సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -113
నానా వృక్షరస న్యాయము
******
నానా అంటే పలుచోట్ల,పలు విధాలుగా, వేర్వేరుగా లేదా వివిధము, అనేకము  అనే అర్థాలు ఉన్నాయి.
వృక్షము అంటే చెట్టు,తరువు,భూజము,మ్రాకు,ద్రువుకుజము అనే అర్థాలు ఉన్నాయి.
రసము అంటే రుచి, సారము, అభిరుచి,పాదరసము, విషము అనే అర్థాలు ఉన్నాయి.
నానా వృక్షరసము అంటే అనేక రుచులు లేదా స్వభావాలు కలిగిన వృక్షాలు అని అర్థం.
వృక్షములు అన్నీ వృక్ష జాతికి చెందినా వాటి రసము అంటే రుచి   స్వభావము, గుణము దేనికదే  భిన్నంగా ఉంటుంది.
అంటే ఒక్కో చెట్టు ఫలాలే కావచ్చు. మరింకేదైనా కావచ్చు...అన్నీ చెట్లుగానే పిలవబడుతున్నా వాటి రుచులు వేరు అనే అర్థంతో ఈ నానా వృక్షరస న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే వ్యక్తులకు వర్తింప చేస్తే "జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి" అనే సామెత సరిగా సరిపోతుంది.
జిహ్వ అంటే నాలుక.అందరి నాలుకలు ఒకేలా ఉంటాయి కానీ ఒక్కొక్క వ్యక్తికి నచ్చే  ఆహార పదార్థాలు, రుచులు వేర్వేరుగా ఉంటాయి. పులుపు,కారం,తీపి ఇలా అనేక రుచుల పదార్థాల్లో ఒక్కొక్కరికి ఒక్కో రుచి గల పదార్థాలు నచ్చుతాయి. దీనినే సంస్కృతంలో "లోకో భిన్న రుచిః" అన్నారు .
అలాగే పుర్రెకో బుద్ధి... ఇక్కడ పుర్రె అంటే కేవలము కపాలము అనే అర్థం కాదు.ఆ పుర్రెకు ఉన్న బుద్ధి అంటే ఆ పుర్రెలోని మతి, జ్ఞానము,తెలివి, అనేక ఆలోచనలు, అభిప్రాయాలు, స్వభావాలు అన్న మాట.ఇవి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి.ఇంతెందుకూ  ఒక కుటుంబంలోని వ్యక్తులు ఏక గర్భ జనితులు అయినా మనస్తత్వంలో,వారి ఆహారం,అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు వేర్వేరుగా ఉండటం మనకు తెలిసిందే కదా!.  
మనుషులు అంతా పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో నిర్మితమైన వారే కానీ ఇలా వేర్వేరు రుచులు, ఆలోచనలు కలిగి వుంటారు అనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడినప్పటికీ షడ్రుచులలో ఏదైనా, ఏవైనా ఇష్టం ఉంటే ఉండొచ్చు కానీ బుద్ధి మాత్రం అందరిదీ మంచిదే అయి ఉండాలి.
అప్పుడే  మంచి సమాజం ఏర్పడుతుంది. మానవీయ విలువలు పూవుల్లా పరిమళిస్తాయి.సమాజం నానా,ఫల పుష్ప వృక్షరస భరితమై అందమైన హరిత వనం అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు