సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -124
పంక ప్రక్షాళన న్యాయము
******
పంకము అంటే బురద, పాపము అనే అర్థాలు ఉన్నాయి. ప్రక్షాళన అంటే కడుగుట.
పంక ప్రక్షాళన అంటే  బురద కడుగుకోవడం అని అర్థం.
" దీనినే తెలుగులో అడుసు తొక్క నేల? కాలు కడుగనేల?" అంటారు. బురద ముట్టుకుంటే అంటుకుంటుందని తెలుసు కదా!.అది తెలిసి కూడా దాన్ని తొక్కడం ఎందుకు? ఆ తర్వాత అంటుకుందని బాధపడి కడుక్కోవడం ఎందుకు? అనేది సామాన్య అర్థం.
దీనినే ఇంకొంచం లోతుగా అధ్యయనం చేసి చూస్తే "తెలిసి తప్పు  చేయడం ఎందుకు? ఆ తర్వాత బాధ పడటం ఎందుకు?" అనేది అసలైన అర్థం.
దీనినే అనేక కోణాల్లో చూడవచ్చు. కొంతమంది ఏదైనా మాటా మాటా పెరిగి నప్పుడు సంయమనం పాటించకుండా పెద్దా చిన్నా అనే గౌరవ మర్యాదలు మరిచి, పటాపటా పరుషమైన మాటలు నోటికి ఎంతొస్తే అంత అనేస్తారు.ఆ తర్వాత' అయ్యో ! అని  బాధ పడతారు.క్షమాపణలు కోరుతుంటారు.
అలాంటి సందర్భాల్లో పెద్దవాళ్ళు అనే మాట ఇదే "అడుసు తొక్క నేల? కాలు కడగ నేల? అని.
కాబట్టి  తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి.ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు పూర్వాపరాలు ఆలోచించి అడుగు వేయాలి.అమర్యాద మాటలు, అనాలోచిత చర్యలు వ్యక్తి పట్ల అప్పటి వరకు ఉన్న  సదభిప్రాయాన్ని పోగొడతాయి. 
తెలియక చేసిన తప్పును ఎదుటి వారు అర్థం చేసుకుని క్షమించే అవకాశం ఉంటుంది గాని తెలిసి చేసే తప్పులను ఎవరూ క్షమించరు.అది క్షమించరాని తప్పు/ నేరము కూడా.
 దీనికి సరితూగేలా వేమన కవి వ్యంగ్యంగా రాసిన ఓ పద్యాన్ని చూద్దాం.
"నీళ్ళ మునగ నేల? నిధుల బెట్టగ నేల?/ మొనసి వేల్పులకును మ్రొక్క నేల?/ కపట కల్మషములు కడుపులో నుండగా/ విశ్వధాభిరామ వినురవేమ!"
" కడుపులో కపటము, కల్మషము పెట్టుకుని,దాన ధర్మాలకని డబ్బు నిల్వ చేయడం,పుణ్య స్నానాలు చేసి దేవునికి మొక్కినంత మాత్రాన ప్రయోజనం లేదు. ముందే ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ఉంటే మంచిది కదా!'' అంటాడు.
 నిజమే కదా! దుష్టబుద్ధితో తప్పులు,పాపాలు చేసి వాటిని పోగొట్టుకోవడానికి ఇలాంటి పనులు చేస్తే పుణ్యం వస్తుందా? రాదు కాబట్టి ముందే అలాంటి చెడు పనులకు దూరంగా ఉండాలనే అర్థంలో ఈ 'పంక ప్రక్షాళన న్యాయమును' ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు