పరహితమే నిత్యవ్రతం;- సి.హెచ్.ప్రతాప్

 ప్రజలకు ఉపకారం చేయాలి అనే నియమాన్ని ధృఢ నిశ్చయంతో నిత్యవ్రతంగా ఆచరించటమే ‘లోకోపకార వ్రతం’ అని పేరు. కృత, త్రేత, ద్వాపరయుగాల నుండీ భరత వర్షంలో ఎందరో మహర్షులు, ఋషులు, రాజులు, చక్రవర్తులు, పండితులు, వేదవిదులు ప్రజలకోసం ఎంతో ప్రయోజనం చేకూర్చే శుభకార్యాలు లోకోపకారంకోసం నిర్వహించారు. వారు నిర్వహించిన యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, హోమాలు, తపస్సులు, జపాలు సుఖశాంతులకోసం, దేశం సుభిక్షంగా పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించేవారు. ఇందులో వారికి పర హితం, సర్వమానవ కళ్యాణం తప్ప లాభాపేక్ష లవలేశమైనా వుండేది కాదు. ప్రతీ శ్వాసలోనూ పరుల హితం కాంక్షించడమే సదాశయంగా వుండేది.
లోకంలో మంచి గంధం చల్లదనాన్ని కలుగజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగజేస్తాడు అని ప్రతీతి. ఈ రెండింటి కంటే సజ్జనుల సాంగత్యం మరింత ఎక్కువ చల్లదనాన్ని కలుగజేస్తుంది అన్నది శాస్త్ర వాక్యం. సజ్జనుల చల్లదనం అంటే.. సాటి మనుషులకు దుఃఖం కలుగజేయకుండా సంతోషాలను పంచటంగా భావించాలి.సంఘంలో శ్రేష్ఠ పురుషుడు ఎలా నడుచుకొంటాడో, ఆయనను అనుసరించే అందరూ అలాగే నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఆయన ధర్మాధర్మాలకు, మంచి చెడులకు ఏది ప్రమాణం అని చెబితే, లోకం అదే ప్రమాణాన్ని అవలంబిస్తుంది అంటుంది భగవద్గీత.
కామెంట్‌లు