సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -202
మృగ సంగీత న్యాయము
*****
మృగము అంటే చతుష్పాద జంతువు లేడి, కస్తూరి , వెదకుట, అనుసరణము, ప్రార్థన, మృగశీర్ష నక్షత్రము అనే అర్థాలు ఉన్నాయి.
ఇక సంగీతం అంటే శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ.ఇది ప్రకృతిలో మిళితమై వుంది.ఈ ప్రపంచం/విశ్వం అంతటా వ్యాపించి ఉంది.
(సంగీతం సాహిత్యం/ కవిత్వం , శిల్పం,నాట్యం చిత్రలేఖనం... వీటిని లలిత కళలు అంటారు).
ఇక న్యాయానికి సంబంధించిన విషయంలోకి వెళ్తే...
వ్యాధుడు అంటే కోయవాడు లేదా భిల్లుడు అరణ్యంలో లేళ్ళను పట్టడానికి వల పన్ని కొంచెం దూరంలో తానుండి ఒక విధమైన రాగంతో సంగీతం ఆలపిస్తాడు. అది విన్న లేళ్ళు ఆ సంగీతానికి మైమరచి ఆకర్షింపబడతాయి. ఆ రాగము వాటి మనసులను ఒక రకమైన మోహానికి గురి చేయడంతో, పరిసరాల్ని , ప్రమాదాన్ని  గ్రహించవు. అలా ఆ లేళ్ళన్నీ అక్కడ వల ఉన్నదనే జ్ఞానాన్ని కోల్పోయి  మందలు మందలుగా వెళ్ళి ఆ వలలో చిక్కుకుంటాయి.
అలా వేటగాడి వలలో చిక్కుకునేంత వరకూ ఆ  ఆ లేళ్ళకు తెలియదు.అది తమను బంధించడానికి ఆలపించిన రాగమనీ తెలియదు.
అలాగే...  "అసార మనియు అంటే సారం లేనిదనీ,కష్టభూయిష్ఠ మనియు ఎరుగక తను జాద్యాలాపలోలుప తాకి రాత గీతా పహృతమైన మానసమున నర మృగములు రాగ మూలక సంసార వాగురిం తగుల్కొని నశిస్తాయి.
అదే విధంగా మానవులు కూడా  సంసారం అనే కాంతారం అంటే  చొరరాని చోటు గల  అడవుల్లో తిరుగుతూ భవబంధాలు, రాగ ద్వేషాలకు ఆకర్షింపబడి, మానసిక భావోద్వేగాలకు చిక్కుకుని అందులోంచి బయటికి రాలేక సంసారమనే వలలో పడి జీవితాలను ముగిస్తారంటూ....
 రాసిన వాఖ్యాతల రాధాధవ శతకము నుండి  దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పద్యాన్ని చూద్దామా...
"భవ కాంతారము మధ్యమందు స్వపరీవార ప్రలాపంబు పే/ర్దవు వ్యాధాగ్ర్యునమాన గానవిధిచే నా కృష్ట చిత్తమ్మునన్/జవ మొప్పం జని రాగ వాగురి విలగ్నంబై  మృతిం గాంచు/దిక్కెవరున్ లేమి నె చోట మర్త్య మృగ మెంతేగుంది రాధాధవా!"
అలాంటి అర్థం వచ్చేలా కంచెర్ల గోపన్న గారు తాను రాసిన దాశరథి శతకంలోని పద్యంలో ఇలా అంటారు...
"వనకరి చిక్కె మైనసకు వాచవికిం చెడిపోయె మీను తా..." అని..
అంటే పంచేంద్రియాలతో  కూడిన దట్టమైన అడవిలో చిక్కుకున్న మనసు శరీరాలు అంత తొందరగా బయటికి రాలేక తమ జీవితాలను  అక్కడే నశింప జేసుకుంటున్నారనే అర్థం ఈ "మృగ సంగీత న్యాయము"లో ఇమిడి ఉందని గ్రహించాలి.
మనిషి అంటేనే రాగద్వేషాలు,భవ బంధాలు, అరిషడ్వర్గాల వలో చిక్కుకున్న వాడు.  వాటికి అతీతంగా బయట పడి బతకడం ఏ కొందరికో సాధ్యం . ఆ కొందరిలో మనమూ కావాలని కోరుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సుమాలతో 🙏

కామెంట్‌లు