'పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించండి'; -కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్


 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య, సకల సౌకర్యాలతో పాటు విశేష అనుభవం కలిగిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేయబడుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ అధ్యక్షుడు నూనేటి సంపత్ కుమార్ యాదవ్ కోరారు. మంగళవారం ఉదయం ఆయన మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 15 లక్షల విలువైన ఫర్నిచర్, పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాఠశాల పిల్లలకు ఉచిత యూనిఫాం, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. 'మన ఊరు మనబడి పథకం' కింద తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తయారుచేసి, సకల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే గొప్పగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయని, తల్లిదండ్రులు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకుండా వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎంపీపీ కోరారు. అనంతరం వైస్ ఎంపీపీ జూకంటి శిరీష అనిల్ మాట్లాడుతూ... పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా పిల్లల్ని  అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఒత్తిడి లేని, స్వేచ్ఛపూరిత వాతావరణంలో విద్యాబోధన జరుగుతోందని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లని చేర్పించాలని ఆమె కోరారు.  దీనికంటే ముందు ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు గ్రామవీధుల్లో ఊరేగుతూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను గురించి నినాదాలు చేశారు. తర్వాత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి, పాఠశాల నాడు, నేడు స్థితిగతులను వివరించారు. పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేసి పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, ఉపసర్పంచ్ సుధాటి కరుణాకర్రావు, ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీఓ గోవర్ధన్, ఏఈ జగదీశ్వర్, ప్రధానోపాధ్యాయులు వై. రమేష్, ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, గ్రామ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు