కవిత్వం
వ్రాయటం సులభం
తలలో తలపులు
మదిలోమాటలు ఉంటేచాలు
కవిత్వం
వండటం కరతలామలకం
అక్షరాలనుకూర్చి ఉడకబెట్టి
పదాలకు గంజివారిస్తేచాలు
కవిత్వం
పారించటం శ్రమకాదు
ఊహలను ఊరించి
భావాలకు దారిచూపితేచాలు
కవిత్వం
పూయించటం పెద్దపనికాదు
అక్షరవిత్తనాలను నాటి
పచ్చనిపదమొక్కలను పెంచితేచాలు
కవిత్వం
పొంగించటం పనేమికాదు
సాహిత్యక్షీరాన్ని పాత్రలోపోసి
మనసనేపొయ్యిమీద కాస్తేచాలు
కవిత్వం
పాడటం ఇబ్బందికాదు
కళ్ళతోచూచి చదివి
పెదవులతో వదిలితేచాలు
కవిత్వం
పుట్టించటం బ్రహ్మవిద్యకాదు
అక్షరమనే అమ్మాయికి
ఆలోచననే అబ్బాయికి పెళ్ళిచేస్తేచాలు
కవిత్వం
అల్లటం పాటుకాదు
పదపుష్పాలను
లయదారానికి కడితేచాలు
కవిత్వం
చూపించటం వెతయేమికాదు
లోతైన విషయాలను
ఇంపుగా వర్ణిస్తేచాలు
కవిత్వం
పండించటం కటువేమికాదు
అక్షరసేద్యం చేసి
కైతలపంటను తీస్తేచాలు
కానీ కవిత్వం
చెయ్యటం కష్టం
కావాలి లోతైనభావం
చేయాలి అద్భుతపదప్రయోగం
అప్పుడే కవిత్వం
పాఠకులను తడుతుంది
మనసులను ముడుతుంది
చిరకాలం నిలుస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి