సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -199
మూల క్రిమి న్యాయము
*****
మూల అంటే కారణము, మొదలు, వేరు ఆరంభము, ఆధారము, పాఠము,మూల ధనము,మూల అనే ఒక నక్షత్రం పేరు.. మొదలైన అర్థాలు కలవు. క్రిమి అంటే పురుగు.
చెట్టు యొక్క వేరులో పురుగు చేరితే చెట్టంతా చచ్చి పోయినట్లు అని అర్థము.
అయితే ఈ విషయం అందరికి తెలిసిందే కానీ దీనిని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో వేమన గారి పద్యాన్ని చదివితే అర్థమవుతుంది.
"వేరు పురుగు చేరి వృక్షంబు జెఱచును/ చీడ పురుగు చేరి చెట్టు జెఱచు/కుత్సితుండు చేరి గుణవంతు జెఱచురా/ విశ్వధాభిరామ వినురవేమ!"
అంటే  ఏమిటంటే వేరు పురుగు ఎంత పెద్ద చెట్టునైనా నిలువుగా పాడు చేస్తుంది అంటే చనిపోయేలా చేస్తుంది.అలాంటిదే చీడ పురుగు కూడా. చిన్న చెట్టు ను నాశనం చేస్తుంది.అలాంటి వేరు పురుగు,చీడ పురుగు లాంటి చెడ్డ వాడు గుణవంతుడైన మంచివాడి  చెంత చేరితే అతన్ని నాశనము చేస్తాడు అని భావము.
ఇదే అర్థంతో భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని కూడా చూద్దామా...
"ఎడపక దుర్జనుం డొరులకెంతయు గీడొనరించునుగానియే/యెడలను మేలు సేయ డొకయించుకయైనను; జీడ పుర్వుతా/జెడదినునింతె కాక పుడిసెండు జలంబిడి పెంచ నేర్చునే/పొడవగుచున్న పుష్ఫ ఫల భూరుహమొక్కటినైన భాస్కరా!."
దుర్జనుడి యొక్క స్వభావము చీడ పురుగు లాంటిది.ఇతరులకు కీడు చేయడమే కానీ  కొంచెం కూడా మేలు చేయడు.అదెలా అంటే చీడ పురుగుకు చెట్టును నాశనము చేయడమే తెలుసుగాని, పుష్ప,ఫల వృక్షములలో ఒక్క దానికైనా పుడిసెడు నీళ్ళు పోసి పెంచుతుందా? అంటే పెంచదు కదా!
అలాగే చీడ పురుగు లాంటి దుర్జనుడికి  మంచి వారిని చెడగొట్టడము,కీడు  చేయడమే తెలుసు అనే అర్థం ఈ" మూల క్రిమి న్యాయము"లో ఇమిడి ఉంది.
 మన చుట్టూ ఉన్న సమాజంలో విష క్రిమి లాంటి వారు కొందరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు.అలాంటి వారి సహవాసం వల్ల  జీవితాలను నాశనం చేసుకున్న వారూ కనిపిస్తుంటారు.
అందుకే అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ న్యాయం ద్వారా గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు