స్మృతిపథం లో అమ్మ*;-- సుగుణఅల్లాణి

 1.కట్టెలపొయ్యి
——————
“పంతులమ్మా!ఓ పంతులమ్మా!!” అంటూ వినిపించిన పిలుపుకు చేతులు కొంగుకు తుడుచుకుంటూ బయటికి వచ్చింది రత్నమ్మ.
బయట వెంకట్ రెడ్డి భార్య నాగమ్మ నిలబడింది….
“ఏం! పటేలమ్మా! ఇట్లొచ్చినవు? రా లోనికి!!మొఖం నిండా నవ్వుతూ అన్నది రత్నమ్మ.
కూచో నాగమ్మా! చాయ్ దెస్త! 
“అయ్యో! వొద్దు పంతులమ్మా! ఇంతకు ముందే తాగిన ..
ఎహె! ఊర్కో! చాయ్ దేముంది ఎన్ని సార్లైన తాగొచ్చు కద!
అనుకుంటూ వంటింట్లోకి పోయింది 
తెలంగాణ ప్రాంతం లోఅదొక పల్లెటూరు!
ఆ వూరి కరణం రామారావు . భార్య రత్నమ్మ.ఎనిమిది మంది సంతానం వారికి…. 
ఆ ఊరి చుట్టూ వాగు పారుతూ ఉండడం వలన అన్ని రకాల పంటలూ పండిస్తూ ఎప్పుడూ పాడిపంటలతో పచ్చగా ఉండే ఊరు..
కరణం గారిది పెద్దఇల్లు కాకపోయినా వెయ్యి గజాల స్థలంలో ప్రహారి గోడ నుండి రెండు వందల అడుగుల దూరం లో పెద్ద దర్వాజ ఉండేది.లోపలికి వెళ్లగానే కుడివైపు ఒకటిన్నర అడుగు ఎత్తు అరుగు , దానిమీద పెద్ద జంపఖానా పరిచి ఉంటుంది.ఓ పక్క లెక్కలు రాసుకునే ఏటవాలు బల్ల, దాని మీద పెన్నులు పెట్టుకునేందుకు చిన్న స్టాండు ఉన్నది.ఎడమవైపు  లోపలికి వెళితే ….పెద్ద అంగణం ….. ముప్పై చదరపు అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు తో పొడవైన వంటిల్లు … ఎదురుగా ఇంచుమించు అంతే కొలతలతో ఒక హాలు, అందులోనే చిన్న దొంతులర్ర(store room)  ఇంకో దిక్కు వైపు స్నానాల గది మధ్యలో అంగణం … చదరంగా మూడడుగుల లోతు తో రెండు చిన్న చిన్న మెట్లతో ఉండేది… అందులో ఒక పక్క పెద్ద బాన లో నీళ్లు దానిమీద మూత  , మూత మీద ఒక చెంబు ఉంది. బయటనుండి వచ్చి కాళ్లుకడుక్కోవడానికి వీలుండేలా!
నాగమ్మ అంగణపు అరుగు మీద కూర్చొని ఉంది
ఇంతలో కరణం గారు బయటనుండి లోపలికి వస్తూ నాగమ్మను చూసినారు.
నాగమ్మ ఆయనను చూసి కొంగు చుట్టూ తిప్పి నిండ కప్పుకొని
“ నమస్తె పంతులూ! బాగున్నరా! అని అడిగింది.
“ ఆ( ..పటేలమ్మా మీరు బాగున్నరా! ఎంకట్రెడ్డి ఊళ్ల లేడా? కనవడలే నిన్నివాల?
అనుకుంట “ ఇగో ఎక్కడవోయినవు పటేలమ్మనొక్కదాన్ని కూచవెట్టి …అనుకుంటూ ముందు గదిలో ఉన్న కచ్చేరిలోకి వెళ్లిపోయిండు.
సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోతున్న కరణం గారిని చూస్తూ అట్లాగే నిలబడిపోయింది నాగమ్మ.
“ ఆ(ఆ(… వచ్చెవచ్చె … చాయ్ తెస్తున్న….ఉండుండి… మూడు స్టీలు గ్లాసుల్లో చాయ్ తీసుకొచ్చింది… 
భర్తకు టీ గ్లాసు ఇచ్చి వచ్చి
నాగమ్మకు ఒక గ్లాసు ఇచ్చి  తాను తీసుకొని అరుగు మెట్టు మీద ఇద్దరూ కూర్చున్నారు.
వేడి గా ఉన్న చాయ్ గ్లాసుని కొనకొంగుల పెట్టుకొని ఊదుకుంటూ తాగుతూ…. చెప్పు నాగమ్మా ఏంది ఇట్లొచ్చినవు… ఏమన్నా పనా?అన్నది రత్నమ్మ
ఏం లేదు పంతులమ్మా… కట్టెల పొయ్యి పర్రెలిచ్చింది ..అమ్మా!పదేళ్ల కింద నువ్వేసిచ్చిందే … నీ లెక్క పొయ్యి ఎవ్వరు ఏసియ్యరు …ఏసిస్తవేమో అని అడిగెనీకె వొచ్చిన….
రత్నమ్మ ఒక్క నవ్వు నవ్వి… “గదేం భాగ్యమా! బంగారమా! అట్లనే గానీ… దానికింత ఎన్కముందవుత వేంది?”
నాగమ్మ కొంచం సిగ్గుపడుతూ” గదేం గాదు పంతులమ్మా! నాకేమొ పొయ్యి ఎయ్యరాదు….. ఈ వాడల నువ్వు ,గా సావిత్రమ్మ ఏస్తరు….నువ్వు పట్నం ల ఉన్నప్పుడు
ఆమె ఏసిచ్చింది … ఆ రోజు నుంచి మా పటేలు పండిండంటే రెండు నెలలు లెవ్వలేదు… పట్నం దవఖానకు తీసుకపోతె…. ఐదువేలు కర్చైనయి పంతులమ్మా!… నాకెందుకో ఆ రోజు నుంచి నువ్వేసిచ్చిన పొయ్యి పడేయబుద్ధికాక వంట దానిమీద నే జేస్తున్న… మాయత్త నేమొ పర్రెలు వడ్డ పొయ్యి అంటది…ఏం జేతు జెప్పు…
“నాగమ్మా! గింతదానికి అంత పికర్ జేస్తావు.
ఏసిస్త లే!”
వంటజేసొచ్చినవా? చెయ్యాల్నా?”
“పొయ్యి మీద పెట్టొచ్చిన … అత్తమ్మ జూసుకుంటనన్నది”అన్నది నాగమ్మ
సరె గాని పిల్లలెట్లున్నరు? బాగ చదువుతున్నరా ? నాగమ్మ ను లేవనీయకుండ ఆపుతూ అడిగింది రత్నమ్మ
“ సదువులా.. ఏం సదువులు పంతులమ్మా!
నీ పిల్లలందరూ బాగ సదువుతరు… అందరికి నీ అదృష్టముంటాది…
ఎనిమిది మంది  వజ్రాలసుంటి పిల్లలు … సూడనీకె సక్కగుంటరు… తెలివిమంతులు… నీ కడుపు సల్లగుండ …
“ ఏ ఊర్కో నీ పిల్లకేమైంది?”
పోంగ పోంగ ముగ్గురు పిల్లలు బతికిరి… నాల్గోసారి మాయత్త నీచేత బొట్టువెట్టిచ్చింది నీ దయతోని ఇద్దరు మొగపిల్లలు ఒక ఆడివిల్ల బతికి బట్టగట్టిరి గాదా పంతులమ్మా..!!ఒక్క ఆడివిల్ల … మూగదాయె “గదే నాబాధంత “….. కండ్లు ఒత్తుకుంటూ బాధపడింది…
ఊర్కో ఊర్కో నాగమ్మా! ఏడ్వకు… అని ఓదార్చింది రత్నమ్మ తానూ కళ్లు తుడుచుకుంటూ…
“పంతులమ్మా! నిన్ను జూస్తె నాకు కడుపునిండుతది… నీకు నిండుదనాన్నిచ్చే నీ పొడుగు బొట్టు తోని లచ్చిందేవోలె గొడ్తవు…. నీ చీరకట్టు గూడ బలె బాగుంటది… ఎన్ని సొమ్ములేసినా నీ మొకమ్మీదున్న కళ వస్తదా ….!!మా యత్త చెప్తది నీది మంచి మనుసని … అందుకే నీ చేతితోనే పొయ్యి ఏపించాలని ఎదురుజూస్తున్నం “
రత్నమ్మ మొఖం లో ఓ వెలుగు చటుక్కున మెరిసి మాయమైంది
అట్లనే నాగమ్మా ఇవాల మంగళవారం గద 
శనివారం పొయ్యి తయారుజేసిస్త….
ఇంతలో కావలికాడు పెద్ద బుట్ట పట్టుకోని వచ్చిండు.
“ఏందిరా మల్లన్నా గది “ అడిగింది రత్నమ్మ
“పటేలింట్ల కెల్లి దెచ్చిన పంతులమ్మా!”అన్నడు 
“ఏంది నాగమ్మా! ఇవి ?గిట్ల జేస్తె నేను నీతోని మాట్లాడ జూడు….ఎందుకమ్మ ఇవన్నీ …” అని కొంచం కోపంగ అన్నది రత్నమ్మ
“ అయ్యో! కోపం జేయకు పంతులమ్మా! పండుగకు పిల్లలొస్తరని తెచ్చిన… ఏమనుకోకు నీ కాల్మొక్త… “ అని నాగమ్మ కాళ్లు మొక్కేందుకు లేచింది.
“ చాల్లే … ఏమన్నంటే కండ్ల నీల్లువెడ్తవు… బొట్టిస్త ఉండు… “
మడిగట్టుకొని ఉన్న రత్నమ్మ  కుంకుమ దెచ్చి బల్ల పీట మీద పెట్టింది 
రెండు జామ పండ్లు ఇచ్చి పంపింది
కట్టెల పొయ్యి వెయ్యడానికి వారం వర్జ్యం చూసుకొని సమయం చూసుకొని వెయ్యడం ఆ రోజుల్లో ఆచారం. 
 ….. శుక్రవారం కావలికాని తోని ఎర్రమట్టి దెప్పిచ్చింది
మూడడుగుల శాబాద బండ వెతికి తెచ్చింది
శనివారం పొద్దుననే తెల్లవారక ముందు లేచి స్నానం జేసి పూజజేసుకొని తులసమ్మకు పూజ జేసి …. అక్కడనే ఒక పీట వేసుకొని పొయ్యి వేయడానికి కూర్చుంది…  
ఈ కట్టెల పొయ్యి ఎన్నో భావోద్వేగాలతో కూడు కున్నది. ఇంట్లో పసిపిల్లల నుండి ముసలి వాళ్లదాకా అందరికీ కడుపు నింపేది. ఆరోగ్యవంతులను చేస్తుందని లక్ష్మీ పార్వతుల ప్రతిరూపం గా చూసేవాళ్లు.ప్రతి రోజు ఎర్రమట్టి పలచగా చేసి బట్టను అద్ది శుభ్రంగా అలికే వాళ్లు.ముగ్గులు పెట్టేవాళ్లు.
కట్టెలపొయ్యి అంటే మూడు రాళ్లు పెట్టి వంట చేస్తారని ఇప్పటి వాళ్లకు తెలుసు… పెళ్లిళ్లు వేడుకల్లో పెద్ద వంటలు చేసేందుకు ఇట్లాగే చేసేవాళ్లు.ఇంట్లో రోజూ వారి వంట కు చిన్న పొయ్యిని తయారు చేసుకునే వాళ్లు.
ఇది యాభై ఏళ్ల క్రితం మాట.
ఇందులో రెండు పొయ్యిలుంటాయి . మొదటి పొయ్యి కట్టెలు పెట్టడానికి … దానిపక్కన నాలుగుమూలల తో చిన్నగా మరొకటి… మొదటి పొయ్యి కి దీనికి మధ్య ఒక రంధ్రం వుంటుది. మొదటి పొయ్యిలో పెట్టిన మంట ఆ రంధ్రం ద్వారా రెండో పొయ్యి లోకి పోతుంది. దానితో రెండు వంటలు ఒకే సారి చేసుకోవచ్చు.
చిన్న చిన్న ఇటుకరాళ్ల పెట్టి ఎర్ర మట్టి తో పైనుండి పూతలు పూసి రాతి పలక మీద చక్కని పొయ్యి తయారు చేసింది రత్నమ్మ.
నీడకు ఆరబెట్టింది. పసుపు బొట్టు తెచ్చి  ఆ పొయ్యికి బొట్లు పెట్టింది.సాయంత్రం దాకా ఆరనిచ్చి కావలి కాని తో నాగమ్మ కు పంపాలి అనుకుని
తను అనుకున్నట్టు వచ్చిందా లేదా వెనుకకు జరిగి లేచి నిలబడి చూసుకుంది. తృప్తిగా నవ్వుకంటూ తలాడించి లోపలికి వెళ్లి పోయింది రత్నమ్మ.
పొయ్యి పటేలమ్మకు పంపిన రెండురోజులకు 
నాగమ్మ  పెద్ద బుట్టనిండా జామకాయలు అరటిపండ్లు ఒక మరచెంబు నిండా నెయ్యి
ఒక బుట్టనిండా రకరకాల పువ్వులు మణుగు బెల్లం ముద్ద … ఇంకా చాలా పట్టుకొని వచ్చింది. ….
……

కామెంట్‌లు