.చల్లని జాబిల్లి; - పద్మావతి పి
ఆనాడు అందని జాబిలి అందుకోవాలని కలలెన్నో కన్నాను

అమ్మా అమ్మమ్మల మమతల ఒడిలో
చందమామ కథల్లో చెట్టు కింద రాట్నం వడుకుతున్న 
ముసలవ్వను చూడాలంటూ అల్లరి ఎంతో చేసాను

పండు వెన్నెలలో అమ్మ లాలి జోలలతో ఊయలలూగాను
అదిగో మామ! అల్లదిగో చందమామ! మామను చూపెడుతూ
 ముద్దుగా గోరుముద్దలు తింటూ
మామతో కబుర్లు చెప్పాను

పసిపాపల బుగ్గల నవ్వుల్లో సిరి వెన్నెల మల్లెనై చిందులు వేసాను

అట్లతద్దంటూ పడుతుల వయసుల వయ్యారాలు ఆకాశమే హద్దుగా
చిరుజల్లుల నవ్వుల వెన్నెలలో ఊయలలూగాను

మబ్బుల చాటున దాగిన నా చెలి శశిరేఖ సురుచిర సుందర నయనాల్లో
వలపుల వెన్నెల జాబిలితో వినువీథిలొ విహరించాను

సరస రాగాల సరిగమలు పాడే  సంసారంలో వెన్నెల గీతాలాపనతో మది వీణను మీటాను

విరహంతో వేగే తలుపుల కౌగిళ్ళలో  విన్నవించుకోనా చిన్న కోరికా!
రావోయి చందమామ మా వింత గాథ వినుమా! అంటూ  
చెలరేగిన వేదనలన్నీ జాబిల్లితో పంచుకున్నాను

నా మామవు నీవంటూ, మొర వినమంటూ వేడుకున్నా ను..

ఈనాడు ఆ చల్లని చందమామ నా చేతికి అందిందని
చందమామపై అడుగేట్టిన నాకు రాయీ రప్పామట్టీ ధూళీ నిండిన
సూర్యుని చుట్టూ తిరిగుతూ వెలిగే  ఓ ఉపగ్రహమని 
తెలిసిన  కబురు శరాఘాతమై నా మనసుని నలిపేస్తుంది..
కవుల ప్రణయ కావ్యాలలో విరిసిన వెన్నెల చల్లని వెలుగులు
నిరాశా  నిట్టూర్పుల చీకటిలో కలిసిపోతున్నాయి
మామా! ఇకపై నీవు నా మామవు కాదని 
మేథాశోధనతో శాస్త్రజ్ఞుల పరిశోధనలలో ఒక గ్రహం మాత్రమేనని తెలిసిన 
మా మొరను ఆలకించగ వేరెవ్వరు లేరని!
ఏమని చెప్పను? ఎవరికి తెలుపను నా బాధాగాథను..
***************

కామెంట్‌లు