సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -188
మలిన దర్పణ న్యాయము
*****
మలిన అంటే మలినమైన,మాసినది,నల్లనిది,దూషితమైనది అనే అర్థాలు ఉన్నాయి.దర్పణము అంటే అద్దము.
మలినముగా ఉన్న అద్దంలో కనిపించే ప్రతిబింబము కూడా మలినముగానే అంటే మసకగానే ఉంటుందనే అర్థంతో ఈ మలిన దర్పణ న్యాయము చెప్పబడింది.
 అవును కదా! మసకగా, మురికిగా ఉన్న అద్దంలో  చూసుకుంటే ఎవరి ముఖమైనా మలినముగానే కనిపిస్తుంది.మరి దీనిని  ఓ న్యాయముగా చెప్పడం అంత అవసరమా! న్యాయమా? అని కూడా అనిపిస్తుంది.కానీ పెద్దతరం చెప్పిన ఆ న్యాయము లోని ఆంతర్యం గ్రహిస్తే వారెందుకు చెప్పారో అర్థం అవుతుంది.
మన ముఖాన్ని కుడి ఎడమలుగా నైనా ఉన్నదున్నట్లు చూపేది అద్దమే.అంతరంగమనే అద్దము కూడా అంతే.మనలోని భావాలనూ, ఉద్వేగాలనూ అన్నింటినీ అంతరంగమనే అద్దము ఉన్నది ఉన్నట్లు చూపుతుంది.అంతరంగమనే అద్దాన్ని  ఈర్ష్య అసూయలు,ద్వేషాలు,పగలు,కక్షలూ, కార్పణ్యాలనే మలినాలతో మసకబరచుకుంటే  మసకగానే కనబడుతుందని ఈ "మలిన దర్పణ న్యాయము "తో ఎవరికి వారు అంతర్వీక్షణం చేసుకొమ్మని చెప్పారు.
దశేంద్రియాలు, అరిషడ్వర్గాలతో నిండిన ఈ మనశ్శరీరాలు అప్పుడప్పుడూ  ఎంత కాదనుకున్నా ఇలాంటి మలినాలతో అంతరంగాన్ని మలిన పరుస్తూ ఉంటాయి.
కాబట్టి అలాంటి వాటిని బుద్ధి అనే తుడుపు గుడ్డతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.అప్పుడే అంతరంగ దర్పణం స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా వ్యక్తిత్వం ఏమిటో ఆవిష్కృతం అవుతుంది.
మరి ఆ అంతరంగాన్ని ఆవిష్కరించేవి మాటలే.కనిపించే ముఖం అంతరంగ దర్పణం కావాలంటే మాటలు,చేతలే వాటిని వ్యక్త పరిచే వాహకాలు కావాలి.
నోటి నుండి వచ్చే ప్రతి మాటలో శుద్ధత,స్పష్టత, సత్యం అనేవి ఉండాలి. చేతలో నిబద్ధత, నిజాయితీ కనిపించాలి.
 వికారాల ధూళితో, అరిషడ్వర్గాల మలినాలతో కప్పబడిన అద్దాన్ని శుద్ధి చేసినపుడు  అంతరంగం తేజోవంతంగా ప్రకాశిస్తుంది.
 కాబట్టి "మలిన దర్పణ న్యాయము" యొక్క అసలైన అంతరార్థాన్ని తెలుసుకుని  మసలుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు