సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -146
ప్రధాన మల్లని బర్హణ న్యాయము
******
ప్రధాన అనగా ముఖ్యమైన.మల్లని అనగా శ్రేష్టుని,బలిష్టుని,వీరుని అని అర్థం.బర్హ అంటే గాయ పరచు,చంపు, నాశము చేయు అనే అర్థాలు ఉన్నాయి.
ప్రధాన మల్లని బర్హణము అంటే ముఖ్యమైన వీరుని లేదా శ్రేష్టుని, బలిష్టుని గాయ పరచడం లేదా చంపడం అని అర్థం.
సేనాధిపతిని ఓడించినచో సేన అంతా లొంగునట్లుగా, బాగా పేరు గల జెట్టిని/ వీరుని గెలిచినచో తక్కిన వారందరూ పరాజితులే అవుతారు అనే అర్థంతో ఈ "ప్రధాన మల్లని బర్హణ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఇది యుద్ధ నీతి లాంటిది దీనిని అనేక సందర్భాల్లో ఉపయోగించడం చూస్తుంటాం.
తరగతి గదిలో పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే ఎవరో ఒకరు దొరికిపోయి టీచర్ తిట్లు,దండనకు గురవుతారు.అలా ఒక్కరిని అదుపులో పెడితే తక్కిన విద్యార్థులంతా గప్ చుప్ గా ఉంటారు.
 సమ్మెలు, హర్తాళ్ల సమయంలో ముఖ్యమైన నాయకులను ముందుగా అధీనంలోకి తీసుకుంటారు.
 నాయకత్వం లేక పోవడం వల్ల మిగిలిన కార్యకర్తలు భయపడటం,వెనక్కి తగ్గడం,చెల్లా చెదురవ్వడంతో  పోరాట ఉదృతి తగ్గి పోతుంది.
ఈ న్యాయాన్ని వ్యక్తులకు అన్వయించి చూస్తే తప్పుదారి పట్టిన మనసే మనకు ప్రధాన శత్రువు. అరిషడ్వర్గాలతో  చేయి కలిపి మనిషిని అధఃపాతాళంలోకి నెట్టేస్తుంది.వ్యక్తిత్వాన్ని అధోగతి పాల్జేస్తుంది.అస్తిత్వాన్ని నామరూపాలు లేకుండా చేసి ఉనికిని ఉరికొయ్య ఎక్కిస్తుంది.
 కాబట్టి అంత తొందరగా లొంగని మనసనే యోధుని  ముందుగా జయిస్తే, కూడా ఉన్న అన్ని ఇంద్రియాలను, అరిషడ్వర్గాలను జయించవచ్చని ఈ "ప్రధాన మల్లని బర్హణ న్యాయము" ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు