నానుడి కథలు - డా.దార్ల బుజ్జిబాబు

 కుంభకర్ణ నిద్ర
===========
    పొద్దస్తమానం నిద్రపోతూ, ఎంతలేపిన లేవకుండా ఉండేవారి నిద్రను 'కుంభకర్ణ నిద్ర' గా పిలుస్తారు. ఈ నానుడి  రామాయణ కథ  నుండి పుట్టింది. 
     కుంభకర్ణుడు రావణుడి తమ్ముడు. మహా బలవంతుడు. విశాలమైన ఆకారంలో చాలా ఎత్తుగా ఉండేవాడు. యుద్ధంలో ఇతడిని జయించటం ఎవరి వల్ల కాదు.  పుట్టుకతోనే ఆకలితో పుట్టాడు. ఎంత తిన్నా ఇంకా ఆకలి అవుతూనే ఉంటుంది.. ఈ రాక్షసుడి ప్రవర్తన వలన దేవతలకు భయం పట్టుకుంది.   దేవతల రాజు ఇంద్రుడు ఇతడిని చంపటానికి ప్రయత్నించాడు. అయినా సాధ్యం కాలేదు.  కుంభకర్ణుడు తన అన్న రావణుడుతో కలిసి బ్రహ్మ నుండి వరం పొందాలని ఘోరంగా తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అదే సమయంలో సరస్వతి దేవి కుంభకర్ణుని నాలుకలోకి ప్రవేశించింది. "ఆరునెలలు నిద్ర, ఒకరోజు ఆహారం  కావాలి" అని పలికించింది. బ్రహ్మ తథాస్తు అన్నాడు. అప్పటి నుండి కుంభకర్ణుడు  ఆరునెలల పాటు నిద్రపోయేవాడు. మెలకువగా ఉన్న ఆ ఒక్కరోజు తిండికి కేటాయించేవాడు. 
        రామ రావణ యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది.  వానర సేన ముందు రాక్షస సేన తట్టుకోలేక పోతుంది.  రావణుడు అలసిపోయాడు. ఆ సమయంలో కుంభకర్ణుడు గుర్తుకు వచ్చాడు. రాక్షసులను గెలిపించగలిగిన సత్తా కుంభకర్ణుడికి మాత్రమే ఉంది.  ఘాడ నిద్రలో ఉన్న కుంభకర్ణుడిని లేపటానికి ఎంతో ప్రయత్నినించారు. గుర్రాలు, ఏనుగులతో తొక్కించారు.  చెవి ముందు పెద్ద శబ్దాలను చేశారు. అతని ఉచ్వాస నిస్వాసలకు  భటులు  వేగంగా ముక్కులోకి వెళ్లి అదే వేగంతో బయట పడుతున్నారు. ఇలా రోజుల తరబడి ప్రయత్నం చేసినా తరువాత ఎట్టకేలకు నిద్రలేచాడు. లేచిన వెంటనే తినటం మొదలు పెట్టాడు.  వెయ్యి మంది రాక్షసులు తినే ఆహారాన్ని కుంభకర్ణుడు ఒక్కడే తినగలడు. అందుకే ఎక్కువగా తినేవారిని కుంభకర్ణుడితో పోలుస్తూ కుంభాలు, కుంభాలు తింటున్నాడు అంటారు.  నిద్రపోతు, తిండిబోతు  అయిన కుంభకర్ణుడు యుద్ధభూమిలోకి చేరాడు. వానర సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టాడు.  పర్వతాలు తెచ్చి మీద పడేసిన వాటిని పిండి చేసాడు. అతడి ధాటికి రాముడి పక్షం వారు చెల్లాచెదురైపోయారు.  యుద్ధం ఏకపక్షం అయింది. రాక్షస విజయం ఖాయం అయింది. ఆ సమయంలో రాముడు వదిలిన బాణానికి కుంభకర్ణుడు హతుడయ్యాడు. ఇది కుంభకర్ణుడి కథ.
      ఏవరైనా అతిగా తింటూ, ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవారిని ఈ కుంభకర్ణ నిద్ర నానుడితో పిలుస్తారు.  అతినిద్ర, అతి తిండి హానికరాలు. ఈ అలవాటు వలన అతి బలవంతుడైన కుంభకర్ణుడు కూడా అసువులు  బాయక తప్పలేదు.  ఇది ఈ కుంభకర్ణ నిద్ర నానుడి కధ.★

కామెంట్‌లు