సుప్రభాత కవిత ; - బృంద
పోగు చేసుకున్న ఆనందాల
అందాల చీర చుట్టుకుని
అల్లుకున్న పాలమబ్బుల
సంబరాల సందళ్ళు

వింతగా చూస్తున్న
నేలతల్లికి తగని విడ్డూరం
అంబరంలో అద్భుతం చూడ
అచ్చెరువాయెనట అవని మొత్తం

ఏ ప్రేమ సందేశం
ఎవరికోసం మోసుకొచ్చెనో!
ఏ మనసు పరిమళం
ఏ మదికి గుర్తు తెచ్చెనో!

రారమ్మని చెంతకు పిలిచి
తెమ్మెరతో స్నేహం చేసి
కమ్మలు చేతికి ఇచ్చి..
అందించి రమ్మని  పలికెనేమో!


వేచి ఉన్న మదిని
ఊరడించు  కబురు ఒకటి..
కాచుకున్న కనులనిండ
వెలుగునింపే వివరమొకటి..

దూరమైన మనసుపడే
వేదనంత పట్టుకెళ్ళి
వేచిన మదికి చేరవేయు
మా మంచి రాయబారిగా వచ్చెనేమో!

తల్లి మనసు కుదుటపడే
కమ్మని కబురందచేసి
చిన్నపిల్ల బెంగనంత
కన్నతండ్రికి అందచేయునేమో!


కోటి ఆశలు తీర్చే క్షణాల మోపు
మనసులో వెతలన్ని రూపుమాపు
నడిపించును కలల తీరం వైపు
మనకందరికీ వరంగా రాబోతున్న రేపు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు