'కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలి';- - ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య


 సమాజంలో పేద, ధనిక అనే భేదం లేకుండా అన్ని కులాలు, మతాలు, వర్గాల వారు ఒకే దగ్గర కలిసి చదువుకునే 'కామన్ స్కూల్ విద్యా విధానాన్ని' అమలు చేయాలని కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా సమాజంలో సమానత్వ భావనను  పెంపొందిస్తుందన్నారు. సోమవారం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కాల్వశ్రీరాంపూర్ గ్రామంలో ఉపాధ్యాయినులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, సౌకర్యాలు, ప్రత్యేకతల గురించి ఆయన పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. పిల్లల్ని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలను పొందాలని ఆయన పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... విద్య, వైద్యం ప్రైవేటుపరం కాకూడదని, అది భవిష్యత్ తరాలకు అంత క్షేమకరంకాదన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన, శాస్త్రీయ విద్యతో పాటు డిజిటల్ పరికరాలతో సాంకేతిక విద్యా బోధన అందుబాటులోకి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, పిల్లల తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒకటి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, దీనివల్ల పిల్లల్లో మానసిక, శారీరక వికాసంతో పాటు ఎలాంటి ఒత్తిడి, సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందుతుందన్నారు. అందుకే తన ఇద్దరు పిల్లల్ని పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు