో",  ఇలా "న్యాయంగానో" నానుతూ మనలాంటి వారికి వాటి కథా కమామీషు ఏమిటో తెలుసుకునేంత ఉత్సుకత కలిగిస్తుంటాయి.
మన చుట్టు పక్కల వాళ్ళలో ఇలా నాన్చి నాన్చి  మాట్లాడే వారో, సూటిగా పని చేయని వారో తారసపడ్డప్పుడు ఈ న్యాయము గుర్తుకు వచ్చి, వారిపై ఉన్న విసుగు, చిరాకు పోయి నవ్వు రాక మానదు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు