అమ్మ ఒక పాలపుంత ;- కొత్తపల్లి ఉదయబాబుసికింద్రాబాద్
నాలో ఊహా బీజం మొలకెత్తేనాటికి
నాలుగు మమతల స్తంభాల
మా కుటుంబ మందిరంలో
నిలువెత్తు దేవత అమ్మ...


అమ్మ ఆచరణా సూత్రానికి
కాలగమనమే మూగబోయేది...
అరచి అరచి " గీ " పెట్టినా
నిద్రలేవని మా మొద్దు ముఖాల మీద...
పేడనీళ్ళ చర్నాకోలాతో కొట్టి లేపి
లక్ష్యానిర్దేశం చేస్తూనే
కార్యోన్ముఖురాలయ్యేది..." అమ్మ "

సూర్యోదయం కాకుండానే
మా పెరటి ఆవు - కామధేనువుకు
" అమ్మ " లేని లోటు 
తీర్చేదెవరనుకున్నారు? 
" అమ్మే "

ఆ ప్రేమమయి అమౄతహస్తం
తన పొదుగు నిమరగానే
ఒళ్ళు జలధరించి పాలాక్షతలతో
" అమ్మ " ను ఆశీర్వదించేది అమ్మ తల్లి...
నునుసిగ్గుతో అమ్మ పాలపుంత యై
విరిసిన మల్లెపూవయ్యేది...

మోర చాచిన లేగదూడ
గంగడోలును సృశించి
నొసట ముద్దాడి మురిపించి
పాలు తాపించే " అమ్మ " ను
మార్దవంగా చూస్తుంటే...
" అమ్మ " ఎవరికైనా " అమ్మే "!
అని ఒళ్ళు ఝల్లుమనేది...

మంచినీటి స్నానంతో 
మురికిని తొలగించుకున్న
మంచి ముత్యాల్లా
మెరిసిపోతున్న మాతో...
" అమ్మ " కన్నుల్లో మెరుపుకాంతులు
పోటీ పడిపోయేవి...

ఎర్రని కుంకుమ నుదుట ధరించి
" అమ్మ " నేర్పిన స్తోత్రాలు వల్లె వేస్తుంటే
వేదపారాయణ చేస్తున్న యజ్ఞ వాటికను
తలపించేది పొదరిల్లైన మా ఇల్లు...

ఆవకాయ ముద్దల్లో
మీగడ తరకలు నంజుతూ
గోరుముద్దలు అందించే " అమ్మ "
అన్నపూర్ణను మరిపించేది...

కట్టెలపొయ్యిలో పుల్లల్ని శిక్షిస్తూనే
ముందురోజు గడించిన మా విజ్ఞానాన్ని
ఒడిసిపట్టేది...ఒడగట్టేది...

ప్రేమిస్తూ...లాలిస్తూ...
" అమ్మ " దగ్గరకు తీసుకున్నప్పుడు...
అత్తిపత్తిలా పులకిస్తూ
ఆ చల్లని ఒడిలో ఒదిగిపోయినప్పుడు...
చెరుకురసం మామిడిపండు
జుర్రుతున్నట్టే ఉండేది...

తప్పు చేస్తే మాత్రం
చేతిలో దండం
కొరకంచై నాట్యమాడేది...
ఒంటిమీద పడే
ఆ దెబ్బల కణకణలకన్నా...
తుమ్మ ముల్లై గుండెను చీల్చినా
తప్పును ఎండగట్టే " అమ్మ " మాట
పశ్చాత్తాపాన్ని మిగుల్చుతూ
వెన్నపూస రాసిన గాయంలా
హాయిగా ఉండేది...

కష్టంలో ఉన్న సుఖాన్ని...
సుఖంలో ఉన్న దుఃఖాన్ని...
పసితనాన మాకు రాని
పనితనంలోనే నేర్పి...
అనుభవదైకవేద్యం చేసేది " అమ్మ "...

ఆ అనుభవ చిత్రాలను
మా జీవన సోపానాలుగా చేస్తూ
మమ్మల్ని బడికి పంపుతున్నప్పుడు
చంద్రుని వీడిన 
నక్షత్రంలా బాధగా అనిపించేది...

" బడి " వదిలి " గుడి " కి తిరిగివచ్చాకా....
డొక్కలు తడిమి సొట్టాలన్నీ నింపేసేది...
అసుర సంధ్య వేళ
అలసి సొలసి ఆరుబయట
నులకమంచంపై సేదతీరేవేళ...
మాతృభాషలోని మధురిమను...
పదాలుగా మార్చి...పద్యాలుగా కూర్చి
నుడికారపు రంగరింపుతో...
రాగతాళాల మేళవింపుతో...
పురాణాలు...ఇతిహాసాలు...
ప్రబంధాలు...కావ్యాలు...శతకాల
సాహితీ సుగంధాన్ని
మా నరనరాన మర్దించేది...

" అమ్మ " భాషలో జీవనదిలా 
ప్రవహిస్తూ....ప్రవహింపచేస్తూ...
జీవన సేద్యం చేస్తూ...
బ్రతుకునీడ్చుతున్న
ఈ ఆకుపచ్చని జీవితం
మాకు " అమ్మ " పెట్టిన
ఆశీసుల బిక్ష...!!
భావితరాలకు సదా శ్రీరామరక్ష...!!!
******* : *******


కామెంట్‌లు