సుప్రభాత కవిత ; - బృంద
చీకటి రెప్పలతెర
తీసే వెలుగురేఖల
తొలి కిరణం తాకినంతనే
వసుధ నూతన వధువైనది

వేసవిలో వెన్నెల పూసుకున్న
ఆకాశంలో హాయిగా
వెలిగే చుక్కలన్నీ కోసుకొచ్చి
తన తలలో తురుముకున్నది.

వెన్నెల వెలుగుల్లో
జలతారంచుల పావడాలు
కట్టిన చిన్నపిల్లల్లా 
పరుగులుతీస్తున్నట్టున్న

పాలమబ్బుల సందడి
మనసులో ఆహ్లాదాన్ని నింపగా
చెవిలో మంచి కబురేదో
చెప్పాలని చుట్టూ తిరిగే గాలి..

మెలికల్లో మెరుపునీ
ఒంపుల్లో వయ్యారాన్నీ
నింపుకుని అమాయకంగా 
కదులుతున్న పచ్చనిపైరు...

పుడమి పెళ్ళిమంటపంలా
మంగళకరంగా కళకళలాడుతూ
దినకరుడి రాకతో కొత్తశోభలద్దుకుని
మనసును మురిపించే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు