మా అమ్మకు మేం ముగ్గురం. నేనూ, మా అన్న రామ్మోహనూ, అక్క శ్రీదేవి. ముగ్గురిలోకీ నేనే చిన్నోన్ని. అదే నా చావుకొచ్చింది. ఇప్పుడు చూడ్డానికి పెద్ద రౌడీలెక్క బలంగా వున్నాను గానీ... అప్పట్లో అమాయకంగా సన్నగా వుండేటోన్ని. మా అన్నా, అక్కా ఇద్దరూ చెప్పిన పని చెయ్యకుంటే కానిదానికీ, అయినదానికీ నన్ను మెత్తగా కిందామీదా యేసి తన్నేటోళ్ళు. పుడ్తే యింట్లో పెద్దపిల్లోని లెక్క పుట్టాలగానీ సన్న పిల్లోని లెక్క పుట్టనే పుట్టగూడదు. నాకుగూడా ఒక తమ్ముడో... చెల్లెలో వుంటే ఎంత బాగుండు తన్నుకోడానికని తెగ బాధపడేటోన్ని.
మా అమ్మకు లోకమంటే చానా కోపం. తండ్రి లేని పిల్లోళ్ళు కంచెలేని చేన్లలాంటోళ్ళు. వాళ్ళు చచ్చినా బాగుపడరు అనేటోళ్ళు జనాలు. అందుకని మా అమ్మ ఎట్లయినా సరే మమ్మల్ని ప్రయోజకుల్ని చేసి చూపాలని రెసిడెన్షియల్ హాస్టల్లో వార్డెన్ లెక్క తెగ క్రమశిక్షణగా పెంచేది. అడుగడుగునా అడ్డుగీతలే. వూ అనాలన్నా ఆ అనాలన్నా అడిగి చేయాల్సిందే. నా మాటకు ఏ మాత్రం విలువుండేది కాదు. దాంతో నాకు నెమ్మదిగా ఆ ఇల్లన్నా, అమ్మన్నా అసహ్యం పెరిగిపోయింది. జైల్లో వున్నట్టుండేది.
స్కూల్లో గూడా అంతే... అందరూ యముళ్ళే. ఒక్కొక్కడూ రూళ్ళకర్ర పట్టుకోని వూకూకెనే చిన్న చిన్న దాండ్లకే పిర్రల మీద రపారపా పెరికేటోళ్ళు. ''ఎందుకట్లా ఇంట్లో, స్కూల్లో తన్నులు తింటా బతకడం'' అనే ఆలోచన పెరిగిపోయింది. ఆ ఆలోచనల్లోనే చలపతి, వర్ధన్, బద్రిగాళ్ళు కూడా జతయినారు. వాళ్ళిండ్లల్లో గూడా పోలీసులు దొంగల్నెంత మర్యాదగా చూసుకుంటారో అంతే మర్యాదగా వాళ్ళను చూసుకుంటున్నారంట. దాంతో మా నలుగురికీ ఈ ఇండ్లొదిలి యాడికైనా పారిపోయి బతకడమే మేలనిపించింది.
దాంతో... అందరమూ సంచులు ఆన్నే పారనూకి లేసినాం. పోవాలంటే డబ్బులు కావాలి గదా. బద్రిగాడు, చలపతిగాడు వాళ్ళ నాయనోళ్ళ జేబుల్లో చేతులెట్టేసినారు. నాకూ మా అన్నకు మా అమ్మ పర్సులో చిల్లర మాయంచేసే శక్తుందని తెలుసుకున్న మా అమ్మ దాన్ని మట్టసంగా బీరువాలో పెట్టేసేది. దాంతో నాకు యాడా డబ్బులు దొరకలేదు. దాంతో వర్ధన్‌గాడు నేను బాగా సంపాదిచ్చినాక తిరిగిస్తాననే మాట మీద యాభై రూపాయలు అప్పిచ్చినాడు. నలుగురం ఒకచోటకి చేరుకున్నాం. అంతలో ఎట్లా తెలిసిందో ఏమోగానీ వర్ధన్ వాళ్ళన్నొచ్చి వాన్ని గట్టిగా కర్సుకున్నాడు. మిగతా ముగ్గురం జింక పిల్లల్లెక్క ఆన్నించి తప్పించుకోని పారిపోయినాం.
బస్సైతే టికెట్లు కొనాల గదా... అందుకే రైలెక్కేసినాం. ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వస్తారేమోనని గుండె గుబగుబలాడింది. ఎవరూ రాకముందే రైలు వూరు దాటింది. కిటికీల నతుక్కోని పరుగెత్తుతున్న పంటచేలనూ, ఎగురుతున్న పక్షులనూ, కదులుతున్న వూర్లనూ చూస్తావుంటే మనసు గువ్వలెక్క ఎగిరిపోయింది. సంబరం సంబరం గాదు. అట్లా పోయీ... పోయీ... రైలు గుంతకల్లు జంక్షన్లో ఆగింది. ముగ్గురమూ దిగినాం.
గుంతకల్లు రోడ్ల మీద యాడజూసినా ఆకాశమెత్తు కటౌట్లు కొత్త సినిమాలవి కనబన్నాయి. హోటళ్ళో టిఫిను తిని వూరంతా తిరిగీ తిరిగీ అలసిపోయి చీకటి పడేసరికి స్టేషనుకు చేరుకున్నాం. ప్లాట్‌ఫాం పైన్నే పడుకోవాలని అనుకున్నాం.
అంతలో మా బద్రిగాడు ''రేయ్... ఈడ దొంగలుంటారు. పన్నుకున్నాక మట్టసంగా మనకి తెలీకుండా నున్నగా నూక్కపోతారు. జాగ్రత్తగా వుండాలరా'' అన్నాడు. ఆ మాటలినగానే అదిరిపడి ''మరి డబ్బులెట్లారా'' అన్నాం నేనూ, చలపతి. దానికి బద్రిగాడు ''అన్నీ నాకియ్యండి... నాకు నిక్కర్లోపల దొంగ జేబుంది. దాంట్లో దాచిపెడ్తా'' అన్నాడు. సరేనని ఇద్దరమూ అణాపైసలతో సహా వూడ్చి వానికిచ్చి పన్నుకున్నాం.
పొద్దున్నే లేసి చూస్తే ఇంగేముంది... పక్కన చలపతిగాడున్నాడు గానీ బద్రిగాడు లేడు. యాడన్నా తిరుగుతున్నాడేమోనని కాసేపు అటూ యిటూ చూస్తూ కూచున్నా. కానీ ఎంతసేపైనా యాడా కనబళ్ళేదు. అనుమానమొచ్చి చలపతిగాన్ని లేపినా. ఇద్దరమూ స్టేషను ఆ మూలనుండి ఈ మూల వరకూ పోలీసుకుక్కల్లా వెదికినాం. నెమ్మదిగా మాకర్థమైపోయింది. వాడు మాకు మస్కాకొట్టి డబ్బుల్తో చెక్కేసినాడని. జీవితంలో అదే మొదటి వెన్నుపోటు. విలవిలలాడినా.
ఆకల్తో కడుపు నకనకలాడ్తా వుంటే రోడ్డు మీద బన్నాం. ''రేయ్... నువ్వో పక్కా నేనో పక్కా పోయి పనెతుక్కుందాం... రాత్రి మళ్ళా స్టేషన్ కాడ కలుసుకుందాం'' అని చెరో పక్కా విడిపోయినాం. ఎక్కడని వెదకాల, ఎవర్నని అడగాల రెండు మూడు షాపుల్లో అడిగితే ''లేదు లేదు'' అన్నారు.
ఎవనికైనా ముందుగా కావాల్సింది కడుపుకింత తిండే గదా. అందుకని ఒక పెద్ద హోటల్ కాడికి పోయినా. వాడు నా మొగం చూసి ఒక క్షణం ఆలోచించి ''సరే... చేరు'' అన్నాడు. జీతం గీతం ఏమీ మాట్లాడలేదు. తిండి దొరికితే చాలురా భగవంతుడా అనుకున్నా. లోపల అంతా నాలాంటి పిల్లలే. పెద్దోళ్ళు తక్కువ. ఒకడు నేను చేయాల్సిన పని చెప్పినాడు.
జనాలు తిన్న అన్నం పళ్ళాలన్నీ బకెట్లో ఏసుకోని జాలాడి దగ్గర ఏసి రావాల. టేబుళ్ళు ఎప్పటికప్పుడు తుడ్చి పెట్టాల. పని మొదలు పెట్టినా. క్షణం తీరిక లేదు. తిరిగీ తిరిగీ కాళ్ళు నొప్పి పెట్టినాయి. ఇండ్లు గుర్తుకొచ్చి కండ్లలో నీళ్ళు తిరిగినాయి. కానీ ఇంటి మీద అసహ్యం మాత్రం తగ్గలేదు. మాధ్యాన్నం ఏదో ఇంత తిని మరలా పనిలోకెక్కినా. రాత్రి పదైంది. అంతవరకూ పనేపని. అందరూ ఎల్లిపోయినారు. నాతోటి పని పిల్లలు కొందరిండ్లకు పోయినారు. కొందరు మిద్దెక్కి పండుకున్నారు. నేనూ పండుకోడానికి మిద్దెక్కుదామని పోతావుంటే యజమాని నన్ను పిల్చి కాల్వంతా శుభ్రం చేయమన్నాడు. తిని పారేసిన ఎములు, అన్నం మెతుకుల్తో కంపు కొడ్తా వుంది. మట్టసంగా కిక్కురుమనకుండా శుభ్రం చేసినా. పనైపోగానే పోయి బండలమీద వాలిపోయినా. దిండులేనిదే నిద్రరాని నాకు... ఎట్లా వచ్చిందో ఏమో... కండ్లు క్షణాల్లో మూసుకుపోయినాయి.
పొద్దున్నే దబదబా లేపుతావుంటే అదిరిపడి లేచినా. ఎదురుగా హోటల్ యజమాని. ''లే... లే... పోయి హోటలంతా శుభ్రంగా తుడ్చు'' ఆజ్ఞాపించినాడు. ఇంకా చుట్టూ చీకటే. పక్షులు గూడా గూళ్ళు వదల్లేదు. గబగబా లేసినా. బకెట్లో నీళ్ళు పట్టుకోని బండలన్నీ అద్దం లెక్క తుడిచినా. ఆ క్షణం నుండి మరలా చీకటి పడేంతవరకూ క్షణం తీరిక లేకుండా పనేపని. తర్వాత రోజు మద్యాన్నం టేబుల్ తుడుస్తావుంటే ''రేయ్... హరీ'' అనే పిలుపు వినబడింది. చూస్తే ఎదురుగా చలపతి. కండ్లలో నీళ్ళు తిరిగినాయి.
''రేయ్... రెండ్రోజుల నుండీ రాత్రి స్టేషన్ కాడ వెదికీ వెదికీ చస్తున్నా... నువ్వు గూడా బద్రిగాని లెక్క జెండా ఎత్తేసినావేమో అనుకున్నా'' అన్నాడు. నేను కండ్లలో నీళ్ళు సరసరా కారిపోతావుంటే ''వద్దామనుకున్నారా... కానీ ఈడ పని పూర్తయ్యేసరికి సందమామ నడినెత్తికోస్తా వున్నాడు'' అంటూ అక్కడ చేస్తున్న పనంతా చెప్పినా. దానికి వాడు ''ఐతే... ఈడొద్దులే. నా ఎంబడి రా. నాకో చిన్న టిఫిను సెంటర్లో దొరికింది. మాయజమాని కూడా చానా మంచోడు. నేను చెప్తా. నువ్వు గూడా అన్నే వుందువు గానీ'' అన్నాడు. అప్పటికప్పుడు ఆ హోటల్ వదిలేసి వానెంబడి అట్లే ఎల్లిపోయినా.అది టిఫెను సెంటరు. నేనూ, మా చలపతి గాక, వంట మాష్టారు, యజమానీ వుండేటోళ్ళు. యజమాని చానా మంచోడు. ఆడతా పాడతా కాలం సంతోషంగా గడిచిపోసాగింది. నాల్రోజులకే యజమానికి మా మీద నమ్మకం పెరిగిపోయింది. నాకు బిల్లులేయడానికి అవసరమైన లెక్కలు బాగా వచ్చు కాబట్టి గల్లా పెట్టి దగ్గర కూచోబెట్టి పనుల మీద తిరుగుతుండేటోడు. మా జీతం తిండీ తిప్పలు పోను నెలకు అరవై. చేతికి ముప్పై ఇచ్చి, మిగతా ముప్పై నాదగ్గరే దాచిపెడ్తా. మీకు అవసరమైనప్పుడు తీసుకోండి అన్నాడు.
నేనూ. చలపతి రాత్రిపూట కలలు కనేటోళ్ళం. తొందర్లో వంటలు చేయడం అన్నీ నేర్చేసుకోవాలనీ, దాచిపెట్టిన డబ్బుల్తో సొంతంగా హోటల్ పెట్టాలనీ, బాగా సంపాదించినాక ఇంటికి పోవాలనీ, అంతవరకు ఇంటి గడప కూడా తొక్కగూడదనీ... ఏవేవో ఆలోచనలు. ఇంటికి పోవాలని మాత్రం ఇద్దరికీ ఎప్పుడూ అనిపించలేదు.
బద్రిగాడు మా డబ్బులు నూకేసి పారిపోయినాడు గదా... వాడు డబ్బులన్నీ బపోయేదాకా బాగా తినీ, తిరిగి మళ్ళా మట్టసంగా కర్నూలుకి చేరుకున్నాడు. వాడొచ్చిన విషయం తెల్సుకున్న మా అమ్మ, చలపతి గాని నాయన వాన్ని పట్టుకోని మేం గుంతకల్లులో దిగినేది తెల్సుకున్నారు. మా అన్న ఒక రోజంతా వూరంతా వెదికీ వెదికీ ఎవరూ కనబడక వెళ్ళిపోయినాడంట.
ఒకరోజు చలపతిగాని అన్న మమ్మల్ని వెదుకుతా... వెదుకుతా.. ఆడికి చేరుకున్నాడు. వాళ్ళన్నను అంత దూరం నుండే గుర్తుపట్టిన చలపతిగాడు నన్ను ఎచ్చరించి జారుకున్నాడు. నేను వాళ్ళన్నను గానీ, వాళ్ళన్న నన్నుగానీ ఎప్పుడూ చూళ్ళేదు. టిఫిన్ సెంటర్లో నేనొక్కన్నే గల్లా పెట్టి దగ్గర కూచున్నా. ఆయన నా దగ్గర కొచ్చి "కర్నూలు నుండి ఇద్దరు పారిపోయొచ్చి ఇక్కడెక్కడో హోటళ్ళో పన్చేస్తున్నారంట. నీకేమైనా తెల్సా" అనడిగినాడు. నేనేమీ తొణక్కుండా “ఏమోబ్బా... నాకు తెలిసీ ఈ సందులో ఎవరూ అట్లాంటోళ్ళు లేరు'' అని టోకరా ఇచ్చినా. ''అలాగా'' అని ఆయన ఎల్లిపోయినాడు. చలపతిగాడు, నేనూ ఆ విషయం చెప్పుకోని చెప్పుకోని ఆ తర్వాత కిందామీదా పడి నవ్వుకున్నాం.
కానీ ఆ దేమునికి మా మీద దయలేదు. మేం సంతోషంగా వుంటే కన్నుకుట్టినట్టుంది. సుబ్బరాయుడని కర్నూల్లో మా బంధువులాయన ఒకాయనున్నాడు. ఆయన ఒకరోజు నేను హోటల్లో పని చేస్తావుంటే వెనుకనుండొచ్చి లటుక్కున పట్టేసుకున్నాడు. ఏడ్చినా... గింజుకున్నా... కిందామీదా పన్నా వదల్లేదు. పక్కనే వున్న సినిమా టాకీసులో సినిమా చూస్తున్న చలపతిగాన్ని కూడా వాటేసుకున్నాడు. ఇద్దరి చేతులూ కట్టేసి గుంజకపోయి బస్సులో ఏసినాడు. కర్నూలు చేరినాక చలపతి గాన్ని వానింట్లో అప్పజెప్పి నన్ను మా యింటికి తీస్కపోయినాడు.
ఇండ్లు దగ్గర పడుతున్న కొద్దీ నాకు గుండె దడదడా కొట్టుకోసాగింది. త్రిశూలం చేత పట్టుకోని తాండవం చేస్తున్న కాళికాదేవి లెక్క మా అమ్మ కండ్ల ముందు కనబడసాగింది. కాళ్ళూ చేతులూ కట్టేసి వారం రోజులు అన్నం పెట్టకుండా తంతాదేమోనని భయపడి కాళ్ళు ముందుకు పోడానికి మొరాయించసాగాయి. చేయి విడిపించుకోవాలని చూసినా కానీ మరింత గట్టిగా బిగుసుకోనింది. ఏ నరకం నుండి తప్పించుకోని పోయినానో మర్లా ఆ నరకంలోకే బలవంతంగా తోయబడ్తా వుంటే కండ్ల నుండి నీళ్ళు సరసరా కారిపోతావున్నాయి.
ఇంటి ముందర కొచ్చినా బైట్నుంచే మా అన్న నన్ను చూసి ''మా... హరిగాడు దొరికినాడు మా'' అని అరుచుకుంటా లోపలికురికినాడు. నాకు గుండె గుభేలుమంది. అంతలో మా అమ్మ ఎక్కడి పనులు అక్కడ వదిలేసి పరుగెత్తుకోనొచ్చి రావడం రావడం సుడిగాలి లెక్క చుట్టుకుపోయింది. నన్ను గుండెలకు కరచుకోని వెక్కి వెక్కి ఏడ్చడం మొదలుపెట్టింది. మా అమ్మ నేను పోయినప్పట్నించీ ఏడ్చీ ఏడ్చీ లోతుకు పోయిన కండ్లతో, అన్నం సరిగా తినక పీక్కుపోయిన మొఖంతో బ్రతికున్న శవంలా వుంది. అమ్మనట్లా చూస్తానే నా కండ్లలో గూడా నీళ్ళు సర్రున కారిపోయినాయి.
''రేయ్... నాయనా... ఏందిరా యిది. ఇదిగో నీ మీద ఒట్టేసి చెబుతున్నా... ఇంగెప్పుడూ నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వెయ్యను. సరేనా... ఇంగెప్పుడూ ఇట్లా చేయకురా'' అనింది ఏడుస్తా.
అదీ... ఆ తర్వాత మా అమ్మ చానా మారిపోయింది. నన్ను జాగ్రత్తగా చూసుకొనేది. మా అక్కా అన్నలకు గూడా నన్ను కొట్టాలంటే ఒకటే భయం. ఎందుకంటే మల్లా పారిపోయినానంటే పగిలేది వాళ్ళ వీపులే గదా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి