ఆకలితో మాడకూడదు న్యాయమూర్తి విచిత్ర తీర్పు!;- - యామిజాల జగదీశ్
అతను పదిహేనేళ్ళ కుర్రాడు. ఓ బేకరీలో బ్రెడ్డు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. బేకరీ యజమాని అతనిని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు కుర్రాడిని న్యాయస్థానానికి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు నిలబెట్టారు.

న్యాయమూర్తి విచారణ మొదలుపెట్టారు. 

"బ్రెడ్డు దొంగిలించేవా?" అని న్యాయమూర్తి అడిగారు. 

కుర్రాడు తల దించుకుని "అవున"న్నాడు.

న్యాయమూర్తి : ఎందుకు?

కుర్రాడు : ఆకలివేసింది.

న్యాయమూర్తి : బ్రెడ్డు కొనుక్కోలేవా?

కుర్రాడు : డబ్బులు లేవు.

న్యాయమూర్తి : ఇంట్లో మీ అమ్మనో నాన్ననో డబ్బులు అడగాల్సిందిగా.

కుర్రాడు : ఇంట్లో అమ్మ మాత్రమే ఉంటుంది. అమ్మ ఆరోగ్యం బాగులేదు. పైగా పనులేమీ చేయలేని స్థితి. నాన్న లేడు.

న్యాయమూర్తి : నువ్వేదైనా పని చేయవలసిందిగా.

కుర్రాడు : నేనొక చోట ఓ చిన్నపాటి పని చేస్తున్నాను.  అమ్మను చూసుకోవడం కోసం ఓ రెండు రోజులు లీవు పెడితే పనిలో నుంచి తీసేసారు.

న్యాయమూర్తి : ఎవరినీ సాయమడగలేదా?

కుర్రాడు : ఇంట్లో నుంచి బయటికొచ్చి కనీసం ఓ యాభై మంది దగ్గరైనా చెయ్యి చాచాను. కానీ ఎవ్వరూ సాయం చేయలేదు. కనుక బేకరీలో వీలైతే దొంగిలించాలనుకున్నాను. పట్టుకున్నారు.

ఆ తర్వాత న్యాయమూర్తి మరో ప్రశ్నంటూ అడగలేదు. 

కాస్సేపు తర్వాత న్యాయమూర్తి తన తీర్పు వెల్లడించారు. 

"ఆకలితో ఉన్న ఈ కుర్రాడు బేకరీలో బ్రెడ్డు దొంగిలించడం నేరమే. కానీ ఈ నేరానికి మనమందరం బాధ్యత వహించాలి. నాతో సహా ఇక్కడీ న్యాయస్థానంలో ఉన్న వారందరం నేరస్తులమే. మనమందరం తప్పు చేసినట్లే అవుతుంది. కనుక ఇక్కడున్న అందరూ తలో పది డాలర్ల అపరాధం చెల్లించాలి. పదేసి డాలర్లు ఇవ్వకుండా ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఆ అపరాధ సొమ్ముని ఈ కుర్రాడికివ్వాలి" అంటూ న్యాయమూర్తి తన చొక్కా జేబులోంచి పది డాలర్లు తీసి ఓ కాగితం మీద పేరు రాసారు. ఆందరూ పదేసి డాలర్లిచ్చారు. అంతేకాదు, బ్రెడ్డు దొంగిలించాడని కుర్రాడిని పోలీసులకు పట్టిచ్చిన బేకరీకి వెయ్యి  డాలర్ల జరిమానా వేసారు. ఇరవై నాలుగ్గంటల్లోపల ఆ జరిమానా కట్టకుంటే బేకరీకి సీలు వేయిస్తామన్నారు. 

అలాగే ఆకలితో మాడుతున్న కుర్రాడిని పట్టుకుని న్యాయస్థానానికి తీసుకొచ్చిన పోలీసు శాఖకు వెయ్యి డాలర్ల జరిమానా విధించారు. వెయ్యి డాలర్ల జరిమానాను కుర్రాడికి ఇచ్చి క్షమాపణలు కోరాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ తీర్పు విన్నవారందరూ కంగుతిన్నారు. కొందరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. కుర్రాడి చేతికున్న సంకెళ్ళు తొలగించారు. కుర్రాడు న్యాయమూర్తి వంకే చూస్తూ నిల్చుండిపోయాడు.

ఆకలితో మాడుతున్న ఓ మనిషి ఆహారం కోసం దొంగతనానికి పాల్పడ్డాడంటే అందుకు ఆ దేశ ప్రజలు సిగ్గుపడాలి.

ఈ సంఘటన మీ హృదయాన్ని కలచి వేసినట్లయితే చేతనైన సాయం చేయడానికి ఉపక్రమించండి. ఆకలితో ఏ ఒక్కరూ నలిగిపోకూడదన్నారు న్యాయమూర్తి.


కామెంట్‌లు