పనికిరానిది ఏముంది గురూ ప్రపంచంలో (పునఃకథనం- డా.ఎం.హరికిషన్)
  ఒక అడవిలో రెండు కుందేళ్ళు పోతూ వున్నాయి. ఒకటేమో నల్లది. రెండోదేమో తెల్లది. నల్లకుందేలు చాలా తెలివైంది. తెల్లకుందేలు తెలివి తక్కువది. ఆ కుందేళ్ళకు దారిలో ఒకచోట ఒక తప్పెట కనబడింది. నల్లకుందేలు “ఆహా భలేగుందే" అంటూ పరుగెత్తుకుంటూ పోయి తప్పెట తీసుకుంది. అది చూసి తెల్లకుందేలు “ఏయ్... ఏంటది... పారేయ్ ఆ పనికిరానిదాన్ని" అంది. నల్లకుందేలు నవ్వుతూ “మామా... ఈ లోకంలో పనికిరానిదంటూ ఏదీ వుండదు. అన్నీ పనికొచ్చేవే" అంది. 
అవి రెండూ కొంచం దూరం పోయేసరికి ఒకచోట రెండు జిరాఫీ పిల్లలు అల్లరి చేసినందుకు వాళ్ళమ్మ కొట్టిందని ఏడుస్తూ కనిపించాయి. నల్లకుందేలు వాటి దగ్గరకు పోయి తప్పెట తీసుకొని మధురంగా వాయిస్తా పాట పాడసాగింది. అది చూసి అవి ఆనందంగా కిందామీదా పడి నవ్వాయి. వాటి ఏడుపంతా ఎగిరిపోయింది. 
కుందేళ్ళు రెండూ కొంచం దూరం పోయేసరికి ఒక్కసారిగా పెద్ద వాన మొదలైంది. చుట్టూ ఎక్కడా పెద్దచెట్టు ఒక్కటి గూడా కనబడలేదు. నల్ల కుందేలు వెంటనే తడవకుండా చేతిలో ఉన్న తప్పెట నెత్తి మీద పెట్టుకుంది. తెల్లకుందేలుకు ఏమి చేయాలో తెలియక అలాగే వానలో తడుచుకుంటూ వణుక్కుంటూ బైలుదేరింది. 
ఆ కుందేళ్ళు రెండూ అలా కొంతదూరం పోగానే వాటికి ఒక నది అడ్డం వచ్చింది. దానిని ఎలా దాటాలో తెలీక తెల్లకుందేలు గొంతు లోతు నీళ్ళలోకి నెమ్మదిగా దిగి భయపడుతా భయపడుతా అవతలికి చేరింది. నల్లకుందేలు కాసేపు ఆలోచించి చేతిలోని తప్పెటను నీళ్ళ మీద పడవలాగా పెట్టి దానిమీద కూర్చోని చేతులతో నీళ్ళను తోసుకుంటూ అవతలికి చేరుకొంది. 
అలా ఆ కుందేళ్ళు రెండూ పోతూ వుంటే ఒకచోట వాటికి ఎదురుగా ఒక పెద్ద పులి వచ్చింది. దానిని చూసి ఆడిరిపడి అవి రెండూ పరుగెత్తుకుంటూ పోయి ఒక పొదలో దాక్కున్నాయి. కానీ ఆ పెద్దపులి వాటి వాసన పసిగట్టి ఆ పొద దగ్గరకు రాసాగింది. తెల్లకుందేలు భయంతో ఏం చేయాలో తెలియక వణికిపోసాగింది. ఇక ఈరోజుతో చావడం ఖాయం అనుకుంటా కళ్ళు మూసుకొంది. నల్లకుందేలు దానిలా తెలివి తక్కువది కాదుగదా... ఆ పెద్దపులి నుంచి ఎలా తెప్పించుకోవాలా అని బాగా ఆలోచించసాగింది. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పక్కనున్న ఒక కట్టెపుల్ల తీసుకొని పులి పొద దగ్గరకు రాగానే తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా తప్పెట మీద ధనధనధనమని చెవులు బద్దలయ్యేలా వాయించసాగింది. అంతే... ఆ భయంకరమైన చప్పుడుకు అదిరిపడిన పులి ఆ పొదలో ఏముందో ఏమో అని వణికిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. అలా నల్ల కుందేలు తెలివి తేటలతో అవి రెండూ ప్రాణాలతో బైట పడ్డాయి.
*********

కామెంట్‌లు