సుప్రభాత కవిత ; - బృంద
చంద్రుని చూసిన సంద్రంలా
రేపును తెచ్చే తూరుపులా
ఆశను పెంచే కోరికలా
కనుల నిండిన కలలా
ఉప్పొంగే ఊహల ఊయల లు

తీరం దాటని కెరటంలా
కన్నులు దాటని కన్నీటిలా
ప్రతి అలకూ పెరిగే ఆరాటంలా
ప్రతి క్షణమూ నిత్యపోరాటంలా
సాగే జీవిత వాహిని

అలల అలజడి నిండినా
గంభీరంగా నిలిచే  కడలిలా
కలలు కరిగి నీరైనా
పెదవుల నవ్వును నిలిపి
మాయాలోకాన మసిలే బ్రతుకు

తొలివెలుగులలో సాగరతీరం
నులివెచ్చని స్పర్శను కోరి
వేగంగా ముందుకు తరలి
కెరటం వెనుకకు మరలినా
నురుగును వదిలిన వైనం

ప్రసరించిన భానుడి వెలుగు
ప్రభవించిన బంగరు రంగులు
పసిడి వేదికలైన సైకతరాశులు
పరచిన పలుచటీ వెలుగులు
పసిపాపల్లే తారాడే అలలు

ఎద నిండుగ పండుగయేలా
మదికోరిన మధురక్షణాలు
మూపున మోపుగ  మోసుకుతెచ్చే
మనోహరమైన వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు