సాగర సంగమం- శరత్ బాబు;- ప్రమోద్ ఆవంచ 7013272452

 సృష్టిలో తీయనైనది,అద్భుతమైనది స్నేహం.మన మనసును ఎరిగిన వాడు స్నేహితుడు.బాల్యం నుంచి మొదలుకొని జీవితపు ప్రతి అడుగులో,ఎవరో ఒకరు స్నేహితుడి రూపంలో మన వెన్నంటే ఉంటారు.అమ్మానాన్నలు, భార్యా పిల్లలు ఉన్నా కూడా,వాళ్ళతో షేర్ చేసుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం.నిజం చెప్పాలంటే స్నేహితుడు నీ గుండె చప్పుడు.నీలోని మంచి,చెడులు,నీ ఆలోచనా విధానాన్ని,నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, అలజడిని,నీ వ్యసనాలను, వాటి పర్యవసానాలను,నీ మొదటి ప్రేమనీ,ఫలానా వ్యక్తి పై నీ అభిప్రాయాన్ని,నీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల మనస్తత్వాలను, వాళ్ళ యాక్షన్ రియాక్షన్ లను, స్నేహితుడు అమాయకుడు అయితే, అతడిని సరిదిద్దేది,అతడి లోపాలను ఎత్తి చూపేది, అతడిని సరైన మార్గంలో పయనించేలా చేసేది ఒక్క స్నేహితుడే.
                    విశ్వనాథ్ గారి,సాగర సంగమం
సినిమాలో,కమల్ హాసన్,శరత్ బాబు
ల మధ్య స్నేహం అనిర్వచనీయం.ఒక స్నేహితుడు చెడు అలవాట్లకు బానిసై, తిరుగుతున్న నేపథ్యంలో,తన తోనే చివరి వరకు ఉండి, స్నేహితుడిగా,తన బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, అతని బాగోగులు,తిండీ తిప్పల విషయంలో జాగ్రత్తలు తీసుకున్న,ప్రాణ స్నేహితుడి, పాత్రలో శరత్ బాబు అద్భుతంగా నటించారు.సినిమా ప్రారంభంలోనే, హీరోను,ఒక ఫెయిల్యూర్ వ్యక్తిగా చూపించడం, దానిని ప్రేక్షకులను, ఒప్పించడం, దర్శకుడి ప్రతిభకు తార్కాణం.రవీంద్రభారతిలో,ఒక నృత్య ప్రదర్శనను,ఒక పత్రికా విలేఖరిగా,కవర్ చేయడానికి వెళ్లిన హీరో, అక్కడ సదరు నృత్యకారిణి, పంచభూతములు ముఖ పంచకమై...అన్న చోట ఆంగీకం సరిగా ప్రదర్శించలేదనీ, అసంతృప్తితో, వార్త నెగిటివ్ గా రాస్తాడు.దాంతో,తన ఉద్యోగంతో పాటు,ఆ ఉద్యోగం ఇప్పించిన తన స్నేహితుడు శరత్ బాబు ఉద్యోగం కూడా పోతుంది,ఆ పత్రికలో శరత్ బాబు ప్రూఫ్ రీడర్ గా పనిచేస్తుంటాడు. ఎక్కడో ఏకాంతంగా పడుకున్న,తన స్నేహితుడిని, వెతుక్కుంటూ శరత్ బాబు, అక్కడికి వస్తాడు.అప్పటికే బాగా తాగి ఉన్న,తన ప్రాణం మిత్రుడిని చూసి,చీ నువ్వు బాగువడవురా! ఏదైనా వ్యాపకం ఉంటే బాగుపడతావనీ ఉద్యోగం ఇప్పిస్తే.......అయినా నువ్వెరివిరా,నా అన్నవా..తమ్ముడివా..ఏదో గాలి వాటం కలుసుకున్నాం...కలిసి బతుకుదాం అనుకున్నాం...కానీ నాకు సహనం చచ్చిపోయింది,అంటూ చీవాట్లు పెడుతాడు శరత్ బాబు.వెంటనే, హీరో,'మృతిలోన ముగిసినా,చితిలోన రగిలినా,కడతేరి పోనిది మధురానుబంధం..ఎదవీడి పోనిది,మమతానురాగం'..ఎంత గొప్ప కవిత్వం..రాసింది నా స్నేహితుడు.,అది నువ్వే రా! ఇంత గొప్ప కవికి, ప్రూఫ్ రీడర్ ఉధ్యోగమా..అసలు ప్రతిభను గుర్తించని,వాళ్ళననాలిరా.....ఏమన్నావ్..అరేయ్,ఒక్కసారేరా తెంచుకునేది.నేను చచ్చిపోయాక తలకొరివి పెడతావు, చూడు అప్పుడేరా... అంతవరకు నేనేం చేసినా భరించాల్సిందే,అని అంటాడు.స్వర్గీయ ఎస్పీబీ గారన్నట్లు, స్నేహం చేసేముందు, ఒకటి రెండు సార్లు ఆలోచించు... స్నేహం చేయడం ప్రారంభించాకా, తప్పు చేసినా,ఒప్పు చేసినా,ఆ స్నేహితుడిని జీవితాంతం భరించాల్సిందే.ఎంత ఉన్నతమైన మాట,ఆలా భరించే వాడే స్నేహితుడు.
హీరోను,శరత్ బాబు రిక్షాలో తన ఇంటికి తీసుకెళ్ళుతాడు‌.తీరా ఇంటికి వెళ్ళాక, శరత్ బాబు భార్య,ఆ రోజు కృష్ణాష్టమి అని, కృష్ణుడి పాదాలను, చాలా అందంగా వేసుకుంటుంది.కృష్టుడు రావాలని 
వదిన ఎంత అందంగా పాదాలను వేసుకుంది, నేను ఇంట్లోకి రాలేను, నువ్వు వెళ్ళారా అంటూ, గేటు బయటనే కూర్చుంటాడు,కమల్ హాసన్.ఆ తరువాత శరత్ బాబు భార్య భోజనం బయటకే తీసుకుని వచ్చి పెడుతుంది.
                అంతకు ముందు ఒక డాన్స్ డైరెక్టర్ దగ్గర కమల్ నుఅసిస్టెంట్ గా చేర్పిస్తాడు శరత్ బాబు.మంచి సాహిత్యానికి డాన్స్ ఖూనీ చేస్తున్నాడని,అది కూడా వదిలేస్తాడు కమల్.ఇలా అనేక సందర్భాల్లో తన స్నేహితుడి వెన్నెంటునే ఉంటాడు శరత్ బాబు.చివరికి స్టేజ్ మీద తన చేతుల్లోనే కమల్ చనిపోయే సన్నివేశం
చూస్తే,ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చక మానవు.
వీల్ చైర్ లో చనిపోయి ఉన్న కమల్ ని శరత్ బాబు ఆడిటోరియం బయటకు తీసుక రాగానే
వర్షం కురుస్తూ ఉంటుంది.ఆ వర్షంలో, స్నేహితుడు తడవకుండా ఉండేందుకు ప్రయత్నం చేసే సమయంలో
జయప్రద వచ్చి గొడుగు పట్టి తీసుకెళ్ళడంతో సినిమా
ముగుస్తుంది...సాగర సంగమం సినిమాలో హీరోతో సమానంగా దాదాపుగా శరత్ బాబు అన్ని సన్నివేశాలలో కనిపిస్తాడు.మన దురదృష్టం ఏమిటంటే ఇద్దరు మనుషుల మధ్య స్నేహాన్ని అద్భుతంగా సృష్టించిన దర్శకులు విశ్వనాథ్ గారు,లేరు.. ఆ పాత్రకు న్యాయం చేసి, అంతే అద్భుతంగా నటించిన శరత్ బాబు గారు కూడా లేరని
తెలిసి ఇంకా బాధ కలుగుతుంది.శరత్ బాబు ఒక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కొన్ని సినిమాల్లో విలన్ గా నటించి,విలక్షణ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.....💐💐🙏🙏
                                     
కామెంట్‌లు