ముఖ పద్మము;- "కవి మిత్ర" శంకర ప్రియ.,-సంచార వాణి: 99127 67098
 🔆 "అందమైన ముఖము"ను
 "పద్మము వంటిది"యని
     వర్ణించెదము మనము
 ఓ సుమతీ,! ఓజోవతి! 
         (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🪷"పద్మము" అనగా తామర పువ్వు! అది సూర్యోదయమైన వెంటనే.. కళకళ లాడుతూ వికసిస్తుంది! అందరినీ ఆహ్లాదపరుస్తుంది! దానికి.. కమలము, పంకేరుహము, పంకజము, సరసిజము, అంబుజము... అని, మున్నగుపేరులు కలవు! మన భారతీయ వాఙ్మయంలో "తామర పూవును" ఎన్నో ఉపమానాలతో పేర్కొను చున్నారు! 
🪷ఇష్ట దేవతారాధన లో.. పరమేశ్వరుని యొక్క దివ్య శరీరాంగములను వర్ణించేటప్పుడు.. ఒక గౌరవ ప్రదమైన ఉపమానంగా వాడతారు. అందువలన, "కమలేక్షణ" అంటే పద్మము వంటి కన్నులు; "కర కమలము" అంటే పద్మము వంటి చేతులు; "పాద పద్మము" అంటే తామర పూవు వంటి కాళ్ళు .. అని, భావార్ధము! అదే విధంగా అందమైన, సుందరమైన ముఖమును.. పద్మముగా, "లక్ష్మీ కళ"గా అభివర్ణించు చున్నాము! ఈ సందర్భములో.. సమస్య.. పూరణ పద్యములు పరిశీలించండి!
 ⚜️"ఒక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే!" 
... అనే సమస్యకు, చక్కటి పూరణ పద్యము! సాహితీ ప్రియులైన దంపతుల సరస సంభాషణము.. మత్తేభ విక్రీడితము!
🪷 "అకళంకోజ్జ్వల సుందరీమణి! అహో! ఆనంద మందాకినీ ! 
      "ఒక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే ! "
     సుకవీంద్రుండగు నాథు బల్కులకు నా చొక్కంపు టిల్లాలనెన్ 
     "ఇక చాలున్ ; ముఖపద్మమున్ కనులనా యీరీతి వర్ణించుటల్ !! "
        ( రచన: జంధ్యాల జయకృష్ణ బాపూజీ.,)
           ********
⚜️"పువ్వులోన రెండు పువ్వు లమరె!" 
... అనే సమస్యకు.. పూరణ పద్యము.. ఆట వెలది
🪷పడతి మోము జూడ, పద్మమై విరియగా
     కన్నులేమొ, రెండు కలువలాయె,
      అనుచు కవియె తెలిపె, నద్భుతముగ నిట్లు
     "పువ్వులోన రెండు, పువ్వు లమరె"
     ( రచన: విరించి.,)

కామెంట్‌లు